'తలైవి' బాహుబలి రైటర్ మాట విని ఉంటే..!

Update: 2021-09-29 02:30 GMT
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రూపొందిన తలైవి చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ గా ఈ సినిమాను రూపొందించారు. అమ్మ జీవితం కంటే ఇతర విషయాలు సినిమాలో ఎక్కువ అయ్యాయి. కమర్షియల్‌ యాంగిల్‌ లో సినిమా తీయాలనే ఉద్దేశ్యంతో అమ్మ జీవితాన్ని అర్థవంతంగా చూపించడంలో దర్శకుడు విజయ్ విఫలం అయ్యాడు అంటూ తమిళ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమిళంతో పాటు హిందీ.. తెలుగు ఇతర భాషల్లో కూడా విడుదల అయిన తలైవికి ఎక్కడ కూడా మంచి ఆధరణ దక్కలేదు. ఈ సినిమా నిరాశ పర్చడంపై ప్రస్తుతం యూనిట్ సభ్యులు పోస్ట్‌ మార్టం చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాతలు దర్శకుడు విజయ్ పై అసంతృప్తితో ఉన్నారు. బడ్జెట్‌ ను అనుకున్న దాని కంటే పెంచేశాడు.. సినిమా ఫలితం నిరాశ పర్చిందని ఆగ్రహంతో ఉన్నారు. విజయ్ పారితోషికంలో కొంత మొత్తంను వెనక్కు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నట్లుగా బాలీవుడ్‌ మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ సమయంలోనే సినిమా పై విజయేంద్ర ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశాడని.. దర్శకుడు విజయ్ చేసిన పనితో సినిమా నిరాశ పర్చిందని అంటున్నాడట. విజయేంద్ర ప్రసాద్‌ ఈ సినిమా కు రచయితగా వ్యవహరించారు. కంగనాకు చాలా నమ్మకస్తుడిగా పేరున్న విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్‌ సమయంలో మొత్తం అన్ని తానే అన్నట్లుగా చూసుకున్నాడు. సినిమాలో జయలలిత జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించడంతో పాటు సినిమా లో కాస్త కమర్షియల్‌ ఎలిమెంట్స్ కూడా జోడించి ఆయన స్క్రిప్ట్‌ ను ఇవ్వడం జరిగిందట. కాని దర్శకుడు సెట్స్ పైకి వెళ్లిన తర్వాత మెల్ల మెల్లగా స్క్రిప్ట్‌ ను మార్చుతూ వచ్చాడు. కంగనా కూడా విషయాన్ని పట్టించుకోకుండా దర్శకుడు చెప్పిన విషయానికి ఓకే చెప్పింది. విజయేంద్ర ప్రసాద్‌ లీడ్స్ పూర్తిగా పక్కన పెట్టిన తన టీమ్‌ తో దర్శకుడు విజయ్ రచన చేయించాడని అందుకే ఈ ఫలితం అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

కంగనాకు విజయేంద్ర ప్రసాద్‌ అంటే ప్రత్యేకమైన అభిమానం గౌరవం ఉంది. అలాంటి విజయేంద్ర ప్రసాద్‌ ఇచ్చిన స్క్రిప్ట్‌ విషయంలో దర్శకుడు విజయ్ కు వ్యతిరేకంగా స్టాండ్‌ తీసుకుని ఉంటే నేడు తలైవి ఖచ్చితంగా నలుగురు మెచ్చే విధంగా ఉండేది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్‌ గతంలో మణికర్ణిక సినిమాకు రచన సహకారం అందించగా ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కాని ఇప్పుడు మాత్రం తలైవి కి ఆయన వర్క్ ను ఉపయోగించని కారణంగా నిరాశ పర్చింది. ఖచ్చితంగా బాహుబలి వంటి బిగ్గెస్ట్‌ సక్సెస్ మూవీకి కథను అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్‌ మాట విని ఉంటే తలైవి ఖచ్చితంగా మంచి సినిమాగా నిలిచేది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్ కూడా. విజయేంద్ర ప్రసాద్‌ ఈ విషయంలో నిర్మాతలతో మాట్లాడి అసంతృప్తి వ్యక్తం చేశాడని టాక్‌ వినిపిస్తుంది.
Tags:    

Similar News