థియేట‌ర్లు తెర‌వ‌నూలేదు.. బొమ్మ ప‌డ‌నూలేదు!

Update: 2021-07-18 06:40 GMT
తెలంగాణ‌లో 100 శాతం ఆక్యుపెన్సీ.. ఆంధ్రాలో 50శాతం ఆక్యుపెన్సీతో ఇక‌పై సినిమాలు ఆడించుకునేందుకు ఇరు ప్ర‌భుత్వాలు ఆమోదం తెలిపాయ‌ని గ‌త కొంత‌కాలంగా క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. అంతేకాదు నిన్న‌టిరోజున తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ పెద్ద‌లు నేరుగా తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ ని క‌లిసి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించ‌డ‌మే గాక‌.. ఎగ్జిబిట‌ర్లు త‌మ స‌మ‌స్య‌ల‌ను విన్న‌వించుకోవ‌డంతో ఆయ‌న నుంచి పాజిటివ్ గా స్పందన వ‌చ్చింద‌ని త‌మ డిమాండ్ల‌కు అంగీక‌రించార‌ని క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి.

నిన్న‌టి ఉద‌యం మీడియాకి స‌మాచారం అందిన‌ప్ప‌టి నుంచి ఇక వెంట‌నే థియేట‌ర్లు తెరిచేస్తున్నారన్న ప్ర‌చారం హీటెక్కించేసింది. తెలంగాణ‌లో ఈ ఆదివారం (18 జూలై) నుంచి థియేట‌ర్లు వంద శాతం ఆక్యుపెన్సీతో తెరిచేందుకు ప్ర‌భుత్వం అంగీక‌రించింద‌ని తామ‌ర తంప‌ర‌గా క‌థ‌నాలొచ్చాయి.

అయినా ఈరోజు థియేట‌ర్లు తెరుచుకోనూలేదు. బొమ్మ ప‌డ‌నూలేదు. దీంతో అంద‌రిలో ఒక‌టే సందిగ్ధం. ఇంత‌కీ తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తించ‌లేదా? అంటూ చ‌ర్చా సాగుతోంది. అయితే వాస్త‌వానికి థియేట‌ర్లు మూత వేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం అస్స‌లు ఎప్పుడూ చెప్ప‌నే లేదు. సెకండ్ వేవ్ వ‌ల్ల‌ కేవ‌లం సాయంత్రం క‌ర్ఫ్యూలు ఉద‌యం పూట క‌ర్ఫ్యూలు త‌ప్ప థియేట‌ర్లు మూత వేయ‌మ‌ని చెప్ప‌లేదు. కానీ ఎగ్జిబిట‌ర్లు క‌రోనాని దృష్టిలో ఉంచుకుని స్వ‌చ్ఛందంగా మూసి వేశారు. అయితే అప్ప‌టి నుంచి ప్ర‌భ‌త్వ అనుమ‌తులు రాలేదు అంటూ తప్పుడు క‌థ‌నాలు స్ప్రెడ్ అయ్యాయి.

ఇక థియేట‌ర్లు మూసేయ‌డం అన్న‌ది వ్యూహాత్మ‌కం. గ‌డిచిన కాలంలో ఎగ్జిబిట‌ర్లు క‌నీస మెయింటెనెన్స్ చేయ‌లేని దుస్థితి నెల‌కొంది. హాళ్ల‌లో ప‌ని చేసే సిబ్బందికి జీతాలివ్వ‌లేని ప‌రిస్థితి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ క‌రోనా పూర్తిగా త‌గ్గి సినిమాలు ఆడుతాయి అన్న ధీమా వ‌చ్చే వ‌ర‌కూ తిరిగి థియేట‌ర్ల‌ను తెరిచే ఆలోచ‌నే లేదు.

ప‌నిలో ప‌నిగా త‌మ బిల్లుల‌ను న‌ష్టాల‌ను త‌గ్గించుకునేందుకు ఎగ్జిబిట‌ర్లు ప్ర‌భుత్వ సాయం కోరుతున్నారు. ఇందులో భాగంగా ఒక విన‌తిప‌త్రాన్ని తెలంగాణ ప్ర‌భుత్వానికి అందించారు. సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సానిని క‌లిసి అందించిన విన‌తి ప‌త్రంలో ప‌లు రాయితీల‌కు సంబంధించిన అంశాలు ఉన్నాయి.

ఇప్ప‌టికే ర‌ద్ద‌యిన పార్కింగ్ ఫీజును వెంట‌నే పున‌రుద్ధ‌రించాలి. దీనిపై పాత జీవోని ర‌ద్దు చేయాలి. కరెంటు బిల్లుల రద్దు.. టికెట్ల రేట్ల పెంపు.. అదనపు షోలకు అనుమ‌తులు.. ఆస్తి ప‌న్ను రద్దు.. జీఎస్టీ త‌గ్గింపు .. ఇలా ర‌క‌ర‌కాల డిమాండ్ల‌ను తెర‌పైకి తెచ్చారు. వీట‌న్నిటికీ అనుమ‌తిస్తేనే థియేట‌ర్లు తెరుస్తారు. లేదంటే ఈ రంగం అలా ఖాళీగానే ఉంటుంద‌ని సంకేతాలు అందించారు.

నిజానికి థియేట‌ర్లు తెర‌వాలా వ‌ద్దా? అన్న‌ది ఎగ్జిబిట‌ర్ కోర్టులో ఉన్న మ్యాట‌ర్. బంతిని ఆప‌రేట్ చేయాల్సింది ఎగ్జిబిట‌ర్ మాత్ర‌మే. అయితే కొన్ని మాఫీలు త‌క్ష‌ణ అవ‌స‌రమ‌ని వారు భావిస్తున్నారు. కానీ ప్ర‌భుత్వం ఎగ్జిబిష‌న్ రంగాన్ని పున‌రుద్ధ‌రించేందుకు ఎలాంటి చ‌ర్చ‌లు తీసుకుంటుంది? అన్న‌దానిపై స‌రైన స్ప‌ష్ఠ‌త లేదు. ఈ డిమాండ్లు ఒక్క‌టే చిక్కు కాదు ఇప్పుడు. ఇక పై డిమాండ్ల‌న్నిటికీ ప్ర‌భుత్వం ఓకే చెప్పినా ఏపీలో టిక్కెట్టు రేట్లు పెర‌గ‌క‌పోతే సినిమాల్ని రిలీజ్ చేయ‌లేమ‌ని ఇప్ప‌టికే తెలంగాణ ఛాంబ‌ర్ ప్ర‌క‌టించింది. రెండు రాష్ట్రాల్లో ఒకే రేటు అమల్లో ఉంటే త‌ప్ప సినిమాలు తీసేవాళ్ల‌కు న‌ష్టాలు త‌ప్ప‌వ‌నేది ఓ నివేద‌న‌. ఇలాంట‌ప్పుడు ఇప్పుడే థియేట‌ర్లు తెర‌వ‌డం అన్న‌ది అసాధ్యంగానే క‌నిపిస్తోంది. మ‌రోవైపు ఏపీలో టిక్కెట్టు రేట్ల‌ను పెంచుకునేందుకు ప్ర‌భుత్వం స‌సేమిరా అంటున్న సంగ‌తి తెలిసిన‌దే. మొత్తానికి థియేట‌ర్లు తెర‌వ‌డం అనేది ఇప్ప‌ట్లో తేల‌ని వ్య‌వ‌హారంగా మారింది.
Tags:    

Similar News