థియేటర్ vs ఓటీటీ.. ఏమిటీ గందరగోళం..!

Update: 2021-08-21 06:30 GMT
కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ ఇప్పుడు మహా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. అయితే మిగతా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే.. టాలీవుడ్ పరిస్థితి కాస్త బెటర్ అనే చెప్పాలి. ఇక్కడ సినిమా షూటింగులు సజావుగా జరగడంతో పాటుగా థియేటర్లు కూడా తెరుచుకున్నాయి. మూడు వారాల నుంచి థియేటర్లలో సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. కాకపోతే అదే సమయంలో ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ విజృభిస్తుండటం వల్ల ఇండస్ట్రీలో కాస్త భిన్నమైన పరిస్థితులు నెలకొంటున్నాయి.

కోవిడ్ టైంలో ఓటీటీలు బాగా పుంజుకున్నాయనే సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అయినప్పటికీ.. ఓటీటీ రిలీజులకు బ్రేక్ పడకపోవడం.. అది కూడా పెద్ద సినిమాలు థియేట్రికల్ విడుదల స్కిప్ చేస్తుండటం ఎగ్జిబిటర్స్ ను కలవరపెడుతోంది. ఓవైపు 'లవ్ స్టోరీ' చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తుంటే.. మరోవైపు అదే రోజు 'టక్ జగదీష్' 'మాస్ట్రో' వంటి సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో థియేటర్లకు ఓటీటీలకు మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది.

ఇప్పటికే తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ వారు థియేట్రికల్ రిలీజులకు పోటీగా ఓటీటీలో సినిమాలు విడుదల చేయడాన్ని ఖండించారు. పండగ సమయాల్లో కొత్త సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయడం వల్ల భవిష్యత్‌ లో నిర్మాతలు చాలా నష్టపోతారని.. 'టక్ జగదీష్' ను వాయిదా వేసుకోవాలని ఎగ్జిబిటర్స్ విజ్ఞప్తి చేశారు. ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు విడుదలయితే.. థియేటర్ల వసూళ్ల మీద ప్రభావం చూపుతుందనేది వారి వాదన.

ఇదిలా ఉంటే ఈ గందరగోళం మధ్య 'లవ్ స్టోరీ' చిత్రాన్ని ఓ వారం పోస్ట్ పోన్ లేదా ప్రీపోన్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఏదేమైనా పెద్ద సినిమాలను ఒకే రోజు థియేట్రికల్ మరియు డిజిటల్ రిలీజ్ చేసే విషయంలో నిర్మాతలు ఓ అభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉందనేది అర్థం అవుతోంది. ఇంతకముందు థియేటర్లలో ఒకేసారి సినిమాలను విడుదల చేసే విషయంలో నిర్మాతలు మాట్లాడుకొని ఎలాంటి నిర్ణయాలు తీసుకునేవారో.. ఇప్పుడు ఓటీటీ సంస్థలు - చిత్ర నిర్మాతలు కూడా కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందేమో. ఈ విషయంలో రాబోయే రోజుల్లో ఏం జరగనుందో చూడాలి.


Tags:    

Similar News