ఇప్పటికి 200 కోట్లు పోయాయట

Update: 2018-04-15 07:45 GMT
ఏప్రిల్ 14 అంటే తమిళులకు చాలా ప్రత్యేకం. ఆ రోజే తమిళ సంవత్సరాది. మనం ఉగాది చేసుకున్నట్లుగా ఉండదు తమిళ సంవత్సరాది. అక్కడ ఆ రోజు చాలా సందడి ఉంటుంది. మరే పండగనూ లేనంత భారీగా దీన్ని చేస్తారు. ఆ రోజు ప్రతి సంవత్సరం భారీ సినిమా థియేటర్లలోకి దిగుతుంది. తమిళనాట థియేటర్లలో పండగ వాతావరణం నెలకొంటుంది. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. థియేటర్లు కళ తప్పి వెలవెలబోతున్నాయి. నెలన్నరగా తమిళనాట థియేటర్లు మూత పడి ఉన్న సంగతి తెలిసిందే. సమ్మె కారణంగా థియేటర్లలో సినిమాలు ప్రదర్శించడం లేదు. నెల రోజుల తర్వాతైనా పరిస్థితి మారుతుందని ఆశిస్తే అదేమీ జరగలేదు.

సినిమాలకు చాలా మంచి సీజన్ అయిన వేసవిలో థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే సమ్మె కారణంగా తమిళ సినీ పరిశ్రమకు రూ.200 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. సమ్మె లేకుంటే ఇప్పటికే మూణ్నాలుగు భారీ సినిమాలు రిలీజై ఉండేవి. ఈపాటికి ‘కాలా’ సందడి మొదలయ్యేది. ఆ చిత్రాన్ని ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలని అనుకున్న సంగతి తెలిసిందే. రజినీ సినిమా అంటే రెండు వారాల ముందు నుంచే హంగామా మొదలవుతుంది. కానీ ఈ సినిమాను సమ్మె కారణంగా జూన్‌కు వాయిదా వేసేశారు. అసలు ఈ సమ్మె ఎప్పుడు ముగుస్తుందనే విషయంలో స్పష్టత కూడా లేదు. సినిమాలపై ఆధారపడిన వేలాది కుటుంబాలు ఆర్తనాదాలు చేస్తున్నాయి. కానీ ఒక గొప్ప మార్పు వైపు అడుగులేస్తున్న తరుణంలో ఇలాంటి కష్టాలు తప్పవని అంటోంది విశాల్ నేతృత్వంలోని నిర్మాతల మండలి. మరి ఈ సమ్మె ఎప్పటికి తెగుతుందో చూడాలి.
Tags:    

Similar News