ఆ ముగ్గురిని మరిచిపోనంటున్న తేజ

Update: 2017-10-29 17:30 GMT
తన చిన్నతనం నుంచి ఎత్తుపల్లాలు అనేవి అలవాటైపోయాయని.. కాబట్టి ఫ్లాపులకు కుంగిపోవడం.. విజయాలకు పొంగిపోవడం అన్నది తన జీవితంలో ఎన్నడూ ఉండదని అన్నాడు దర్శకుడు తేజ. ఒకప్పుడు తాను వరుస విజయాల్లో ఉన్నపుడు తన ఇంటి హాల్లో.. పై అంతస్థులో.. ఆఫీసులో నిర్మాతలు తన కోసం ఎదురు చూసేవాళ్లని.. కానీ తర్వాత తనను ఎవ్వరూ పట్టించుకోలేదని అన్నాడు తేజ. తాను కష్టాల్లో ఉన్నపుడు.. తన ట్రాక్ రికార్డు పట్టించుకోకుండా తనకు అవకాశమిచ్చిన ముగ్గురు నిర్మాతల్ని తాను ఎప్పటికీ మరిచిపోనని తేజ చెప్పాడు. ఆ ముగ్గురూ ఎవరో.. వాళ్లు ఎలాంటి స్థితిలో తేజకు అవకాశమిచ్చారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘నేను ‘చిత్రం’ కథ చెప్పినపుడు నీకు దర్శకత్వం గురించి ఏం తెలుసు అని అడగకుండా నన్ను నమ్మి అవకాశమిచ్చిన వ్యక్తి రామోజీ రావు గారు. ఇక మా అబ్బాయి చనిపోయిన విషాదం నుంచి బయటికి వస్తున్న తరుణంలో ఆనంద్ ప్రసాద్ గారు ‘నీకు నాకు డ్యాష్’ సినిమా చేసే ఛాన్సిచ్చారు. ఇక నా కెరీర్లో వరుసగా పరాజయాలు వస్తున్న టైంలో నా ట్రాక్ రికార్డు పట్టించుకోకుండా సురేష్ బాబు గారు ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాకు అవకాశమిచ్చారు. కాబట్టి ఈ ముగ్గురినీ నేనెప్పడూ మరిచిపోను. వాళ్లు పిలిచి ఎప్పుడు సినిమా చేయమన్నా మారు మాట్లాడకుండా చేస్తాను. అది నా బాధ్యత’’ అని తేజ చెప్పాడు. నందమూరి తారక రామారావు జీవిత కథను ఎవరైనా సినిమాగా తీయాలని తనకు కోరిక ఉండేదని.. అలాంటిది బాలకృష్ణే స్వయంగా తనను పిలిచి ఈ సినిమా చేసే అవకాశమిచ్చారని తేజ ఈ సందర్భంగా చెప్పాడు.
Tags:    

Similar News