మణిరత్నం విసుక్కోవడంతో సుకుమార్ ఫీలయ్యాడట!

Update: 2022-01-08 08:30 GMT
దేశం గర్వించదగిన దర్శకులలో మణిరత్నం ఒకరు. ఒక దృశ్యాన్ని తెరపై చూపించడంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఆయన స్టైల్ ను అనుకరించడానికి చాలామంది దర్శకులు ప్రయత్నించారుగానీ కుదరలేదు. ఆయన తమ అభిమాన దర్శకుడు అని చెప్పుకునే దర్శకులు చాలా భాషలలో ఉన్నారు. మిగతావారి సంగతేంటో తనకి తెలియదుగానీ, తాను మాత్రం ఆయన సినిమాలను చూసే దర్శకుడిని అయ్యానని సుకుమార్ చెప్పాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, మణిరత్నం గురించి ప్రస్తావించాడు.

"నేను దర్శకుడిని కాకముందు మణిరత్నంగారి సినిమాలను ఎక్కువగా చూసేవాడిని .. ఆయన నా అభిమాన దర్శకుడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'గీతాంజలి' సినిమా నాపై ఎంతో ప్రభావం చూపించింది. నా గర్ల్ ఫ్రెండ్ ని వదిలిపెట్టి రావడానికి నేను ఎంతగా బాధపడతానో, ఆ థియేటర్ ని వదిలిపెట్టి రావడానికి అంతగా బాధపడ్డాను. ఒక దర్శకుడు ప్రేక్షకులపై అంతగా ప్రభావం చూపగలడనే విషయం నాకు అప్పుడే అర్థమైంది. అప్పుడే అనుకున్నాను నేను డైరెక్టర్ ను కావాలని. అలా నేను దర్శకుడిని కావడానికి మణిరత్నంగారు కారకులయ్యారు.

అప్పటి నుంచి కూడా మణిరత్నంగారిని ఒకసారి కలవాలని ఉండేది. నేను 'ఆర్య' సినిమా చేసిన తరువాత ఒకసారి ముంబైలోని ఒక హోటల్లో ఆయనను నేను చూశాను. ఆ సమయంలో ఆయన హీరోయిన్ శోభనతో మాట్లాడుతున్నారు. వాళ్ల చర్చలు పూర్తయిన తరువాత కలుద్దామని చాలా సేపు వెయిట్ చేశాను. కానీ వాళ్లిద్దరూ అలా మాట్లాడుకుంటూనే ఉన్నారు. దాంతో ధైర్యం చేసి 'సార్' అంటూ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయబోయాను. ఆయన నా వైపు కోపంగా చూస్తూ 'వెళ్లూ' అన్నట్టుగా చేయి ఊపారు.

నా అభిమాన దర్శకుడు నా పట్ల ఆ విధంగా ప్రవర్తించడం నాకు చాలా బాధను కలిగించింది. ఆ బాధ చాలా రోజుల పాటు ఉండిపోయింది. అయితే ఒక దర్శకుడు ఒక ఆర్టిస్ట్ తో సీరియస్ గా డిస్కస్ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే ఎంత అసహనంగా ఉంటుందనేది ఆ తరువాత నాకు అర్థమైంది. ఆ రోజున మణిరత్నంగారు అలా స్పందించడంలో తప్పేమీ లేదని అనిపించింది. ఇప్పుడు కూడా ఆయనను కలుసుకునే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు. గతంలో మణిరత్నంతో ఎదురైన చేదు అనుభవాన్ని తీపిజ్ఞాపకంగా మార్చుకోవడానికి సుకుమార్ ప్రయత్నిస్తున్నాడన్న మాట. 
Tags:    

Similar News