మన హీరోలు నోరు మెదపరా?

Update: 2018-03-10 11:00 GMT
తమిళనాట జల్లికట్టు మీద నిషేధాన్ని తొలగించాలంటూ పెద్ద ఎత్తునే ఆందోళనలు జరిగాయి. అది చూసి ఇక్కడున్న మన హీరోలకు సైతం రోమాలు నిక్కబొడుచుకున్నాయి. వరుసబెట్టి ఒక్కొక్కరు సోషల్ మీడియా వేదికగా తమ గళం వినిపించారు. ఆ ఆందోళనలకు మద్దతు ప్రకటించారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తేయాల్సిందే అంటూ నినదించారు. మామూలుగా మాకు రాజకీయాల గురించి తెలియదు అని చెప్పుకునే హీరోలు కూడా రాజకీయాంశంగా మారిన జల్లికట్టు మీద మాట్లాడటానికి వెనుకాడలేదు. మహేష్ బాబు.. జూనియర్ ఎన్టీఆర్.. అల్లు అర్జున్.. నాగార్జున.. వెంకటేష్.. ఇలా చాలామంది పెద్ద తారలు జల్లికట్టుకు మద్దతుగా గళం విప్పిన వాళ్లే.

కానీ విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయి ఆంధ్రప్రదేశ్ కష్టపడుతున్నా.. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నా.. మన హీరోలకు పట్టట్లేదు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా.. ఇతర డిమాండ్లతో ఆంధ్రా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా పోరాడుతున్నాయి. కానీ ఏ రోజూ మన హీరోలకు ఇది తీవ్రమైన విషయంగా కనిపించడం లేదు. రాష్ట్రానికి జరుగుతున్న నష్టం మీద వీరికి ఆందోళన లేదు. రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్.. బాలకృష్ణ.. శివాజీ లాంటి వాళ్లు ముందు నుంచి దీని మీద మాట్లాడుతుండగా.. నిఖిల్ లాంటి ఒకరిద్దరు మాత్రమే ప్రత్యేక హోదా విషయంలో గళం వినిపించారు. కేంద్రంపై పోరాటాన్ని ఉద్ధృతం చేయాల్సిన ప్రస్తుత తరుణంలో మన హీరోలు సైలెంటుగా ఉన్నారు. మొన్న కొరటాల శివ ఒక కామెంట్ చేస్తే దానిపై పెద్ద చర్చే జరిగింది. అలాంటపుడు హీరోలందరూ గళం విప్పితే.. కేంద్రం మీద విమర్శనాస్త్రాలు ఎక్కు పెడితే.. ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తే జాతీయ స్థాయిలో చర్చ జరిగే అవకాశముంది. నేషనల్ మీడియా కూడా దీనిపై స్పందించే అవకాశముంది. అప్పుడు కేంద్రానికి కాక తగులుతుంది. మరి మన హీరోల్లో ఇప్పుడైనా చురుకుపుడుతుందా? తమకు జన్మనిచ్చిన రాష్ట్రం కోసం.. తమను ఇంతవాళ్లను చేసిన జనాల కోసం ఇప్పటికైనా స్పందిస్తారా?
Tags:    

Similar News