రంగ‌స్థ‌లం కాపీ గొడ‌వ‌పై సుక్కు ఏమ‌న్నాడంటే..

Update: 2018-05-28 16:35 GMT
ఒక పెద్ద సినిమా రిలీజై భారీ విజ‌యం సాధించిన‌పుడు క‌థ కాపీ అంటూ వివాదాలు రేగ‌డం మామూలైపోయింది ఈ మ‌ధ్య‌. ఈ వేస‌విలో మొద‌ట‌గా విడుద‌లై వ‌సూళ్ల మోత మోగిస్తూ నాన్-బాహుబ‌లి రికార్డు కూడా నెల‌కొల్పిన ‘రంగ‌స్థ‌లం’ చిత్రం విష‌యంలోనూ ఈ త‌ల‌నొప్పి త‌ప్ప‌లేదు. ఈ చిత్రం మూల క‌థ త‌న‌దంటూ గాంధీ అనే ర‌చ‌యిత ఆరోపించాడు. ఇందుకు ఆధారంగా త‌న క‌థ తాలూకు కాపీని కూడా సోష‌ల్ మీడియాలో పంచుకున్నాడు. దీనిపై ఇన్ని రోజులు రంగ‌స్థ‌లం టీం ఏమీ స్పందించ‌లేదు. సుకుమార్ కూడా సైలెంటుగా ఉన్నాడు. ఐతే ఈ వివాదం ర‌చ‌యిత‌ల సంఘం వ‌ర‌కు వెళ్లి.. పంచాయితీ కూడా జ‌రిగిన‌ట్లు ఆల‌స్యంగా వెల్ల‌డైంది.

ఈ వివాదాన్ని ప‌రిశీలించిన‌ ర‌చ‌యిత‌ల సంఘం త‌న తీర్పును వెలువ‌రించింది. గాంధీ ఆరోప‌ణ‌ల్ని కొట్టి పారేస్తూ సుకుమార్ కు అనుకూలంగా నిర్ణ‌యాన్ని వెలువ‌రించింది సంఘం. దీనిపై తీర్పును వెలువ‌రిస్తూ సుకుమార్ స్వ‌ద‌స్తూరీతో రాసిన వివ‌రణ లేఖ‌ను సంఘం జోడించింది. గాంధీ అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన రంగ‌స్థ‌లం క్లైమాక్స్ గురించి సుక్కు వివ‌రిస్తూ.. త‌న చిన్న‌పుడు ధ‌ర్మ‌యుద్ధం చూసినప్ప‌టి నుంచి త‌న‌లో మెదులుతోంద‌ని సుకుమార్ చెప్పాడు. తాను ఎంచుకున్న పాయింట్ కొత్త‌ది కాద‌ని.. సిడ్నీ షెల్డ‌న్ ర‌చించిన ‘ఎ స్ట్రేంజ‌ర్ ఙ‌న్ ద మిర్ర‌ర్’ న‌వ‌ల‌లో.. చార్లెట్ జారెట్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన టెలీ పిలింలో.. షారుఖ్ ఖాన్-మాధురీ దీక్షిత్ జంట‌గా న‌టించిన ‘అంజామ్’ సినిమాలో గాంధీ పేర్కొంటున్న ఎక్స్ ప్రెష‌న్ ఉంద‌ని సుకుమార్ తెలిపాడు. ఉరిశిక్ష ప‌డ్డ నిందితుడు ఏ గాయం లేకుండా ఉన్న‌పుడు ఉరితీయాల‌నే నిబంధ‌నను అనుస‌రించి తాను త‌న సినిమాలో స‌న్నివేశాన్ని తీర్చిదిద్దుకున్న‌ట్లు సుకుమార్ తెలిపాడు. తాను కానీ.. రంగస్థ‌లం యూనిట్ స‌భ్యులు ఎవ‌రు కానీ.. గాంధీ అనే ర‌చ‌యిత‌ను క‌ల‌వ‌లేద‌ని కూడా సుకుమార్ స్పష్టం చేశాడు. సుక్కు వివ‌ర‌ణ‌ను ఉటంకిస్తూ అత‌డికి అనుకూలంగానే ర‌చ‌యిత‌ల సంఘం తీర్పు చెప్పింది. ఇది కాపీ రైట్ కిందికి రాద‌ని స్ప‌ష్టం చేసింది. కావాలంటే గాంధీ న్యాయ పోరాటం చేయొచ్చ‌ని సూచించింది.

Tags:    

Similar News