టాలీవుడ్ కదలాల్సిన టైమ్ ?

Update: 2021-12-12 03:30 GMT
టాలీవుడ్ ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉంది. వాటికి మించి కరోనా కారణంగా రెండేళ్ళుగా వేయి స్లంపులను చూస్తోంది. నిజానికి ట్రేడ్ లెక్కలు చూస్తే టాలీవుడ్ లో హిట్లు కనీసం అయిదారు శాతం మించడంలేదు. పెద్ద హీరో సినిమాలకు హడావుడి ఉంటోంది, హిట్ అయినా బ్రేక్ ఈవెన్ కావడంలేదు. ఈ పరిస్థితులలో ప్రభుత్వాల సహకారం ఎంతో అవసరం. అయితే ఏపీ సర్కార్ తీసుకున్న టికెట్ల రేట్ల తగ్గింపు వల్ల టాలీవుడ్ మరింతగా కృంగిపోతోంది.

సినిమా హిట్ అయినా బ్రేక్ ఈవెన్ కావడంలేదు. దీనికి లేటెస్ట్ హిట్ అఖండ ఉదాహరణ. బెనిఫిట్ షోస్ లేవు, టికెట్ల రేట్లు పెంచుకోనీయడంలేదు. దాంతో అఖండ రెండు వారాలు గడచినా ఏపీలో కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించలేకపోతోంది. ఇదే గతంలో ఉన్న పరిస్థితి ఉంటే కచ్చితగా వచ్చిన ఊపునకు మొదటి నాలుగైదు రోజుల్లోనే లాభాల బాట పట్టేదని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు.

ఈ నేపధ్యంలో అఖండను కళ్లారా చూసిన వారు ఇంతకు మరిన్ని రెట్లు పెట్టుబడి పెట్టిన సినిమాలకు ఏపీలో నష్టాలు తప్పేట్లు లేవని కంగారు పడుతున్నారు. పుష్ప మూవీనే తీసుకుంటే ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా 130 కోట్ల దాకా జరిగిందిట. మరి ఏపీలో ఈ మూవీ ఇపుడున్న సిట్యువేషన్ లో బ్రేక్ ఈవెన్ అయ్యే చాన్స్ ఉందా అంటే జవాబు డౌటే. ఇక దీనికి మించి ట్రిపుల్ ఆర్ కూడా ఉంది. ఆ మూవీ 500 కోట్ల దాకా బిజినెస్ చేసింది.

ఏపీలో సీన్ తలచుకుంటేనే భయపెట్టేలా ఉంది మరి. అలాగే రాధేశ్యామ్, భీమ్లా నాయక్ వంటి పెద్ద సినిమాలు, ఆ తరువాత వచ్చే ఆచార్య సహా ఎన్నో సినిమాలు ఉన్నాయి. మరి ఏపీలో సీన్ మారకపోతే ఎంత హిట్ టాక్ వచ్చినా నిండా మునిగిపోతామని టాలీవుడ్ నిర్మాతలకు అర్ధమైపోతోంది. అన్నీ తెలిసినా ఎవరి మటుకు వారే ఇబ్బంది పడుతున్నారు తప్ప ఒక్కటిగా ముందుకు కదలడంలేదు అన్న మాట వస్తోంది.

ట్రిపుల్ ఆర్ మూవీ కోసం సంప్రదింపులు జరుపుతున్నామని ఆ చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. అదే విధంగా మిగిలిన సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. అందుకే టాలీవుడ్ పెద్దలు అంతా కలసి మరో సారి ఏపీ సర్కార్ తో చర్చలు జరిపితే బాగుంటుంది అన్న సలహా అయితే వస్తోంది. టాలీవుడ్ తో ఏపీ సర్కార్ కి గ్యాప్ ఉంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అటూ ఇటూ ఇగోస్ కూడా వర్కౌట్ అయి సీన్ ఇంతదాకా వచ్చింది అంటున్నారు.

మరి ఎంతో మందికి లైఫ్ ఇచ్చే సినిమా కూడా అతి పెద్ద వ్యాపారమే. దాని కోసం సినీ పెద్దలు ముందుకు రావాలి. అలాగే ప్రభుత్వ వర్గాలు కూడా పునరాలోచన చేయాలని కోరుతున్నారు. ఒకసారి కలసి చర్చలు జరిపితే పరిస్థితిలో మార్పు ఉంటుందని అంటున్నారు. దీని మీద సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ లాంటి వారు సంప్రదింపులు జరుపుతామని చెబుతున్నారు. మరి అదెంత తొందరగా జరిగితే అంత తొందరగా పెద్ద సినిమాలకు ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది.
Tags:    

Similar News