కరోనా నేపథ్యంలో కొత్త హీరోయిన్ల వైపు చూస్తున్న స్టార్ హీరోలు!

Update: 2020-04-17 20:30 GMT
టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు కొత్త తరాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో సినిమా పరిశ్రమ కొత్త వాళ్లను ఇంట్రడ్యూస్ చేయటానికి ఉత్సాహం చూపుతుంటుంది. ఎప్పటికప్పుడూ ఏదో ఒక కొత్తదనం చూపాలని వాళ్లు తహతహలాడుతూంటారు. స్టార్ హీరోల పక్కన కొత్త హీరోయిన్లను తీసుకోడానికి ప్రధాన కారణం.. కొత్త అమ్మాయి అయితే హీరో హీరోయిన్ల పెయిర్ ఫ్రెష్ గా ఉంటుందని దర్శక నిర్మాతలు భావించడమే అని చెప్పేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు కొత్త హీరోయిన్ ని తీసుకోవాలని స్టార్ హీరోలు ఆలోచిస్తున్నారంటే కారణం.. వాళ్ళయితే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటారు అనే చెప్తున్నారు. కారణం ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొనివున్న పరిస్థితులనే చెప్పొచ్చు.

వివరాల్లోకి వెళ్తే కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా పడిన రంగాల్లో సినీరంగం ఒకటి. ఈ సంక్షోభం నుండి సినీ ఇండస్ట్రీ బయటపడటానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు తాజాగా లాక్ డౌన్ మే 3వ తేదీ వరకు పొడిగించడంతో ఇప్పట్లో సినిమా బయటకి వచ్చే అవకాశం లేదని ఒక అంచనాకి వస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే కరోనా ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమపై వచ్చే ఏడాది చివరి వరకు కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. కరోనా ప్రభావం తగ్గి ఒకవేళ లాక్ డౌన్ ఎత్తేసినా జనాల్ని థియేటర్లకు రప్పించడం అంత తేలికైన విషయం కాదని ఇప్పటికే అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నిర్మాతలు కూడా విరివిగా డబ్బులు ఖర్చు చేసి సినిమాలు తీసే పరిస్థితి కనిపించడం లేదు. ఇకపై బడ్జెట్ విషయంలో కచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి. ఇప్పటి నుంచి హీరోలు - డైరెక్టర్లు - నిర్మాతలు ఆచితూచి అడుగులు వేసే అవకాశం ఉంది. వీళ్ళు ఖచ్చితంగా ఖర్చు తగ్గించుకునే మార్గాలని వెతుక్కోవాల్సిన పరిస్థితి.

సాధారణంగా సినిమా బడ్జెట్ లో ఎక్కువ భాగం హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్ కే కేటాయిస్తున్నారు. మన స్టార్ హీరోలందరూ ఇప్పుడు దీని గురించే ఆలోచిస్తున్నారట. వాళ్ళ రెమ్యూనరేషన్ తో పాటు హీరోయిన్ల పారితోషకం గురించి - సినిమా బడ్జెట్ గురించి కూడా ఆలోచిస్తున్నారట. స్టార్ హీరోయిన్స్ అయితే వాళ్ళ ప్రస్తుత ఫామ్ ని బట్టి కోటి నుండి మూడు కోట్ల దాకా డిమాండ్ చేస్తున్నారు. ఈ సిచ్యుయేషన్ లో వారికి అంత ముట్టజెప్పడానికి సిద్ధంగా లేరనే చెప్పాలి. అదే కొత్త హీరోయిన్ అయితే తక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వొచ్చు.. అంతేకాకుండా స్టార్ హీరోయిన్స్ పెట్టే కండిషన్స్ పెట్టకుండా మాట వింటారని ఆలోచిస్తున్నారట. స్టార్ హీరోయిన్లకు అంత రెమ్యూనరేషన్ ఇవ్వడం కంటే కొత్త హీరోయిన్ తో వెళ్తే డబ్బుకు డబ్బు మిగులుతుంది.. ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ ని పరిచయం చేసిన గుర్తింపు దక్కుతుందని స్టార్ హీరోలు భావిస్తున్నారట.

ఇప్పటికే ఈ దిశగా పలువురు హీరోలు అడుగులు వేసారంట. తమ తదుపరి సినిమాల్లో కొత్త హీరోయిన్స్ కోసం వేట మొదలు పెట్టారంట. సినిమా ఖర్చు తగ్గించడం కోసం హీరోలు తీసుకుంటున్న ఈ నిర్ణయంతో సినిమా బడ్జెట్ కొంతమేర తగ్గే అవకాశం ఉంది. అలాగే స్టార్ హీరోలు వారి రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకుంటే సినిమా బడ్జెట్ లో సగం సేవ్ అయినట్లే సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి మన హీరోలు తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంత మంది కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నారో చూడాలి.


Tags:    

Similar News