తెలుగులో పైచేయి సాధించే తమిళ హీరో ఎవరు..?

Update: 2022-10-20 04:33 GMT
దీపావళి బాక్సాఫీస్ వద్ద ఈసారి నాలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ శుక్రవారం అక్టోబర్ 21న రెండు తమిళ చిత్రాలు.. మరో రెండు తెలుగు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా' - మంచు విష్ణు 'జిన్నా' - కార్తీ 'సర్దార్' - శివ‌ కార్తికేయ‌న్ 'ప్రిన్స్' సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి.

కార్తీ - శివ కార్తికేయన్ వంటి తమిళ హీరోల సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంటుంది. గతంలో వీరు నటించిన చిత్రాలు ఇక్కడ కూడా విజయాలు సాధించాయి. అయితే ఇద్దరు కోలీవుడ్ హీరోలు కూడా ఒకే రోజు బాక్సాఫీస్ ఫైట్ కు రెడీ అవ్వడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

శివ కార్తికేయన్ నటించిన ఫస్ట్ బైలింగ్వెల్ మూవీ ''ప్రిన్స్''. 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. డి. సురేష్ బాబు - ఏషియన్ సునీల్ నారంగ్ - పుష్కుర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. టాలీవుడ్ ఫిలిం మేకర్స్ చేసిన సినిమా కావడంతో తెలుగులోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి.

మరోవైపు 'అభిమన్యుడు' దర్శకుడు పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ నటించిన సినిమా ''సర్దార్''. స్పై కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తీ విభిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నాడు. రాశీ ఖన్నా - రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తుండటంతో బజ్ ఏర్పడింది.

ఇద్దరు తమిళ హీరోలు తెలుగు ఆడియన్స్ దృష్టిని ఆకర్షించడానికి ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ రావడంతో.. తమ సినిమాలపై నమ్మకంగా ఉన్నారు. వీరికి టాలీవుడ్ ప్రముఖుల సపోర్ట్ కూడా  అందరి చూపు ఈ రెండు సినిమాలపై ఉంది.

ఓవరాల్ గా నాలుగు చిత్రాల్లో ఎవరు విన్నర్ గా నిలుస్తారనేది పక్కన పెడితే.. ఇద్దరు తమిళ హీరోలలో ఎవరు పైచేయి సాధిస్తారమేది ఆసక్తికరంగా మారింది. కార్తీ - శివ కార్తికేయన్ లలో ఎవరు తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తారు? ఎలాంటి విజయాలను అందుకుంటారు? అనేది చర్చనీయాంశమైంది.

మామూలుగా టాలీవుడ్ లో దీపావళి ని డ్రై సీజన్ గా పేర్కొంటుంటారు. ఈ టైంలో రిలీజైన సినిమాలపై పెద్దగా అంచనాలు పెట్టుకోకూడదని ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో టాక్ ఉంది. అందుకే స్టార్ హీరోలెవరూ ఈ ఫెస్టివల్ కు రావడానికి పెద్దగా ఆసక్తి కనబరిచరు. కాకపోతే ఈ స్లాట్ ని చిన్న మీడియం రేంజ్ హీరోలు క్యాష్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

మరోవైపు కోలీవుడ్ లో మాత్రం దీపాల పండుగని సినిమాలకు బెస్ట్ సీజన్ గా భావిస్తుంటారు. అక్కడ రిలీజ్ అయ్యే చిత్రాలు మంచి వసూళ్ళు రాబట్టి సూపర్ హిట్లుగా నిలుస్తుంటాయి. అందుకే అగ్ర హీరోలు సైతం ఈ ఫెస్టివల్ కు రావాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'సర్దార్' & 'ప్రిన్స్' వంటి సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. మరి ఈ దీపావళికి ఏ సినిమా ఎంత సౌండ్ చేస్తుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News