రామానాయుడు పరిచయం చేసిన హీరో హీరోయిన్స్ వీరే!

Update: 2022-06-07 02:30 GMT
టాలీవుడ్ అనే పుస్తకాన్ని ఎప్పుడు తెరిచినా, తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించిన నిర్మాతల జాబితాలో రామానాయుడు పేరు ముందు వరుసలో కనిపిస్తుంది. నిర్మాత అంటే రూపాయిని ఖర్చు చేసేవారు కాదు .. ఆ రూపాయి ఖర్చు తెరపై కనిపిస్తుందా లేదా అని చూసుకునేవారు. ఆ రూపాయి పది రూపాయలను తెచ్చే కథలను ఎంచుకునేవారు  .. ఆఫీసులో కథను వినేసి ఖర్చులకు డబ్బులు ఇవ్వడం కాకుండా .. లోకేషన్ కి వెళ్లి పర్యవేక్షణ చేసేవారు .. అన్నిటికీ మించి నైతిక విలువలు కలిగిన సినిమాలను నిర్మించేవారు అనే విషయాన్ని రామానాయుడు నిరూపించారు.

రామానాయుడు తన మొదటి సినిమా విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నారో .. తన చివరి సినిమా విషయంలోను అంతే జాగ్రత్తగా ఉన్నారు. తనకి అపారమైన అనుభవం ఉందని చెప్పేసి ఆయన అజాగ్రత్తగా ఉన్న దాఖలాలు ఎక్కడా కనిపించవు. నిర్మాతగా సుదీర్ఘమైన తన ప్రయాణంలో ఆయన వివిధ భాషల్లో ఎన్నో సినిమాలను నిర్మించారు. ఎంతోమంది హీరో హీరోయిన్లను .. సాంకేతిక నిపుణులను ఆయన తెలుగు తెలుగు తెరకి పరిచయం చేశారు.

'కలియుగ పాండవులు' సినిమాతో వెంకటేశ్ ను హీరోగా పరిచయం చేసిన ఆయన, అదే సినిమాతో హీరోయిన్ గా ఖుష్బూ ను పరిచయం చేశారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో చెప్పాల్సిన పనిలేదు.  

ఇక 'ప్రేమఖైదీ' సినిమాతో హరీశ్ ను హీరోగా .. మాలాశ్రీని హీరోయిన్ పరిచయం చేశారు. ఇదే సినిమాను హిందీలో  రీమేక్ చేసిన ఆయన, బాలీవుడ్ కి కూడా హరీశ్ ను పరిచయం చేశారు. రెండు భాషల్లోను ఈ సినిమాను సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ప్రేమకథా చిత్రాలలో ఈ సినిమా ఒక కొత్త ట్రెండ్ కి క్లాప్ కొట్టింది. ఇక ఈవీవీకి   'ప్రేమఖైదీ' సినిమాతో ఛాన్స్ ఇచ్చిన ఆయన, ఆయన కుమారులైన నరేశ్ ను 'అల్లరి' సినిమాతోను ..  ఆర్యన్ రాజేశ్ ను 'హాయ్' సినిమాతోను హీరోలుగా పరిచయం చేసింది రామానాయుడే.

ఇక వెంకటేశ్ తో వరుస సినిమాలు చేస్తూ వెళ్లిన ఆయన, వెంకీ  సరసన కథానాయికలుగా 'బొబ్బిలి రాజాతో దివ్యభారతీని ..  'కూలీ నెం.1'తో టబూను .. 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాతో ఆర్తి అగర్వాల్ ను .. 'ప్రేమించుకుందాం  రా' సినిమాతో అంజలా జవేరిని తెలుగు తెరకి పరిచయం చేశారు. తొలి సినిమాతోనే వాళ్లకి హిట్ ఇచ్చారు.

ఎంతోమంది దర్శకులను .. ఇతర సాంకేతిక నిపుణులను .. రచయితలను కూడా ఆయన  పరిచయం చేశారు. ఎదుటివారిలోని టాలెంటును గుర్తించడం .. ప్రోత్సహించడం రామానాయుడి ప్రత్యేకత. ఈ రోజున ఆయన జయంతి .. ఈ సందర్భంగా మనసారా ఒకసారి ఆయనను స్మరించుకుందాం.
Tags:    

Similar News