ఆ సినిమాలే ప్రాణం పోస్తున్నాయి

Update: 2016-07-27 17:30 GMT
భారీ కాంబినేషన్లు.. భారీ బడ్జెట్.. భారీ ఆశలు.. భారీ అంచనాలు.. ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి. మొన్న వేసవికి సర్దార్ గబ్బర్ సింగ్.. బ్రహ్మోత్సవం సినిమాలు కొట్టిన దెబ్బల నుంచి జనాలింకా కోలుకోలేదు. ఇంతలో ‘కబాలి’ వచ్చాడు. పాత గాయాలకు తోడు కొత్తగా ఇంకో గాయం చేశాడు. ఇకపై పెద్ద సినిమాలపై ఆశలే పెట్టుకోకూడదన్న ఫ్రస్టేషన్ వచ్చేసింది జనాలకు. ఇలాంటి టైంలోనే చిన్న సినిమాలే కొంతవరకు ఆశలు రేపుతున్నాయి. ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహం తీసుకొస్తున్నాయి. ఆల్రెడీ గత నెల వచ్చిన నాని సినిమా ‘జెంటిల్ మన్’ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తమిళ డబ్బింగ్ మూవీ ‘బిచ్చగాడు’ కూడా చిన్న సినిమానే కానీ.. పెద్ద విజయం సాధించింది.

ఇక ఈ వారం రాబోయే ‘పెళ్లి చూపులు’ సినిమాకు ఇప్పటికే పాజిటివ్ బజ్ ఉంది. ఆ సినిమాకు వస్తున్న ఫీడ్ బ్యాక్ ప్రకారం కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి అనుభూతిని మిగిల్చేలా కనిపిస్తోంది. మరోవైపు ఆగస్టు 5న రాబోయే రెండు చిన్న సినిమాలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. చంద్రశేఖర్ యేలేటి మూవీ ‘మనమంతా’ ట్రైలర్ చూశాక సినిమాపై జనాలకు మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అల్లు శిరీష్ మూవీ ‘శ్రీరస్తు శుభమస్తు’ కూడా మంచి సినిమాలాగే అనిపిస్తోంది. మొత్తానికి పెద్ద సినిమాలు ప్రేక్షకుల్ని చావుదెబ్బ కొడుతున్న సమయంలో చిన్న సినిమాలే ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. ఇకముందూ అలరించేలా ఉన్నాయి. మంచి ఛాయిస్ అవుతున్నాయి. ఇక తర్వాత రాబోయే బాబు బంగారం.. జనతా గ్యారేజ్ అయినా పెద్ద సినిమాల పట్ల జనాల్లో ఉన్న భయాన్ని పోగొడతాయేమో చూడాలి.
Tags:    

Similar News