గ్యాప్ వస్తే మేకోవర్ చేసేస్తున్నారు

Update: 2017-11-23 17:30 GMT
స్టార్ హీరోలకు సినిమా సినిమాకి గ్యాప్ రావడం గతంలో కనిపించేది కాదు. కానీ ఇప్పుడు మూవీ బడ్జెట్లు పెరిగిపోయాయి.. జనాల టేస్ట్ మారిపోతోంది. అందుకే కొత్తగా ఏదైనా చూపించాలనే తపన హీరోల్లో కూడా పెరిగిపోతోంది. అందుకే స్టోరీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా.. తమకు తగిన.. అభిమానులను అలరించే కథలను మాత్రమే చేస్తున్నారు. ఇందుకోసం కొంత విరామం తీసుకోవాల్సి వచ్చినా ఏమాత్రం సందేహించడం లేదు.

ఈ ఏడాది జనవరిలో ఖైదీ నంబర్150తో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. తన తర్వాతి సినిమా షూటింగ్ ను డిసెంబర్ లో మొదలుపెడుతున్నారు. అంటే దాదాపు ఏడాది గ్యాప్ వచ్చింది. ఈ సమయం అంతా సై రా నరసింహారెడ్డి స్క్రిప్ట్ పనులతో పాటు.. తను చేయనున్న ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రకు అనువుగా మార్చుకునేందుకు ఉపయోగించుకున్నారు చిరు. రీసెంట్ గా టెస్ట్ షూట్ కూడా పూర్తి చేసుకున్నారు.

గురు మూవీని గతేడాదిలోనే పూర్తి చేసిన సీనియర్ హీరో వెంకటేష్.. ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈయన నటించబోయే కొత్త సినిమా కూడా డిసెంబర్ లోనే మొదలు కానుంది. ఈ ఏడాదంతా గ్యాప్ తీసుకున్న వెంకీ.. తన ఫిజిక్ ను మార్చుకునే పనిలో గడిపేస్తున్నారు. ఫిట్నెస్ పై ముందు నుంచి బోలెడంత శ్రద్ధ ఉన్న వెంకటేష్.. తేజ దర్శకత్వంలో రూపొందబోయే పొలిటికల్ స్టోరీలో కొత్త లుక్ తో కనిపిస్తారట.

జై లవ కుశ తర్వాత ఎన్టీఆర్ కి కూడా కొన్ని నెలల గ్యాప్ అవసరం అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పవన్ మూవీ పనులను పూర్తి చేయాల్సి ఉండడంతో.. జనవరి చివరి వరకూ ఎన్టీఆర్ కి గ్యాప్ వచ్చింది. అయితే.. ఈ సమయాన్ని తన ఫిజిక్ ని మార్చుకునేందుకు ఉపయోగించుకుంటున్నాడట యంగ్ టైగర్. మాటల మాంత్రికుడి సినిమాలో కొత్త మేకోవర్ తో.. ఫ్యామిలీ హీరో అప్పియరెన్స్ చూపించనున్నాడని టాక్.

బాహుబలి కోసం విపరీతంగా బాడీ పెంచిన ప్రభాస్.. ఆ మూవీ షూటింగ్ పూర్తయ్యాక ఏడెనిమిది నెలల పాటు జిమ్ లో గడిపాడు. సాహో చిత్రం కోసం బాహుబలి గెటప్ నుంచి బోలెడంత మారిపోయాడు యంగ్ రెబల్ స్టార్. వీళ్లే కాదు.. వరుణ్ తేజ్.. నితిన్.. రామ్ వంటి యంగ్ హీరోలు అంతా సినిమాలకు ఏ మాత్రం గ్యాప్ వచ్చినా కొత్త గెటప్ లతో రెడీ అయిపోతున్నారు.. మేకోవర్ చేసేస్తున్నారు.
Tags:    

Similar News