మీడియాకు తమ్మారెడ్డి క్లాస్

Update: 2018-05-10 10:32 GMT
సినీ పరిశ్రమకు.. మీడియాకు మధ్య కొంత కాలంగా ప్రతిష్టంభన నడుస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి ఇష్యూకు సంబంధించి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ సాగుతున్నారు. ఒక దశలో మీడియాను సినీ పరిశ్రమ బ్యాన్ చేయబోతున్నట్లుగా కూడా వార్తలొచ్చాయి. ఆ విషయంలో కొంచెం వెనక్కి తగ్గినా ఇరు వర్గాల మధ్య సానుకూల వాతావరణం అయితే ఇంకా ఏర్పడినట్లుగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇండస్ట్రీలో పరిస్థితులపై.. మీడియాతో సినీ పరిశ్రమకు నడుస్తున్న వార్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమను మెగా ఫ్యామిలీ నియంత్రిస్తోందన్న ఆరోపణలపైనా ఆయన స్పందించారు.

చిత్ర పరిశ్రమలో అపోహలు పెరుగుతున్నాయని.. ఇటీవల ఇండస్ట్రీలో అనుకోని పరిణామాలు జరిగాయని.. అందుకే ఇండస్ట్రీలోని ప్రముఖులందరూ చిరంజీవి నాయకత్వంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారని తమ్మారెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పారనో.. చిరంజీవి సమావేశం పెట్టారనో అందరూ దానికి హాజరవలేదని.. ఇండస్ట్రీలో సమస్యను తీర్చడానికే అందరూ ఒక్కటయ్యారని ఆయన అన్నారు. ఇండస్ట్రీని మెగా ఫ్యామిలీ నియంత్రిస్తోందన్న వార్తల్లో నిజం లేదని.. ఇండస్ట్రీలో ఫ్యామిలీలు ఉన్నాయి తప్ప.. ఫ్యామిలీల ఇండస్ట్రీ లేదని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. మీడియాను బ్యాన్ చేసే ఉద్దేశం ఇండస్ట్రీకి ఎంతమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో మీడియాకు ఆయన చురకలు అంటించారు. ఎవరిని పడితే వాళ్లను తీసుకొచ్చి చర్చల్లో ఎందుకు కూర్చోబెడుతున్నారని తమ్మారెడ్డి ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వచ్చే ఊహాగానాల్ని వార్తలుగా ఎందుకు వేస్తున్నారన్నారు. సినిమా వాళ్లను ట్రోల్ చేస్తుంటే మీడియా ఎంజాయ్ చేస్తోందని.. అలాగే ఇప్పుడు మీడియాను జనాలు ట్రోల్ చేస్తుంటే భరించాల్సిందే అని ఆయన అన్నారు. మీడియా ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని ఆయన సూచించారు.

Tags:    

Similar News