దేవ‌ర‌కొండ రొట్టె తంబీ నెయ్యిలో

Update: 2018-09-26 08:10 GMT
అవును.. ఇది నిజం! విజ‌య్ దేవ‌ర‌కొండ రొట్టె విరిగి తంబీల నెయ్యిలో ప‌డ‌నుంది. అందుకు ఇంకెంతో స‌మ‌యం లేనేలేద‌ని తెలుస్తోంది. `గీత‌గోవిందం` ఘ‌న‌విజ‌యంతో అత‌డి స్టార్‌డమ్ అసాధార‌ణంగా వెలిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఓ ర‌కంగా దేవ‌ర‌కొండ కెరీర్ ప‌రంగా మ‌రో ఐదేళ్ల పాటు నో కాల్షీట్స్ అన్న తీరుగానే ఉందంటే అతిశ‌యోక్తి కాదు. ఒకే  ఒక్క వంద కోట్ల క్ల‌బ్ సినిమా అత‌డి ఫేట్ మొత్తం మార్చేసింది. ఆస‌క్తిక‌రంగా `గీత గోవిందం` చిత్రం ఇటు తెలుగుతో పాటు అటు త‌మిళంలోనూ అంతే బాగా ఆడ‌డంతో ఇప్పుడు మ‌ద‌రాసీలంతా దేవ‌ర‌కొండ వెంట ప‌డుతున్నారు.

ఈ విష‌యంలో ప్ర‌ఖ్యాత స్టూడియోగ్రీన్ అధినేత జ్ఞాన‌వేల్ రాజా ఇత‌రుల‌తో పోలిస్తే మ‌రింత అడ్వాన్స్‌ డ్‌ గానూ ఉన్నాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు అనూహ్యంగా పెరిగిన మార్కెట్‌ ని దృష్టిలో ఉంచుకుని అత‌డు తెలివైన ఎత్తుగ‌డ వేశాడు. త‌మిళ స్టార్ హీరో .. త‌న బంధువు అయిన సూర్య తో దేవ‌ర‌కొండ‌ను క‌లిపి ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ కి స్కెచ్ వేశాడ‌ని తెలుస్తోంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ సంస్థ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌నుంది. అయితే ఇందుకు సంబంధించి పూర్తి స‌మాచారం అధికారికంగా రావాల్సి ఉందింకా. ప్ర‌స్తుతం ఈ మ‌ల్టీస్టార‌ర్‌ కి సంబంధించిన క‌థా చ‌ర్చ‌లు సాగుతున్నాయి.  ఇంకా ఓ రూపు రావాల్సి ఉంది. కొన్ని నెల‌ల్లోనే దీనిపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అంతా అనుకూలిస్తే 2019లోనే ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళుతుంద‌ని చెబుతున్నారు. సూర్య‌, దేవ‌ర‌కొండ ఇద్ద‌రికీ తెలుగు - త‌మిళ్‌ లో క్రేజు ఉంది కాబ‌ట్టి ఇరు భాష‌ల్లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే దేవ‌ర‌కొండ రొట్టె తంబీల నెయ్యిలో ప‌డిన‌ట్టే. ప్ర‌స్తుతం `నోటా` అక్టోబ‌ర్ 5న రిలీజ‌వుతోంది కాబ‌ట్టి త‌మిళ ప్ర‌మోష‌న్స్‌ లో బిజీగా ఉన్నాడు దేవ‌ర‌కొండ‌. చెన్న‌య్ నుంచి రాగానే తెలుగు ప్ర‌మోష‌న్స్ లో జోరు పెంచుతార‌ట‌.

`నోటా`తో పాటు డియ‌ర్ కామ్రేడ్ - ట్యాక్సీవాలా చిత్రాల్లో దేవ‌ర‌కొండ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాలు త‌దుప‌రి రిలీజ్‌ కి రానున్నాయి. మ‌రోవైపు సూర్య వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీ. సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో `ఎన్‌ జీకే`లో - కె.వి.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య 37లో న‌టిస్తున్నాడు. సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలోనూ వేరొక సినిమాకి క‌మిట‌య్యాడు.ఆ క్ర‌మంలోనే సూర్య‌- దేవ‌ర‌కొండ మ‌ల్టీస్టార‌ర్‌ కి స్టూడియో గ్రీన్ సంస్థ‌ స‌న్నాహాలు చేస్తోంది.
Tags:    

Similar News