గురువారం వైపు పరిశ్రమ చూపు

Update: 2018-06-14 02:30 GMT
సాధారణంగా సెంటిమెంట్స్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చే సినిమా పరిశ్రమలో క్రమక్రమంగా పెరుగుతున్న పోటీ వల్ల వాటికి మంగళం పాడాల్సి వస్తోంది. ముఖ్యంగా విడుదలకు చాలా కీలకంగా భావించే శుక్రవారం మెల్లగా తన వరస మార్చుకుంటోంది. వారానికి ఒక్క రోజును మాత్రమే విడుదలకు పెట్టుకోవడం ఒకే వారంలో రావాలనుకున్న సినిమాలకు ప్రతిబంధకంగా మారింది. దాని వల్ల అవాంఛనీయమైన పోటీకి వెళ్లి వసూళ్లు పోగొట్టుకుంటున్న సందర్భాలు ఇటీవలి కాలంలోనే ఎక్కువగా జరిగాయి. అందుకే దీనికి పరిష్కారంగా గురువారం విడుదల అనే కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టేస్తున్నారు. ఇప్పుడేమి కొత్తగా మొదలైంది  కాదు కానీ రెగ్యులర్ గా గురువారం వచ్చే సినిమాలు గతంలో తక్కువగా ఉండేవి. ఇప్పుడు మాత్రం కనీసం ఒక్కటైనా ఉండే పరిస్థితి వచ్చేసింది. ఈ వారంలో ఒకే రేంజ్ హీరోలు ఇద్దరు కళ్యాణ్ రామ్ సుధీర్ బాబు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడనున్నారు. ఇద్దరికున్న మార్కెట్ కున్న దృష్ట్యా సై అంటే సై అనడం శ్రేయస్కరం కాదు. అందుకే నా నువ్వే రేపు వస్తుండగా సమ్మోహనం ఎల్లుండి విడుదల కానుంది. ఇది మంచి పరిణామమే.

గత వారం సూపర్ స్టార్ రజినీకాంత్ కాలా వచ్చింది కూడా గురువారమే. బ్యానర్ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ మహానటిని వైజయంతి సంస్థ రిస్క్ తీసుకుని మరీ మే 9 విడుదల చేసింది. ఆ రోజు బుధవారం. అది ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో చెప్పనక్కర్లేదు. నాని కృష్ణార్జున యుద్ధం విడుదల ఏప్రిల్ 12 గురువారం.నితిన్ చల్ మోహనరంగా రిలీజ్ చేసిన ఏప్రిల్ 5 కూడా గురువారమే. వీటికి భిన్నంగా అనారోగ్యంగా పోటీ ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో వరుణ్ తేజ్ తొలిప్రేమ శనివారం విడుదల చేసారు. ఇలా చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. కానీ అధిక శాతం ఇందులో గురువారం ఉండటం గమనార్హం. అంటే వీక్ ఎండ్ ఎక్కువ దొరుకుతుంది అనే ఉద్దేశంతో పాటు సినిమా టాక్ కనక బాగా వస్తే అది మరో అదనపు రోజు వసూళ్లకు సహాయ పడుతుంది. అందుకే ఇలా శుక్రవారం సెంటిమెంట్ కాస్త రూపు మారి గురువారాన్ని కూడా తనకు తోడు తెచ్చుకుంది. ఇవన్నీ ఓకే కానీ వారం ఏదైనా సినిమాలో కంటెంట్ ఉంటె వారాల లెక్క కాదు వసూళ్ల లెక్క తెరమీదకు వస్తుంది.
Tags:    

Similar News