డైరెక్టర్ కావాలనేదే నా డ్రీమ్!

Update: 2021-12-09 05:40 GMT
శ్రియ ముఖ్యమైన పాత్రను పోషించిన 'గమనం' సినిమా ఈ నెల 10వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న రాత్రి నిర్వహించారు.

ఈ సినిమాతో దర్శకురాలిగా సుజనారావు పరిచయమవుతోంది. ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ .. "నేను ఒక అందమైన కథను రాసుకున్నాను. ఆ కథ ఈ సినిమా కాదు .. వేరే సినిమా. ఆ కథ రాసుకుని నేను చాలామంది నిర్మాతల దగ్గరికి వెళ్లాను.

ఆ సినిమా స్టార్ట్ అవుతుందని అనుకున్నప్పుడు దానికి ఒక బ్రేక్ పడింది. డైరెక్టర్ కావాలనేది నా డ్రీమ్ .. ఈ సినిమా మొదట్లోనే ఆగిపోయిందే అని ఫీలయ్యాను.

ముందుగా నేను అనుకున్న సినిమా ఆగిపోయినప్పుడు చాలా బాధపడ్డాను. కానీ దేవుడు మన చేత అంతకన్నా మంచి ప్రయత్నం చేయించడం కోసం అలాంటి ఆటంకాలు సృష్టిస్తాడనే విషయం నాకు అర్థమైంది.

ఆ తరువాత 'గమనం' కథను రాసి జ్ఞానశేఖర్ గారికి పంపించాను. ఈ కథ చాలా బావుంది .. ఈ సినిమాను నేను నిర్మిస్తాను ఆయన మెసేజ్ పెట్టారు. శ్రియను కలవమని చెప్పారు .. కథ నచ్చడంతో ఆమె ఓకే అన్నారు. సాయిమాధవ్ బుర్రాగారిని కలిశాను .. ఆయన కూడా కథ చాలా బాగుందని అనడంతో నాకు చాలా సంతోషం కలిగింది.

ఇళయరాజా గారిని దగ్గర నుంచి చూస్తే చాలు అనుకునేదానిని. అలాంటి ఆయన కథ వినగానే ఓకే చెప్పినప్పుడు నేను పొందిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.

అలా ఒక్కొక్కటిగా ఈ సినిమాకి అన్నీ కుదురుతూ వచ్చాయి. ఈ సినిమాలో భాను .. మను గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలీ అండ్ జారా ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తుంటారు. కమల వర్తమానంలో తాను మోయవలసిన బాధ్యతను గురించి ఆరాటపడుతుంటుంది.

వినికిడి లోపం ఉన్న కమల తన బిడ్డ ఏడుపును .. నవ్వును వినాలని తాపత్రయపడుతూ ఉంటుంది. ఇలా ఈ కథ మూడు వైపుల నుంచి కొనసాగుతూ ఉంటుంది. అనూహ్యమైన మలుపులు తిరుగుతూ ఉంటుంది.

ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నన్ను నమ్మి నాతో ఈ సినిమా చేయించినందుకు, నా నిర్మాతలైన రమేశ్ గారికీ .. వెంకీ గారికీ .. జ్ఞానశేఖర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను" అంటూ ముగించారు.


Tags:    

Similar News