ఇండస్ట్రీలో దాసరి లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నది : క్రియేటివ్ డైరెక్టర్
టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా బాలకృష్ణ లేవనెత్తిన అంశాలు.. ఆయన చేసిన కామెంట్స్ చర్చలకు దారితీసిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీకి నష్టాలను మాత్రమే కాదు ఎన్నో వివాదాలను కూడా తెచ్చిపెట్టిందని.. టాలీవుడ్ లో మరోసారి గ్రూపు రాజకీయాలను తెర మీదకు తీసుకొచ్చిందని అందరూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ తేజ దీనిపై స్పదించారు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే తేజ ఈ అంశంపై తనదైన శైలిలో స్పందించారు. తేజ మాట్లాడుతూ ఎవరున్నా లేకున్నా ఇండస్ట్రీ పర్మినెంట్.. మధ్యలో కొంతమంది వచ్చి ఇండస్ట్రీ నా వల్లే నడుస్తుందని అనుకుంటారు.. కానీ ఇండస్ట్రీ శాశ్వతం.. నాలాంటోళ్ళు ఎందరో వచ్చిపోతుంటారు.. రామారావు గారు పోయినా ఇండస్ట్రీ నడిచింది.. సావిత్రి గారు పోయినా ఇండస్ట్రీ నడిచింది.. గొప్ప డైరక్టర్లు ఎంఎస్ రెడ్డి, హెచ్ ఎమ్ రెడ్డి, బాపు,లాంటి లేకపోయినా పరిశ్రమ ముందుకు పోతున్నది.. రాఘవేంద్రరావు, కే విశ్వనాథ్ లాంటి గొప్ప దర్శకులు మనకు ఉన్నారు. ఇలాంటి వాళ్లకు గొప్ప హోదా ఉంది. ఇలా ఎవ్వరూ లేకపోయినా ఇండస్ట్రీ నడుస్తోందని తేజ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇండస్ట్రీ తరఫున ఏ మీటింగ్ జరిగినా పెద్ద వాళ్లందరినీ పిలవాల్సిన అవసరం ఉంది.. అది ఇండస్ట్రీ గురించి జరిగిందో లేదో నాకైతే తెలియదు గానీ.. ఒకవేళ ఇండస్ట్రీకి సంబంధించిన విషయమైతే ఖచ్చితంగా చిరంజీవి గారిని పిలవాలి అలాగే బాలకృష్ణ గారిని పిలవాలని తేజ పేర్కొన్నారు. వాళ్ళే కాదు పరిశ్రమకు ఎవరైతే పిల్లర్ల లాగా ఉంటారో వారినందరినీ పిలవాలని.. ఇండస్ట్రీ అనేది ఒక ఫ్యామిలీ.. ఎవ్వరినీ చిన్నచూపు చూడకూడదని.. ఎవ్వరూ తక్కువ కాదు ఎవ్వరూ ఎక్కువ కాదు అంటూ తేజ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే దాసరి లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నదని అన్నారు. ఆయన సింహం లాంటి వాడు. ఇలాంటి పరిస్థితుల్లో దాసరి ఉంటే సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేది. దాసరి గారి తర్వాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అవసరం ఉంది. దాసరి ఉన్న రోజుల్లో లైట్ బాయ్ కూడా వెళ్లి తన సమస్యను చెప్పుకొనే వాడు. దానికి దాసరి స్పందించేవారు. సమస్య పరిష్కారం అయ్యేదని తేజ అన్నారు. దాసరి గారిని చూస్తే కాళ్ల మీద పడాలనే కోరిక కలిగేది. ఏదైనా సమస్య వస్తే సీఎంలు, కేంద్ర మంత్రులు, ప్రధానితో కేవలం ఫోన్ లోనే మాట్లాడగలిగే వారు. అలాంటి వ్యక్తులు పుట్టాలి. నేను ఏదో పేరు చెబితే సరికాదు. ఇండస్ట్రీ అంతా ఓ వ్యక్తిని అంగీకరించాలి. అలాంటి వ్యక్తే ఇండస్ట్రీకి పెద్దగా అవుతారు అని తేజ అన్నారు.