నువ్వు చేయ‌క‌పోయినా సేవ చేసేవాళ్ల‌పై రాళ్లు వేయ‌కు!

Update: 2021-05-29 07:30 GMT
విప‌త్తులు ఆప‌ద‌ల వేళ ఆదుకునేందుకు సినీసెల‌బ్రిటీలు ఏమాత్రం వెన‌కాడ‌డం లేదు. ఆ విష‌యాన్ని ఇటీవ‌లి కాలంలో మెగాస్టార్ చిరంజీవి స‌హా టాలీవుడ్ స్టార్లంతా నిరూపిస్తున్నారు. మ‌న స్టార్లంతా క‌రోనా క్రైసిస్ మొద‌టి వేవ్ స‌మ‌యంలోనే కోట్లాది రూపాయ‌ల విరాళాలిచ్చారు. కొంద‌రు నేరుగా ప్ర‌జ‌ల్లో క‌ష్టం ఎక్క‌డుందో తెలుసుకుని ల‌బ్ధిదారుల‌కే నిత్యావ‌స‌రాల్ని మందుల్ని అందించారు. సెకండ్ వేవ్ స‌మ‌యంలో సైలెంటుగా ఎవ‌రికి వారు సాయం చేస్తున్నారు. మందులు బెడ్లు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా అంటూ చేయ‌ని సేవ‌ల్లేవ్. విరివిగా దానాలిస్తున్నా దానికి ప్ర‌చారం కోరుకోవ‌డం లేదు.

ఇంత‌కుముందు కూడా మ‌న స్టార్లు వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌కృతి వైప‌రీత్యాల్లో న‌గ‌రాలు మునిగిపోయిన‌ప్పుడు ఇదే తీరుగా స్పందించారు. చిరంజీవి-ప‌వ‌న్ క‌ల్యాణ్ -మ‌హేష్‌- అల్లు అర్జున్- రామ్ చ‌ర‌ణ్‌- ప్ర‌భాస్- ఎన్టీఆర్ .. ఇత‌ర స్టార్లు కూడా కోట్లాది రూపాయ‌ల విరాళాల్ని ప్ర‌క‌టించారు. చిన్న హీరోలు ల‌క్ష‌ల్లో విరాళాలిచ్చి స‌ర్ ప్రైజ్ చేశారు. చెన్న‌య్- బెంగ‌ళూరు- హైద‌రాబాద్ వ‌ర‌ద‌ల్లో మునిగిన‌ప్పుడు వీరి సేవ‌లు అన‌న్య సామాన్యం.

కానీ హీరోలంతా ఇంత చేస్తున్నా సోష‌ల్ మీడియాల్లో వారిని జీరోలు అనేయ‌డం కామ‌న్ గా మారింది. కోట్లాది రూపాయ‌ల పారితోషికాలు అందుకుంటారు. కానీ పిల్లికి భిక్షం వేస్తున్నారు! అంటూ ట్రోల్స్ చేసేవాళ్లున్నారు. సోనూసూద్ లాంటి స్టార్ గొప్ప సేవ‌లు చేశారు. దానిని చూపిస్తూ ఇత‌ర స్టార్లు స‌రిగా చేయ‌డం లేద‌ని తేలిగ్గా తీసుకుంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. నిజానికి ఇటీవ‌లి కాలంలో మెగాస్టార్ చిరంజీవి సీసీసీని ప్రారంభించి సినీకార్మికుల్ని ఆదుకున్న తీరు కానీ.. సెకండ్ వేవ్ స‌మ‌యంలో స్వ‌యంగా రంగంలోకి దిగి దేశ విదేశాల నుంచి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు .. కాన్ స‌న్ ట్రేట‌ర్ల‌ను కొనుగోలు చేసి తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న తీరు కానీ.. ఇవేవీ ప‌రిశీల‌నార్హమైన‌వి కావా? అస‌లు సేవ అనేది అనంత‌మైన ఆనందాన్నిస్తుంద‌ని సోనూసూద్.. చిరంజీవి వంటి వారు భావిస్తున్నారు. ఇక సోనూసూద్ కి అంత డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌స్తోంది? అంటూ కొంద‌రి ప్ర‌శ్న‌. ఎక్క‌డి నుంచి వ‌స్తే ఎవ‌రికి కావాలి. ఎంత మంచి జ‌రిగింది? అన్న‌ది క‌దా ముఖ్యం. ఇక సామాజిక సేవ చేయాల‌న్న ఆలోచ‌న అలా విమ‌ర్శించేవాళ్ల‌కు ఉందా?  ప‌క్క‌వాడు క‌ష్టంలో ఉంటే ప‌ది రూపాయ‌ల సాయానికి ప‌నికిరాని వాళ్లే ఇలాంటి విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్న‌ది ప‌రిశీల‌కుల అభిప్రాయం.

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ క్యాన్స‌ర్ ఆస్పత్రి ద్వారా సేవ‌లు చేయ‌డం లేదా? ర‌క్త దానాలను ప్రోత్స‌హించ‌డం లేదా?  కోవిడ్ రోగుల కోసం ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాలో రామ్ చ‌ర‌ణ్ త‌న తండ్రికి ప్రోత్సాహం అందించ‌డం లేదా? ఎంద‌రో స్టార్లు క‌నిపించ‌కుండా త‌మ‌వంతు సాయాల‌కు ముందుకు రావ‌డం చూస్తున్న‌దే క‌దా! ఇక ఎన్టీఆర్ - ఏఎన్నార్ - సావిత్రి కాలంలోనూ ఇలాంటి సేవ‌లు ఆపాత్ర‌దానాలు విన‌నివా?  

స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ 40ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి రాజోలు ప్రాంత‌వాసుల కోసం ఆక్సిజ‌న్ ప్లాంట్ నే నిర్మించారు. ఇలా ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులంతా ఆర్టిస్టులు టెక్నీషియ‌న్లు ఎవ‌రికి తోచిన సాయం వారు చేస్తూనే ఉన్నారు. అటు బాలీవుడ్ కోలీవుడ్ లోనూ స్టార్లు త‌క్కువేమీ కాదు. ఖాన్ ల త్ర‌యం స‌హా ఎంద‌రో హీరోలు హీరోయిన్లు త‌మ‌వంతు సాయాలు చేస్తున్నారు. ప్ర‌జ‌ల్ని ఆదుకుంటున్నారు. కోలీవుడ్ స్టార్లంతా విరాళాల‌తో ప్ర‌జ‌ల‌కు ప‌నికొచ్చే ప‌నులెన్నో చేస్తున్నారు. క‌రోనా క‌ష్ట‌కాలాన్ని ఎదుర్కొనేందుకు మాన‌వ‌త్వం చాటుతూనే ఉన్నారు. కానీ రాళ్లు విసిరే వాళ్లు విసురుతునే ఉన్నారు.

నువ్వు సాయం చేయ‌క‌పోయినా క‌నీసం సాయానికి ప్రేరేపించు. నాశ‌నం చేయ‌కు.. అనేది అంతిమంగా దీని సారాంశం. ఈ క‌రోనా క్రైసిస్ లో ప్ర‌తి ఒక్క‌రూ త‌మ వంతు ప‌రుల‌కు ఏం చేస్తున్నార‌న్న‌ది చాలా ముఖ్యం. క‌నీసం ఫోన్ చేసి క‌రోనా రోగికి ధైర్యం చెప్పినా అది సాయ‌మే క‌దా!! మీరు మాన‌వ‌త‌తో చేస్తున్నారా ఆ ఒక్క ప‌ని అయినా?
Tags:    

Similar News