ఆ న‌టుడే మెగాస్టార్‌కు ప్రేర‌ణ‌

Update: 2019-10-06 11:54 GMT
మ‌హాన‌టుడు ఎస్వీ రంగారావు న‌ట‌నే త‌న‌కు ప్రేర‌ణ‌గా నిలిచింద‌ని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లిగూడెం హౌసింగ్ బోర్డు సెంట‌ర్‌లో మ‌హాన‌టుడు ఎస్వీరంగారావు అతిపెద్ద కాంస్య విగ్రహాన్ని ఆదివారం మెగాస్టార్ చిరంజీవి ఆవిష్క‌రించారు. ఎస్వీఆర్‌, మెగా అభిమానుల స‌మ‌క్షంలో జ‌రిగిన‌ ఈ కార్య‌క్ర‌మంలో మెగాస్టార్ మాట్లాడుతూ ఎస్వీఆర్ గారి విగ్ర‌హాన్ని త‌న చేతుల మీదుగా ఆవిష్క‌రించే భాగ్యం ద‌క్క‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఈ విగ్ర‌హాన్ని గ‌త ఏడాదే ఆవిష్క‌రించాల్సి ఉండ‌గా, సైరా చిత్రం షూటింగ్ వ‌ల‌న వాయిదా ప‌డింద‌ని తెలిపారు. ఆనాటికి ఈనాటి ఏనాటికైనా ఎస్వీఆర్ మ‌హాన‌టుడిగానే ప్రేక్ష‌కుల హృద‌యాల్లో నిలిచిపోతార‌ని అన్నారు.

నేను ఎస్వీఆర్ గారి న‌ట‌న‌ను చూసి న‌టుడిని కావాల‌ని  మ‌ద్రాస్‌కు వెళ్ళాన‌ని గుర్తు చేసుకున్నారు. ఆనాడు ఆ మ‌హానుభావుడి న‌ట‌న‌తోనే నేను ప్రేర‌ణ పొందాన‌ని, ఆ ప్రేర‌ణే న‌న్ను సినిమాల వైపు  న‌డిపించింద‌ని, ఈ రోజు ఇలా ఆ మ‌హానుభావుడి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించే భాగ్యం ద‌క్కిందంటే ఆ మ‌హాన‌టుడి చ‌లువేన‌ని మెగాస్టార్ భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు. ఎస్వీ రంగారావు గారి చ‌రిత్ర‌ను భావిత‌రాల‌కు అందించాల‌ని, అందుకు సిని ప‌రిశ్ర‌మ‌, తెలుగు రాష్ట్రాల్లోని న‌టీన‌టులు కృషి చేయాల‌ని మెగాస్టార్ పిలుపునిచ్చారు. ఎస్వీఆర్ విగ్ర‌హా ఆవిష్క‌ర‌ణ‌కు ప్ర‌భుత్వ అనుమ‌తులు తీసుకునేందుకు స‌హాకరించిన ఎమ్మెల్యే  కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌కు చిరంజీవి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఎస్వీఆర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించే అదృష్టం నాకు క‌లిగించిన నా జిల్లా ప్ర‌జ‌ల‌కు జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాన‌ని, నా సైరా చిత్రాన్ని విజ‌య‌వంతం చేసినందుకు ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఎస్వీఆర్ ఆశీస్సులు ఎల్ల‌ప్పుడు నాకు ఉంటాయ‌ని మెగాస్టార్ ప్ర‌క‌టించారు. న‌ర్సాపురం ఎంపీ కె.ర‌ఘురామ‌కృష్ణంరాజు మాట్లాడుతూ ఏడాదికాలంగా ఎస్వీఆర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించేందుకు మెగాస్టార్ కోసం ఎదురు చూస్తున్నాం.. ఆ కోరిక ఇప్ప‌టికి నెర‌వేరింది.. చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లో ఎస్వీఆర్ లాగా మెగాస్టార్ చిరంజీవి జీవితం కూడా చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌ని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి తండ్రి వెంక‌ట్రావ్ గారు ఎస్వీఆర్ గారితో రెండు సినిమాల్లో న‌టించార‌ని ఆయ‌న గుర్తు చేశారు.
Tags:    

Similar News