చలపతి కామెంట్లు సరే.. మరి మిగతావి?

Update: 2017-05-24 10:28 GMT
రెండు రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో చలపతి రావు కామెంట్లే హాట్ టాపిక్. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో వేడుకలో ‘అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారు..’ అంటూ చలపతి రావు చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపాయి. సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద చర్చే నడుస్తోంది. టీవీ ఛానెళ్లలో కూడా దీనిపై డిస్కషన్లు కొనసాగుతున్నాయి. అందరూ మూకుమ్మడిగా చలపతిరావు మీద పడుతున్నారు. ఐతే నాణేనికి ఒకవైపే చూస్తూ.. కేవలం చలపతి రావునే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదంటున్నారు సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. చలపతి కామెంట్లను ఖండిస్తూనే.. జనాల హిపోక్రసీ మీద గట్టిగా మాట్లాడారు తమ్మారెడ్డి.

‘రారండోయ్..’ వేడుకలో చలపతి రావు చేసిన కామెంట్లు ముమ్మాటికీ తప్పే అని.. కానీ ఇంతకుముందు చాలా వేడుకల్లో చాలామంది పెద్ద మనుషులు ఇంతకంటే దారుణమైన వ్యాఖ్యలు చేశారని.. అప్పుడు ఎవ్వరూ కూడా నోరు మెదపలేదని తమ్మారెడ్డి అన్నారు. చలపతి రావు బలహీనుడు కాబట్టి.. తిరిగి ఏమీ అనలేడు కాబట్టే ఆయన్ని అదే పనిగా టార్గెట్ గా చేసుకున్నారని.. ఇది కరెక్ట్ కాదని ఆయన అన్నారు.

 ‘రారండోయ్..’ వేడుకను యాంకర్లు నడిపించిన విధానాన్ని ఆయన తప్పుబట్టారు. అసలు చలపతిరావును.. లేడీ యాంకర్ ‘అమ్మాయిలు హానికరమా’ అని అడగడమే తప్పన్నారాయన. చలపతి రావు ఆ కామెంట్ చేశాక యాంకర్ రవి సూపర్ అనడమేంటని.. తనకు ఆయనేమన్నారో వినిపించలేదని కవర్ చేయడం సరి కాదని.. ఆ తర్వాత అయినా విషయం తెలిశాక యాంకర్లిద్దరూ ఆ విషయాన్ని తప్పుబట్ట వచ్చుగా.. లేదా బాయ్ కాట్ చేసి వెళ్లొచ్చుగా అని తమ్మారెడ్డి ప్రశ్నించారు. ఆ ఆడియో వేడుకలో ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యత వహించాలని ఆయనన్నారు.

ఇక టీవీ ఛానెళ్లలో వచ్చే బూతు కార్యక్రమాల మాటేంటని ఆయన నిలదీశారు. వీటిని జనాలు బాగానే ఎంజాయ్ చేస్తారని.. వాటి గురించి ఏమీ మాట్లాడరని.. సినిమాల్లో కూడా కావాల్సినంత బూతు ఉంటోందని.. వీటి మీద ప్రశ్నించని వాళ్లు ఒక్క చలపతి రావు మీద పడిపోవడం ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ఈ పద్ధతి సరి కాదని.. జనాలు అన్నింటిమీదా స్పందించాలని.. ప్రశ్నించాలని ఆయన ఆకాంక్షించారు.

Full View
Tags:    

Similar News