ఆ నిబ‌ద్ధ‌త నాయుడు గారికే సాధ్యం!

Update: 2019-10-06 06:25 GMT
తెలుగు సినీ చ‌రిత్ర‌లో గొప్ప నిర్మాత‌లు కొంత మందే. అందులో గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందిన డా. డి.రామానాయుడు పేరు ముందు వ‌రుస‌లో వుంటుంది. నిజాయితీకి.. నిబ‌ద్ధ‌త‌కు నిలువెత్తు రూపం అని ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేసిన వాళ్లు ఇప్ప‌టికీ చెబుతుంటారు. నాయుడు గారి సినిమాల్లో న‌టిస్తే పారితోషికం ఇంటికి న‌డిచొచ్చేద‌ట‌. సెట్లో ఓ నిర్మాత‌లా కాకుండా సాటి టెక్నీషియ‌న్ తో క‌లిసి కెమెరా ట్రాలీ తోసిన రోజులు కూడా వుండేవంటే ఆయ‌న సింప్లిసిటీని.. త‌ను చేప‌ట్టిన ప‌ని ప‌ట్ల ఆయ‌న‌కున్న నిబ‌ద్ధ‌త‌ను తెలియ‌జేస్తుంది. అందుకే ఆయ‌న‌ను నేటి త‌రం నిర్మాత‌లు స్ఫూర్తిగా తీసుకుంటారు.

గ‌తంలో సీనియ‌ర్ న‌టి.. బామ్మ పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన నిర్మ‌ల‌మ్మ‌కు లెజెండ‌రీ నిర్మాత రామానాయుడుకు మ‌ధ్య ఓ సంద‌ర్భంలో జ‌రిగిన సంభాష‌ణే ఇందుకు అద్దంప‌డుతోంది. 2009లో నిర్మ‌ల‌మ్మ చ‌నిపోయారు. అయితే ఆమె న‌టిగా వ‌రుస సినిమాల‌తో బిజీగా వున్న స‌మ‌యంలో పారితోషికం విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ ఒక‌టి జ‌రిగింది. అప్ప‌టికే నిర్మ‌ల‌మ్మ రామానాయుడు నిర్మించిన మూడు చిత్రాల్లో నటించింది. కానీ పారితోషికం మాత్రం తీసుకోలేదు. ఈ విష‌యం తెలిసి రామానాయుడు ఆమె న‌టిస్తున్న ఓ సినిమా లొకేష‌న్ కి వెళ్లాడ‌ట‌. అక్క‌డ ఇద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ ల్ఓ నిర్మ‌ల‌మ్మాగారు మా సంస్థ మూడు చిత్రాల‌కు సంబంధించిన పారితోషికాన్ని మీకు చెల్లించింది. కానీ మీరు ఆ మొత్తాన్ని తీసుకోలేద‌ని తెలిసింది. ఎందుకిలా చేస్తున్నారు? మా ఆడిట‌ర్స్‌కి నేను ఏమ‌ని చెప్పుకోవాలి?. అన్నార‌ట నాయుడుగారు. దానికి నిర్మ‌ల‌మ్మ స్పందిస్తూ.. ``నాయుడు రేపు ఏం జ‌రుగుతుందో ఎవ‌రికి తెలుసు. నీ ద‌గ్గ‌ర డ‌బ్బులు ఎక్క‌డికి పోతాయి. ఆ డ‌బ్బులు నీ ద‌గ్గ‌రే భ‌ద్రంగా వుంచు. ఆ డ‌బ్బుల‌తో మీరే నా క‌ర్మ కాండ‌లు జ‌రిపించండి`` అందంట‌. దానికి నాయుడు బ‌దులిస్తూ ``అమ్మా ఎవ‌రు ముందు పోతారో ఎవ‌రికి తెలుసు?. మీకంటే ముందే నేను వెళ్లిపోతే మీ డ‌బ్బుల ప‌రిస్థితేంటీ? అని అయితే ఈ విష‌యంలో నాకు ఎలాంటి బాధ‌లేదు. భ‌యం లేదు. మీ పిల్ల‌లు ర‌త్నాలు. నేను అబ‌ద్ధం చెప్పినా మీ గౌర‌వానికి భంగం క‌ల‌గ‌నివ్వ‌రు`` అని చెప్పింద‌ట‌. ఇదీ రామానాయుడి నిజాయితీ అంటే.

సురేష్ కాంపౌండ్ శాల‌రీల నిబ్ధ‌త ఇప్ప‌టికీ అలానే ఉంటుంది. నిర్మ‌ల‌మ్మ‌తో పాటు ఇండ‌స్ట్రీలో వున్న ప్ర‌తీ ఒక్క‌రిలోనూ రామానాయుడు ప‌ట్ల ఇదే భావ‌న ఉంది. తాడు - బొంగ‌రం లేని కంపెనీలు జీతాలిస్తామ‌ని మోసం చేసే కంపెనీల‌కు టాలీవుడ్ లో కొద‌వేమీ లేదు. అలాంటి వాటి విష‌యంలో న‌టీన‌టులు జాగ్ర‌త్త‌గానే ఉంటున్నారు. పైగా తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో ద‌ళారీలు కో ఆర్డినేట‌ర్ల‌కే స‌గం జీతం స‌మ‌ర్పించుకుంటున్నామ‌ని న‌టీన‌టులు ల‌బోదిబోమంటున్నారు. ఇంత‌కుముందులా విలువ‌లు ఇప్పుడెక్క‌డున్నాయ‌ని!!
Tags:    

Similar News