సమంతను సక్సెస్ బాటలో నడిపించిన సినిమాలివే!

Update: 2022-02-15 08:37 GMT
ఏ ఇండస్ట్రీలోనైనా బలమైన సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్ నుంచి హీరోలు ఎక్కువగా వస్తుంటారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేని ఫ్యామిలీస్ నుంచి హీరోయిన్లు వస్తుంటారు. అందువలన ప్రతి సినిమా వాళ్లకి ఒక పరీక్షలాంటిదే. హిట్స్ కి .. ఫ్లాప్స్ కి అతీతమైన క్రేజ్ ను సంపాదించుకునే అవకాశం వాళ్లకి ఉండదు. హీరోల ఖాతాలోకి హిట్లు ఎంత స్పీడ్ గా వెళతాయో, ఫ్లాప్స్ కి అంత స్పీడ్ గా హీరోయిన్ బాధ్యురాలు అవుతుంది.

వరుసగా రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయితే, ఐరన్ లెగ్ ట్యాగ్ తగిలించేసి వదిలేస్తారు. అంతే ఇక ఆ హీరోయిన్ కి అవకాశం ఇచ్చే ధైర్యం దాదాపుగా ఎవరూ చేయరు.

ఇలాంటి పరిస్థితుల్లో ఒక హీరోయిన్ గా నిలదొక్కుకోవడం .. స్టార్ స్టేటస్ ను సంపాదించుకోవడం చాలా కష్టమైన విషయం. ఏ రోజుకు ఆ రోజు కొత్త కథానాయికల దిగుమతి జరిగిపోతున్న ఈ రోజుల్లో సుదీర్ఘమైన కెరియర్ ను నెట్టుకురావడం మరింత కష్టం. అలాంటి కష్టాలను అధిగమిస్తూ .. అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చిన అతి కొద్దిమంది కథానాయికలలో సమంత ఒకరు. తెలుగు .. తమిళ భాషల్లో సమంత ఒకే ఏడాదిలో పరిచయమైంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 'ఏ మాయ చేసావే' సినిమాతో ఆమె 2010లో తెలుగు తెరకి పరిచయమైంది.

కథాకథనాల పరంగా ఈ సినిమా యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. దాంతో ఇక కెరియర్ పరంగా సమంత వెనుదిరిగి చూసుకోలేదు. అదే ఏడాదిలో ఏకంగా ఎన్టీఆర్ జోడీగా 'బృందావనం' సినిమాలో చేసే ఛాన్స్ కొట్టేసింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా సమంతకి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఆ తరువాత ఏడాది వచ్చిన 'దూకుడు' సినిమాతో సమంతకు బ్లాక్ బస్టర్ హిట్ దొరికింది. మహేశ్ కి మంచి జోడీ దొరికిందని ఆయన అభిమానులు మురిసిపోయే రేంజ్ లో ఆమె అలరించింది .. ఆకట్టుకుంది.

ఇక సమంత కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచిన సినిమాల జాబితాలో 'ఈగ' ఒకటిగా కనిపిస్తుంది. హీరో 'ఈగ' రూపంలో ఉండటం వలన, తెరపై అందరికీ కనిపించేది సమంతనే. అందువలన ఇది నాయిక ప్రధానమైన సినిమా మాదిరిగా నడుస్తూ, సమంతలోని మంచి నటిని బయటికి తీసుకొచ్చిన సినిమాగా కనిపిస్తుంది. ఇక 2013 మాత్రం సమంతకి రెండు హిట్లు ఇచ్చింది. ఒకటి 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' అయితే రెండవ సినిమా 'అత్తారింటికి దారేది'. ఈ రెండు సినిమాలు కూడా సమంత స్టార్ డమ్ ను మరింతగా పెంచేశాయి.

'అత్తారింటికి దారేది' తరువాత త్రివిక్రమ్ చేసిన 'సన్నాఫ్ సత్యమూర్తి' .. 'అ ఆ' .. సినిమాలు కూడా సమంత ఖాతాలో భారీ విజయాలను నమోదు చేశాయి. 'మనం' .. 'రంగస్థలం' .. 'మజిలీ' సినిమాలు ఆమె నటనలో కొత్త కోణాలను ఆవిష్కరించాయి. చైతూతో వివాహమైన తరువాత నాయిక ప్రధానమైన కథలను ఆమె ఎక్కువగా ఓకే చేస్తూ వెళ్లింది. అలా సమంత చేసిన 'యూ టర్న్' .. 'ఓ బేబీ' సినిమాలో ఆమెకి మరింత మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఇక ఇటీవల 'పుష్ప' సినిమాలో 'ఊ  అంటావా మావా' అంటూ సమంత మాస్ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఊపేసిన సంగతి తెలిసిందే.

సమంత హీరోల సరసన ఆటాపాటలకి .. అల్లరి చేయడానికి మాత్రమే పనికి వస్తుందనుకున్న వారంతా ఆశ్చర్యపోయేలా సమంత తనకి తానుగా ఎదుగుతూ వచ్చింది. కథా భారాన్ని తన భుజాలపై పూర్తిగా మోయగలనని నిరూపించింది. ఆ కేటగిరిలో ఈ ఏడాది ఆమె నుంచి 'యశోద' .. 'శాకుంతలం' సినిమాలు రానున్నాయి. ప్రేమకి ముందు చైతూతో కలిసి 'ఏ మాయ చేసావే' చేసిన సమంత, విడిపోవడానికి ముందు చైతూకి భార్య పాత్రలో 'మజిలీ' చేయడం విశేషం.

తెలుగుతో పాటు తమిళంలోను ఆమె అంతే స్టార్ డమ్ ను పొందడం విశేషం. ఈ రెండు భాషల్లో పుష్కర కాలన్ని పూర్తిచేసిన సమంత, ఇక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాలనే ఆలోచనలో ఉంది. ఆమె ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందనేది చూడాలి మరి.

Tags:    

Similar News