ఆ హీరో ప్రవర్తనలో చాలామార్పు వచ్చింది: కృతిసనన్ కామెంట్స్

Update: 2021-05-11 08:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీ చాలామంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చింది. లైఫ్ అంటే మాములు లైఫ్ కాదు. టాలీవుడ్ లో డెబ్యూ చేసిన హీరోయిన్స్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు. అలా తెలుగులో అరంగేట్రం చేసి హిందీలో సక్సెస్ అయినటువంటి హీరోయిన్ కృతిసనన్. ఈ పొడుగుకాళ్ళ సుందరి సూపర్ స్టార్ మహేష్ బాబుతో '1నేనొక్కడినే' అనే సినిమాతో సినీప్రయాణం మొదలుపెట్టింది. ఆ తర్వాత నాగచైతన్య సరసన దోచేయ్ అనే సినిమా చేసింది. కానీ తెలుగులో ఈ రెండు సినిమాలు బోల్తా కొట్టేసరికి అమ్మడు బాలీవుడ్ కు మకాం మార్చింది.

అలా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిందో లేదో మంచి హిట్ పడింది. టైగర్ శ్రాఫ్ సరసన హీరోపంతి అనే సినిమాతో డెబ్యూ చేసింది. ఆ సినిమా హిట్ అయ్యేసరికి అమ్మడికి వరుస ఆఫర్స్ లభించాయి. అప్పటినుండి బాలీవుడ్ లోనే బిజీ అయిపోయింది. కానీ తెలుగు వైపు ఆసలే చూడలేదు ఈ టాల్ హీరోయిన్. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ రేట్ తో కొనసాగుతుంది. అలాగే చేతినిండా సినిమాలు పెట్టుకొని ఒక్కో సినిమాను ఫినిష్ చేస్తోంది. అయితే తాజాగా కృతిసనన్ ఓ ఇంటర్వ్యూలో హీరో వరుణ్ ధావన్ గురించి కామెంట్స్ చేసింది.

ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏంటంటే.. వరుణ్ - కృతి కాంబినేషన్ లో ఇదివరకు దిల్వాలే అనే సినిమా వచ్చింది. ఆ సినిమా వచ్చి ఆరేళ్లు అవుతోంది. అయితే ఇప్పుడు ఈ కపుల్ మళ్లీ హారర్ కామెడీ భేడియా అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో షూటింగ్ ముగించుకొని ఇళ్లకు చేరుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో కృతి మాట్లాడుతూ.. వరుణ్ ప్రవర్తనలో పెళ్లి తర్వాత చాలా మార్పు కనిపించింది. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత మేమిద్దరం కలిసి పనిచేసాం. తన ప్రేయసి నటషాతో పెళ్లి తర్వాత వరుణ్ లో చాలా మెచ్యూరిటీ వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కృతి మాటలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. భేడియాతో పాటు అమ్మడు ఆదిపురుష్ సినిమాలో నటిస్తోంది.
Tags:    

Similar News