తమిళులకు వలేస్తున్న తెలుగు స్టార్లు

Update: 2017-03-05 07:26 GMT
పక్క రాష్ట్రాల్లోని మార్కెట్ పై కన్నేయడంలో మనోళ్లు కాస్త లేట్ అయ్యారనే చెప్పాలి. అనేక మంది తమిళ హీరోలు తెలుగులో చెలరేగిపోతుండగా.. తెలుగు హీరోలకు ఈ విషయంలో కాసింత ఆలస్యంగా జ్ఞానోదయం అయింది. ముఖ్యంగా తమిళనాడు మార్కెట్ ను దక్కించుకునేందుకు పలువురు తెలుగు స్టార్లు తెగ పోటీపడుతున్నారు.

హిందీ-తెలుగు భాషల్లో మార్కెట్ ఉన్న దగ్గుబాటి రానా.. బెంగళూరు నటక్కల్ వంటి చిత్రాలతో తమిళంలో కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు. బాహుబలిలో భల్లాలదేవుడి పాత్ర తర్వాత ఎనలేని గుర్తింపు దక్కడంతో.. దాన్ని బేస్ చేసుకుని.. ఆ తర్వాత తన సినిమాలన్నీ ద్విభాషా.. త్రిభాషా చిత్రాలుగా ఉండేలా జాగ్రత్తపడుతున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ఘాజీ ఇందుకు చక్కని ఉదాహరణ. ప్రస్తుతం 1945 అనే తెలుగు తమిళ ద్విభాషా చిత్రం.. ఎన్నైనోక్కి పాయుం తోట్టా అనే తమిళ మూవీ చేస్తున్నాడు. తేజ దర్శకత్వంలో రూపొందుతున్న నేనే రాజు మంత్రి కూడా ద్వి భాషా చిత్రమే అంటున్నారు.

ఇప్పటికే కేరళలో పాగావేసి అందరు తెలుగు హీరోలకు రూట్ చూపించిన అల్లు అర్జున్.. ఇప్పుడు తమిళనాడుపై దృష్టి పెట్టాడు. లింగుస్వామితో సినిమా చేయడంలో ఇదే మెయిన్ రీజన్ కాగా.. ఈ చిత్రం ప్రారంభం కూడా చెన్నైలోనే జరిపారు. మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా తమిళంలోనే మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నాడు బన్నీ.

మహేష్ బాబు కూడా ఇప్పుడు తమిళనాడుపై దృష్టి పెట్టాడు. అందుకే మురుగదాస్ తో మూవీ చేస్తున్నాడు. సంభవామి అనే టైటిల్ దాదాపు ఖాయం చేశారనే టాక్ ఉన్నా.. దీనిపై కన్ఫర్మేషన్ లేదు. ఇప్పటికే ఊపిరి వంటి బైలింగ్యువల్ ని అందించిన వంశీ పైడిపల్లితో చేయనున్న మూవీ కూడా తెలుగు-తమిళంలో రూపొందుతున్నదే అంటున్నారు.

బాహుబలితో ప్రభాస్ ఇప్పటికే నేషనల్ వైడ్ గా గుర్తింపు సంపాదించాడు. దీని తర్వాత సుజిత్ దర్శకత్వంలో చేయనున్న మూవీని.. తెలుగు-తమిళ్-హిందీల్లో చిత్రీకరించబోతున్నారంటే.. ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది.

కెరీర్ ప్రారంభం నుంచి ఇటు తెలుగు.. అటు తమిళ సినిమాల్లో నటిస్తున్నాడు సందీప్ కిషన్. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు తమిళంలోనే ఈ హీరోకి ఎక్కువ సినిమా ఛాన్సులు ఉండడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News