డ్ర‌గ్స్ కేసులో మ‌రో ముగ్గురు తార‌ల‌కు నోటీసులు?

Update: 2017-09-06 06:18 GMT
డ్ర‌గ్స్ కేసుకు సంబంధించి మ‌రో సంచ‌ల‌నం తెర మీద‌కు రానుందా? కొన్ని వారాల పాటు రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు.. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన టాలీవుడ్ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం మ‌రోమారు సంచ‌ల‌నంగా మార‌నుందా? అన్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు మ‌రోసారి తెర మీద‌కు వ‌చ్చాయి. కొద్ది వారాలు టాలీవుడ్ ను షేక్ చేసిన డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం.. ఇప్పుడు స‌మిసిపోయింద‌ని.. మ‌రికొద్ది రోజుల్లో ఈ వ్య‌వ‌హారం పూర్తిగా ప‌క్క‌కు వెళ్లిపోతుంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

అయితే.. ఇలాంటి ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌న్న‌ది స‌రికొత్త స‌మాచారంగా చెప్పొచ్చు. విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం డ్ర‌గ్స్ కేసును అధికారులు ప‌క్క‌న పెట్ట‌లేద‌ని చెబుతున్నారు. ప‌ద‌కొండు మంది సినీ ప్ర‌ముఖులు చెప్పిన వివ‌రాల్ని విశ్లేషిస్తూ.. వారుచెప్పిన దానికి సంబంధించిన ఆధారాల్ని సేక‌రించ‌టంతో పాటు.. మ‌రింత లోతుగా ఈ కేసును విచారిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

తాజాగా మ‌రో ముగ్గురు సినీ తార‌ల‌కు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నోటీసులు ఇవ్వ‌నున్న‌ట్లు చెబుతున్నారు. ఈ ముగ్గురిలో ఒక‌రు ప్ర‌ముఖ సినీ హీరోయిన్ అయితే.. మ‌రో ఇద్ద‌రు మాత్రం ప్ర‌ముఖ సినీ కుటుంబాల‌కు చెందిన సినీ తార‌లుగా చెబుతున్నారు. డ్ర‌గ్స్ వినియోగం విష‌యంలో ఈ ముగ్గురికి నేరుగా సంబంధాలు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

మ‌రీ ముఖ్యంగా ఒక ప్ర‌ముఖ హీరోయిన్ కు సంబంధించి బ‌య‌ట‌కు వ‌స్తున్న స‌మాచారం ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది. ఆ మ‌ధ్య‌న జ‌రిగిన ఒక సినీ ఫంక్ష‌న్‌కు స‌ద‌రు హీరోయిన్ త‌న‌తో పాటు డ్ర‌గ్స్ ను వేడుక‌కు తీసుకొచ్చింద‌ని.. అంద‌రి ముందే దాన్ని తీసుకుంద‌ని.. డ్ర‌గ్ ను సేవించిన త‌ర్వాత ఆమె ప‌డిపోయింద‌ని.. ఆమెను తీసుకొని మ‌రో న‌టుడు ఆమెను ఇంటికి తీసుకెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ఒక‌టి అధికారులు సేక‌రించార‌ని.. మిగిలిన వివ‌రాల‌కు సంబంధించిన ఆధారాల్ని సేక‌రించే ప‌ని మీద ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది.

ఆ మ‌ధ్య‌న 11 మంది సినీ ప్ర‌ముఖుల్ని విచారించే స‌మ‌యంలో వారు చెప్పిన స‌మాచారంతోనే ఈ ముగ్గురు సినీ ప్ర‌ముఖులకు నోటీసులు ఇవ్వ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. అయితే..  తాజాగా నోటీసులు ఇవ్వాల‌నుకుంటున్న హీరోయిన్ కు.. మిగిలిన ఇద్ద‌రు సినీ న‌టుల‌ను ర‌హ‌స్యంగా విచారించాలా?  లేక‌.. అంద‌రి మాదిరే నోటీసులు ఇచ్చి విచారించాలా? అన్న‌ది ఇంకా తేల్చుకోలేద‌ని చెబుతున్నారు. మ‌రికొద్ది రోజుల్లోనే ఈ అంశం బ‌య‌ట‌కు రానున్న‌ట్లుగా తెలుస్తోంది. అదే జ‌రిగితే.. మ‌రోమారు డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం సంచ‌ల‌నంగా మార‌నుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News