మహేష్‌ బాబు కెరీర్‌ లో నిలిచి పోనున్న 2020

Update: 2020-06-19 08:50 GMT
ప్రపంచ చరిత్రలోనే ఈ ఏడాది ప్రత్యేకంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మహమ్మారి వైరస్‌ ఈ ఏడాది ప్రపంచంలోని ప్రతి ఒక్కరి జీవన విధానంలో మార్పు తీసుకు వచ్చింది. ఎన్నో జీవితాలను తలకిందులు చేయడంతో పాటు మరెన్నో సంస్థలు కుదేలయ్యేలా చేసింది. ఇక సినిమా పరిశ్రమకు కూడా ఈ ఏడాది రక్త కన్నీరు మిగిల్చింది అనడంలో సందేహం లేదు. ఈ ఏడాది మొదటి రెండు నెలలు మాత్రమే సినిమాలు విడుదల అయ్యాయి. ఆ తర్వాత మళ్లీ కొత్త సినిమాల జాడే లేదు. అసలు థియేటర్లు ఓపెన్‌ లేదు. టాలీవుడ్‌ అందరు స్టార్‌ హీరోలు కూడా ఏదో ఒక సినిమాను మొదలు పెట్టి ఉండటం లేదా ముగింపు దశలో ఉండటం జరిగింది. కాని మహేష్‌ బాబు మాత్రం తన కొత్త సినిమాను మొదలు పెట్టలేదు. అందుకే 2020 సంవత్సరం మహేష్‌ బాబు కెరీర్‌ లో చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది.

మహేష్‌ బాబు చాలా సంవత్సరాల క్రితం ఒక సినిమా విడుదలైన తర్వాత మరో సినిమాను మొదలు పెట్టేందుకు సంవత్సరం గ్యాప్‌ తీసుకున్నాడు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత అంటే దాదాపుగా పదేళ్ల తర్వాత మహేష్‌ బాబు తన సరిలేరు నీకెవ్వరు చిత్రం విడుదలైన తర్వాత దాదాపుగా ఏడాది పాటు పూర్తిగా కెమెరా ముందుకు రాకుండా ఉండబోతున్నాడు. సరిలేరు నీకెవ్వరు చిత్రం గత ఏడాదిలోనే పూర్తి అయ్యింది. అప్పటి నుండి కూడా షూటింగ్‌ కు మహేష్‌ బాబు దూరంగా ఉన్నాడు.

తన సర్కార్‌ వారి పాట చిత్రంను అన్ని అనుకున్నట్లుగా జరిగి పరిస్థితులు కుదుట పడితే సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ లో మొదలు పెట్టాలనుకున్నారు. కాని పరిస్థితులు చూస్తుంటే వచ్చే ఏడాది వరకు మహేష్‌ బాబు కెమెరా ముందుకు వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. పరిస్థితులు పూర్తిగా కుదుట పడ్డ తర్వాతే మహేష్‌ సెట్స్‌ పైకి వెళ్లాలని భావిస్తున్నాడు. కనుక మహేష్‌ బాబు కెరీర్‌ లో 2020 సంవత్సరంలో ఒక్క రోజు కూడా కెమెరా ముందుకు రాక పోవచ్చు అంటున్నారు. అలా మహేష్‌ బాబు ఒక్క సారి కూడా కెమెరా ముందుకు రాని సంవత్సరంగా 2020 సంవత్సరం నిలువబోతుందని అంటున్నారు.
Tags:    

Similar News