'చాక్లెట్‌ లో ఆవకాయ్‌ అడిగితే ఎలా?'.. 'రాధేశ్యామ్' పై థమన్ కామెంట్స్..!

Update: 2022-03-14 05:58 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్స్ - సాంగ్స్ తో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ పీరియాడికల్ లవ్ స్టోరీకి మొదటి రోజు కాస్త మిశ్రమ స్పందన వచ్చింది. విజువల్ ట్రీట్ అంటూనే స్లోగా సాగుతూ బోర్‌ కొట్టించిందనే కామెంట్స్ వచ్చాయి.

'బాహుబలి' 'సాహో' వంటి సినిమాల తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలో యాక్షన్ లేకపోవడం మెజారిటీ ఫ్యాన్స్ ని నిరుత్సాహ పరిచింది. అయితే ఒక ఫ్యూర్ లవ్ స్టొరీని చెప్పే క్రమంలో ఫైట్స్ పెట్టడం కరెక్ట్ కాదనే ఉద్దేశ్యంతో 'రాధేశ్యామ్' మేకర్స్ యాక్షన్ ని జోడించలేదని చెబుతూ వస్తున్నారు.

ఇదే విషయాన్ని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఇటీవల మీడియా ఇంటరాక్షన్ లో వెల్లడించారు. 'రాధేశ్యామ్' చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించిన ఎస్ఎస్ థమన్ సైతం ఈ విషయంలో డైరెక్టర్ కు మద్దతుగా నిలిచారు. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ ఒక లవ్ స్టోరీ చేయడానికి ఎంతో గట్స్ కావాలన్నారు.

''రాధేశ్యామ్ సినిమా లవ్ జోనర్ లో రూపొందింది. ఇందులో యాక్షన్ సన్నివేశాలను ఎలా ఆశించగలం. మీరు చాక్లెట్‌ లో ఆవకాయ్‌ అడిగితే ఎలా?. ఇది చాక్లెట్‌ లాంటి స్వీట్ ఫిలిం. 'సాహో' సినిమాలో ప్రేమ లేదన్నారు. ఇప్పుడు 'రాధేశ్యామ్' లో యాక్షన్ లేదంటున్నారు'' అంటూ థమన్ విమర్శకులు కౌంటర్ ఇచ్చారు.

అంతకముందు సోషల్ మీడియాలో 'రాధేశ్యామ్' పై వస్తున్న నెగెటివిటీని థమన్ తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. సినిమా స్లోగా ఉందన్నవాళ్లకు కౌంటరిచ్చేలా ఉన్న ఓ మీమ్‌ ను ట్విటర్‌ లో షేర్‌ చేశాడు. ‘సినిమా ఎలా ఉంది?’ అన్న ప్రశ్నకు బాగా స్లోగా ఉందని చెప్పగా.. ‘నేను అడిగింది బాగుందా? బాలేదా? అని.. లవ్‌ స్టోరీ స్లోగా కాకుండా ఫస్ట్‌ హాఫ్‌ లో ఫస్ట్‌ నైట్‌.. సెకండాఫ్‌ లో సెకండ్‌ సెటప్‌ పెట్టాలా ఏంటి?’ అనే మీమ్ లో పేర్కొన్నారు.

దీనికి ‘మీమ్‌ అదిరింది.. స్లో అంట.. నువ్వు పరిగెత్తాల్సింది’ అంటూ థమన్ ట్రోలర్స్‌ పై సెటైర్‌ వేస్తూ ట్వీట్ చేశాడు. 'బ్లాక్‌ బస్టర్‌ రాధేశ్యామ్‌' అనే హ్యాష్‌ ట్యాగ్‌ ను జత చేశాడు. ఏదేమైనా ప్రభాస్ సినిమాకు థమన్ అందించిన నేపథ్య సంగీతానికి మంచి మార్కులే పడ్డాయి. ఇటీవల కాలంలో మాస్ చిత్రాలకు అదిరిపోయే బీజీఎం ఇస్తున్న థమన్.. 'రాధేశ్యామ్' వంటి ఫ్యూర్ లవ్ స్టోరీకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడని ఆడియన్స్ అంటున్నారు.
Tags:    

Similar News