తేజ సినిమాకు కొత్త కలర్ ఎందుకొచ్చిందంటే..

Update: 2015-08-11 09:38 GMT
డైరెక్టర్ కావడానికంటే ముందు తేజ సినిమాటోగ్రాఫర్. బాలీవుడ్‌ లో ఎన్నో పెద్ద సినిమాలకు సినిమాటోగ్రఫీ చేశాడు. ఆ ప్రభావం అతడి సినిమాల్లోనూ కనిపిస్తుంది. వేరే సినిమాటోగ్రాఫర్లను పెట్టుకున్నా.. ఛాయాగ్రహణంలో తన ముద్ర ఉండేలా చూసుకుంటాడు తేజ. ఆయన సినిమాల్లో దేనికి వంక పెట్టినా సినిమాటోగ్రఫీని మాత్రం తప్పుబట్టలేం అన్నట్లుంటుంది. ఐతే తేజ దర్శకత్వంలో ఇప్పటిదాకా వచ్చిన సినిమాలతో పోలిస్తే ‘హోరాహోరీ’లో ఛాయాగ్రహణం చాలా భిన్నంగా ఉండబోతోందని.. ప్రేక్షకులకు ఈ సినిమా భిన్నమైన అనుభూతిని మిగల్చబోతోందని అంటున్నారు యూనిట్ సభ్యులు. సినిమా మెజారిటీ పార్ట్ వర్షంలోనే సాగుతుందని.. అంతే కాక ఈ సినిమాలో కనిపించే లైటింగ్ కూడా భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు.

ఐతే సినిమాటోగ్రఫీలో ఏదో ప్రయోగం చేసినట్లున్నారే అని తేజను అడిగితే.. ప్రయోగమా పాడా.. ఒక ఫెయిల్యూర్ వల్ల సినిమాకు డిఫరెంట్ లుక్ వచ్చింది అన్నాడు. ఇంతకీ ఆ ఫెయిల్యూర్ ఏంటి అని అడిగితే.. ‘‘కర్ణాటకలోని ఓ అటవీ ప్రాంతంలో మొత్తం సినిమా అంతా షూట్ చేశాం. సినిమా మేజర్ పార్ట్ వర్షంలో తీయాలి. ఐతే మామూలుగా వర్షంలో షూటింగ్ అంటే ఓ పది మంది పైపులు పట్టుకుని నిలబడతారు. రెయిన్ అనగానే నీళ్లు వదులుతారు. ఐతే ప్రతిసారీ అందరినీ కోఆర్డినేట్ చేసుకోవడం కష్టమని చెప్పి.. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ రెయిన్ మిషన్ తయారు చేశాం. ఇక లైటింగ్ కోసం అని ఈ సినిమాతో పరిచయమవుతున్న సినిమాటోగ్రాఫర్ దీపక్ భగవంత్.. ఓ పెద్ద లైట్ సెటప్ ఆర్డర్ చేసి తీసుకొచ్చాడు. ఐతే తొలి రోజు రెయిన్ మిషన్ ఆన్ చేయగానే లైట్ సెటప్ ఫ్యూజ్ పోయింది. మళ్లీ లైట్ తెప్పించడం కుదర్లేదు. దీంతో సినిమా అంతా లైటింగ్ లేకుండానే తీశాం. రాత్రుళ్లు బల్బులు పెట్టి షూట్ చేశాం. దీని వల్ల సినిమాకు ఒక కొత్త లుక్ వచ్చింది. ‘నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్’ అంటారు కదా. అలా ఈ సినిమాకు అనుకోకుండా ఓ కొత్తదనం వచ్చింది’’ అని తేజ చెప్పాడు.
Tags:    

Similar News