సైరా టీం నుంచి మరో ఖండన

Update: 2018-01-28 11:43 GMT
మెగాస్టార్ కొత్త సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ గురించి ఇప్పటికి ఎన్నెన్ని రూమర్లు వచ్చాయో. ఈ చిత్రం నుంచి వాళ్లు తప్పుకుంటున్నారు.. వీళ్లు తప్పుకుంటున్నారంటూ ఇప్పటికే చాలా ఊహాగానాలు వినిపించగా.. వాటన్నింటినీ ఖండించుకుంటూ వచ్చింది చిత్ర బృందం. ‘సైరా’ ఒక షెడ్యూల్ అయ్యాక కూడా ఇలాంటి రూమర్లు ఆగలేదు. చివరికి దర్శకుడు సురేందర్ రెడ్డినే తప్పించేస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ అదంతా ఉత్తదే అని తేలింది. తాజాగా ‘సైరా’లో కీలక పాత్రకు ఎంపికైన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని.. ఆయన కోసం అనుకున్న పాత్రకు ఇప్పుడు వేరే నటుడిని చూస్తున్నారని ఒక ప్రచారం మొదలైంది.

ఐతే ‘సైరా’ టీం అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ఈ చిత్రంలో అమితాబ్ కచ్చితంగా నటిస్తారని.. ఆయన షూట్ కు రావడానికి ఇంకా చాలా సమయం ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ‘సైరా’లో అమితాబ్ బచ్చన్ పాత్ర నిడివి ఎక్కువ సేపేమీ ఉండదని సమాచారం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు పాత్రలో అమితాబ్ కనిపిస్తారట. అమితాబ్ ఈ పాత్ర చేస్తే ‘సైరా’ హిందీ వెర్షన్ కు బాగా కలిసొస్తుందని.. ఉత్తరాదిన కూడా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేసుకోవచ్చని చిత్ర బృందం భావిస్తోంది. ‘బాహుబలి’ తర్వాత ఓ తెలుగు సినిమా ఉత్తరాదిన ఆ స్థాయిలో చర్చనీయాంశం కావడం ‘సైరా’తోనే కావాలన్నది చిత్ర బృందం ఆలోచన. మరి వీరి ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.
Tags:    

Similar News