ది ఆర్చీస్ లుక్: వీళ్లంతా అమెరికా నుంచి వ‌చ్చారా మ్యామ్?

Update: 2022-08-30 00:30 GMT
2019లో వ‌చ్చిన `గ‌ల్లీ బోయ్` చిత్రం జాతీయ అవార్డులతో సంచ‌ల‌నాలు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఆస్కార్ నామినేష‌న్ కి కూడా వెళ్లింది. ఈ చిత్రానికి జోయా అక్త‌ర్ ద‌ర్శ‌కురాలు. ఒక స్ల‌మ్ నుంచి అంత‌ర్జాతీయ స్థాయికి ఎదిగిన ర్యాప‌ర్ క‌థ‌తో ఎంతో అద్భుతంగా ఈ సినిమాని జోయా తెర‌కెక్కించారు. ఇప్పుడు జోయా వెస్ట్ర‌న్ క‌ల్చ‌ర్ తో కూడుకున్న `ది ఆర్చీస్` సిరీస్ కి భార‌తీయ వెర్ష‌న్ ని రూపొందిస్తుండ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఈ సినిమాతో బాలీవుడ్ లో న‌ట‌వార‌సులు ప‌రిచ‌య‌మ‌వుతుండ‌డం మ‌రింత ఉత్కంఠ‌ను క‌లిగిస్తోంది.

జోయా అక్తర్ తన కొత్త OTT చిత్రం `ది ఆర్చీస్‌`ని ప్రకటించినప్పటి నుండి అభిమానులు ఆనందానికి అవ‌ధుల్లేవ్. ఈ సినిమాతో ముగ్గురు కొత్త స్టార్ కిడ్స్ అరంగేట్రం చేస్తున్నారు. షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్... బోనీ కపూర్ కుమార్తె ఖుషీ కపూర్ - అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా ఈ చిత్రంతో తమ OTT అరంగేట్రం చేయనున్నారు. ఈ రోజు టీమ్ కి చాలా ప్రత్యేకమైన రోజు.

మేకర్స్ మొత్తం తారాగణం ఉన్న కొత్త స్టిల్ ను విడుదల చేసారు. ఆర్చీ కామిక్స్ సృష్టికర్త జోన్ గోల్డ్ వాటర్ తో జోయా అక్తర్ సంభాషిస్తున్న వీడియోని కూడా రిలీజ్ చేయ‌గా వైర‌ల్ గా మారింది. చిన్న‌ప్ప‌టి నుంచి తాను స్ఫూర్తి పొందిన కామిక్ బుక్స్ సిరీస్ నుంచి స్ఫూర్తి పొంది ఈ చిత్రాన్ని(సిరీస్ ని) రూపొందిస్తున్నాన‌ని జోయా అన్నారు.

తాజాగా విడుద‌లైన పోస్ట‌ర్ లో సుహానా ఖాన్ లేత నీలం రంగు వెయిస్ట్ కోట్ తో మెరూన్ దుస్తులు ధరించి గ్రూప్ లో మధ్యలో కూర్చుని ఉంది. లేత గులాబీ రంగు సాక్స్ లతో థై స్లిట్ ఎలివేష‌న్ తో ఎంతో అందంగా క‌నిపిస్తోంది. ఆమె పక్కన అగస్త్య నంద నీలిరంగు ట్రౌజర్ .. పీచు రంగు కోటు ధరించి క‌నిపించాడు. అతని ప్రక్కన ఖుషీ కపూర్ కూర్చుని ఉంది. పింక్ చారల ఫుల్ స్లీవ్ టీ ష‌ర్ట్ .. చెక్ ట్రౌజర్ లు .. బ్రౌన్-కలర్ ఆక్స్ ఫర్డ్ షూస్ తో చాలా స్పెషల్ గా క‌నిపిస్తోంది. అలాగే ఆర్చీ కామిక్స్ సృష్టికర్త జోన్ గోల్డ్ వాటర్ తో జోయా అక్తర్ సంభాషిస్తున్న వీడియో లో చాలా ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి.

అదంతా స‌రే కానీ ఇదేంటీ జోయా..?

అంతా బాగానే ఉంది కానీ.. నెటిజ‌నుల నుంచి కామెంట్ల‌ను మాత్రం ఆప‌లేని ప‌రిస్థితి ఉంది. ది ఆర్చీస్ లో ఎక్క‌డా భార‌తీయ‌త అన్న‌ది క‌నిపించ‌డం లేద‌న్న విమ‌ర్శ బ‌లంగా ఉంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ లో కూడా ఇండియా న‌టీన‌టుల‌ను పూర్తిగా వెస్ట్ర‌న్ గెట‌ప్స్ లోకి మార్చేయ‌డం విడ్డూరంగా ఉంద‌ని విమ‌ర్శ‌లొస్తున్నాయి. ఖుషీ క‌పూర్ కానీ అగ‌స్త్య నందా కానీ భార‌తీయుల్లా క‌నిపించ‌డం లేదు. బ్రౌన్ లేడీ అంటూ కామెంట్లు ఎదుర్కొన్న సుహానా ఖాన్ సైతం డామినేటెడ్ మేక‌ప్ లో ఒక విదేశీలా క‌నిపిస్తోంది. ఈ పోస్ట‌ర్ చూశాక ర‌క‌ర‌కాల కామెంట్ల‌తో నెటిజ‌నం విరుచుకుప‌డుతున్నారు. వీళ్లంతా అమెరికా నుంచి వ‌చ్చిన‌ట్టున్నారని.. మ‌ళ్లీ అమెరిక‌న్ల పోస్ట‌ర్ వేశారేంటి మ్యాడ‌మ్? అని కూడా కామెంట్లు చేస్తున్నారు. ఎంపిక చేసుకున్న కాస్ట్యూమ్స్ మేక‌ప్ హెయిర్ క‌ట్ ప్ర‌తిదీ ఇలాంటి సందేహాల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి.

జోయా ఎంపిక చేసుకున్న క‌థాంశంలో భార‌తీయ‌త ఉందా లేదా? అన్న సందేహాలు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి నెగెటివిటీ న‌డుమ `ది ఆర్చీస్` భార‌తీయుల‌కు రుచిస్తుందా లేదా? అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News