ట్రైల‌ర్‌: మాజీ ప్ర‌ధాని కీలుబొమ్మ క‌థ‌

Update: 2019-01-09 17:41 GMT
ఒక దేశాన్ని ప‌రిపాలించే ప్ర‌ధాన‌మంత్రి వేరొక‌రి చేతిలో కీలుబొమ్మ‌గా మారి ఆడాల్సి వ‌స్తే అంత‌కంటే చ‌రిత్ర విహీనం ఉంటుందా?  కీల‌కమైన సంద‌ర్భాల్లో స్వ‌తంత్య్ర నిర్ణ‌యాలు తీసుకోవాల్సి వ‌చ్చిన‌ప్పుడు పార్టీలు, హై క‌మాండ్, పీఎంవో అంటూ కాల‌యాప‌న చేస్తే ఆ ప్ర‌భావం దేశంపై ఎంత దారుణంగా ఉంటుందో ఊహించ‌గ‌ల‌మా?  యుద్ధంలో నిర్ణ‌యాలు క్ష‌ణాలు, సెక‌న్ల‌లోనే తీసుకోవాలి. ఒక దేశ‌ప‌రిపాల‌న అంటే నిరంత‌ర యుద్ధంతో స‌మానం. అలాంటి యుద్ధంలో అనుకోకుండానే ప్ర‌వేశించిన అప‌ర‌మేధావి, ఆర్థిక నిపుణుడు అయిన మ‌న్మోహ‌న్ సింగ్ .. పూర్తిగా కాంగ్రెస్ అధినాయ‌కురాలు సోనియా గాంధీ క‌నుస‌న్న‌ల్లో మెల‌గాల్సి రావ‌డం, స్వేచ్ఛా వాతావ‌ర‌ణంలో దేశ పురోభివృద్ధికి, భ‌ద్ర‌త‌- అణు ఒప్పందాల‌కు సంబంధించిన కీల‌క నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోవ‌డం వ‌గైరా ఘ‌ట్టాలు ఎంతో ఉద్విగ్న‌మైన‌వి. అలాంటి ఘ‌ట్టాల్ని వెండితెర‌పై చూపించాల్సి వ‌స్తే దాంతో పాటే వివాదాలు మోసుకు రావాల్సిందే.

అందుకేనేమో `ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్ట‌ర్` సినిమా తీస్తున్నారు అన‌గానే కాంగ్రెస్ నాయ‌కుల్లో క‌ల్లోలం మొద‌లైంది. నిజాలెప్పుడూ నిష్టురంగానే ఉంటాయి. గుండెల్లో గుచ్చేస్తాయి.  అలాంటి నిజాల్ని, స‌త్యాల్ని చెప్పేస్తే పార్టీ పుట్టి మునిగిపోతుంద‌న్న భ‌యాందోళ‌న‌లు ఉంటాయి. ఇదిగో తాజాగా రిలీజైన మ‌న్మోహ‌న్ బ‌యోపిక్ తెలుగు ట్రైల‌ర్ ఆ సంగ‌తుల‌న్నిటినీ విడ‌మ‌ర్చి చెబుతోంది.

``నాకైతే డాక్ట‌ర్ సింగ్ ఎలాంటి లోపం లేని భీష్ముడిలా క‌నిపిస్తారు. పాపం ఫ్యామిలీ డ్రామాకి బ‌లైపోయారు`` అంటూ అత‌డి వ్య‌క్తిగ‌త పీఏ బారువా డైరెక్టుగానే మ‌న్మోహ‌న్ లోని గొప్ప క్వాలిటీని డైలాగ్ రూపంలో చెప్పాడు. ``మ‌హాభార‌తంలో రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి.. కానీ ఇండియాలో ఒక్క‌టే!!`` అంటూ ఇంకా గాంధీల‌ వార‌స‌త్వ పాల‌న‌పైనా పంచ్ వేసే ప్ర‌య‌త్నం చేశారు.  ``ప్రైమ్ మినిస్ట‌ర్ ఏం చేయాలో ఎంబ‌సీనా నిర్ణ‌యించేది?`` అంటూ మ‌న్మోహ‌న్ ఆవేద‌న చెందే స‌న్నివేశం.. ఉత్కంఠ రేకెత్తిస్తోంది. దేశ అణు ఒప్పందం విష‌యంలో నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌స్తే.. కశ్మీర్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌నుకుంటే..! అందుకు సోనియా మోకాల‌డ్డిన వైనాన్ని తెర‌పై చూపిస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. స్వ‌తంత్రంగా ఉండి నిర్ణ‌యాలు తీసుకోలేన‌ప్పుడు దేశానికి క‌లిగే ముప్పు ఎలాంటిదో గ్రహించి రాజీనామా చేద్దామ‌న్నా కుద‌ర‌ని భ‌యాన‌క స‌న్నివేశంలో మ‌న్మోహ‌న్ ఉద్వేగం ఆక‌ట్టుకుంది. సింగ్ ని దించేయ‌డ‌మెలా?  ఎప్పుడు పార్టీకి రాహుల్ కి ప‌ట్టాభిషేకం చేస్తుందా అంటూ డైలాగులు తూటాల్లా పేల్చారు. విజ‌య్ ర‌త్నాక‌ర్ గుట్టే ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈనెల చివ‌రిలో సినిమా రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ బ‌యోపిక్, వైయ‌స్సార్ బ‌యోపిక్, అలాగే మ‌న్మోహ‌న్ బ‌యోపిక్ ఆస‌క్తి పెంచుతున్న ఈ సినిమాల‌న్నీ రిలీజ‌వుతుండ‌డం ప్ర‌జ‌ల్లో హాట్ టాపిక్ గా మారింది.


Full View

Tags:    

Similar News