ఏం సినిమాలండీ బాబూ..

Update: 2018-02-22 08:43 GMT
టాలీవుడ్ బాక్సాఫీస్ లో మళ్లీ స్లంప్ మొదలైంది. గత మూణ్నాలుగు వారాల్లో బాక్సాఫీస్ దగ్గర బాగానే సందడి కనిపించింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న సంక్రాంతి నిరాశ పరిచినప్పటికీ.. రిపబ్లిక్ డే వీకెండ్ నుంచి బాక్సాఫీస్ కళకళలాడింది. ‘భాగమతి’.. ‘ఛలో’.. ‘తొలి ప్రేమ’ ప్రేక్షకుల్ని అలరించాయి. మంచి వసూళ్లు సాధించాయి. గత వారం వచ్చిన ‘అ’ కూడా పర్వాలేదనిపించింది. కానీ ఈ వారం నుంచి బాక్సాఫీస్ కళ తప్పేలా కనిపిస్తోంది. అన్ సీజన్ కావడంతో సరైన సినిమాలే లేవు ఈ వారాంతంలో. చెప్పుకోవడానికి నాలుగు సినిమాలు రిలీజవుతున్నాయి కానీ.. వాటిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేవి ఏవంటే సమాధానం లేదు.

పూర్తిగా ఫామ్ కోల్పోయిన సీనియర్ హీరో శ్రీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘రా..రా’ ఉన్న వాటిలో కొంచెం చెప్పుకోదగ్గ సినిమా. కానీ ఈ హార్రర్ మూవీ మీద కూడా అంచనాలు అంతంతమాత్రమే. ‘దిక్కులు చూడకు రామయ్యా’ దర్శకుడు త్రికోటి రూపొందించిన ‘జువ్వ’ కూడా శుక్రవారమే వస్తోంది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అల్లుడి తమ్ముడు రంజిత్ హీరోగా నటించాడీ సినిమాలే. రాజమౌళి ఫ్యామిలీ బ్యాకప్ ఇస్తున్నా కూడా దీనికి బజ్ లేదు. మరోవైపు ‘పిట్ట గోడ’తో హీరోగా పరిచయమైన విశ్వదేవ్ రాచకొండ నటించిన ‘చల్తే చల్తే’ అనే సినిమా కూడా ఈ వారాంతంలోనే వస్తోంది. దీని గురించి జనాలకు అసలు పట్టింపే లేదు. ఈ సినిమాలతో పోలిస్తే తమిళ డబ్బింగ్ మూవీ ‘స్కెచ్’ పరిస్థితే నయం. విక్రమ్-తమన్నా లాంటి ప్రముఖ తారాగణం నటించిన సినిమా కావడంతో దీన్ని కొంచెం పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేస్తున్నారు. ఇదే కొంతమేర ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేలా ఉంది. పరీక్షల సీజన్ మొదలవడంతో ఇంకో నెల రోజుల పాటు బాక్సాఫీస్ వెలవెలపోక తప్పదనే అనిపిస్తోంది.


Tags:    

Similar News