చిరునవ్వుల చిరునామా .. నవరసాల నమూనా .. భూమిక

Update: 2021-08-21 03:08 GMT
భూమిక అంటే అందం .. భూమిక అంటే నాజూకుదనం .. భూమిక అంటే సమ్మోహితులను చేసే దరహాసం. అన్నిటికీ మించి భూమిక అంటే ఒక హుందాతనం .. ఒక నిండైన వ్యక్తిత్వం. అందానికి అలంకరణ అవసరం లేదని చాటి చెప్పే సింప్లి సిటీ భూమిక సొంతం. విశాలమైన ఆమె కళ్లపై .. విశేషాలకు విడిదిలా కనిపించే నవ్వుపై .. విల్లులా విచ్చుకున్న పెదవులపై ఎన్ని కవితాలైనా చెప్పొచ్చు .. ఎన్ని కావ్యాలైనా రాయొచ్చు. అలాంటి భూమిక 'యువకుడు' సినిమాతో పరిచయమైనప్పటికీ, 'ఖుషీ' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

పవన్ కల్యాణ్ జోడీగా ఆమె చేసిన ఈ సినిమా, సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో భూమికను చూపిన కుర్రాళ్లు, భూమిపై ఇంతటి అందం దాగుందా? అన్నట్టుగా ఆశ్చర్యపోయారు. నాజూకైన ఆమె నవ్వుకు బానిసలైపోయారు. ఆమె కనురెప్పల దుప్పటిని కప్పుకుని కలలు కన్నారు. పొలోమంటూ ఆమె అభిమానుల జాబితాలో చేరిపోయారు. అందానికీ .. అభినయానికి అదృష్టం తోడైతే ఎలా ఉంటుందో, అలా తొలినాళ్లలో భూమిక కెరియర్ కొనసాగింది. మహేష్ తో చేసిన 'ఒక్కడు' .. ఎన్టీఆర్ తో చేసిన 'సింహాద్రి' సినిమాలు ఆమె క్రేజ్ ను మరింతగా పెంచాయి.

క్రేజ్ విపరీతంగా పెరిగిపోయిందనడానికి నిదర్శనం ఏమిటంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో చేసే అవకాశాలు వస్తాయి. తమ చుట్టూ కథ తిరిగే సినిమాల్లో చేయాలనే ఆసక్తి సహజంగానే చాలామందిలో ఉంటుంది. అయితే కెరియర్ గ్రాఫ్ తగ్గుతూ ఉన్నప్పుడు మాత్రమే ఈ తరహా సినిమాలు చేయాలి. ముందుగా చేస్తే కెరియర్ చివరి దశకి చేరుకుంటుంది. ఈ చిన్న విషయం వంట బట్టించుకోకుండా అవకాశాలకు దూరమైన కథానాయికలు చాలామందినే ఉన్నారు. సక్సెస్ గ్రాఫ్ ఒక రేంజ్ లో ఉన్న సమయంలో భూమిక కూడా ఇదే పొరపాటు చేసింది.

నాయిక ప్రధానమైన కథలను ఎంచుకుంటూ 'మిస్సమ్మ' .. 'సత్యభామ' .. 'మల్లెపువ్వు' వంటి సినిమాలు చేస్తూ వెళ్లింది. గ్లామర్ పరంగాను .. నటన పరంగాను 'మిస్సమ్మ' ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత సినిమాలేవీ ఆ స్థాయిలో ఆడలేదు. ఈ జాబితాలో 'అనసూయ' .. 'అమరావతి' వంటి థ్రిల్లర్ సినిమాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే గ్లామర్ పాత్రల నుంచి .. హీరోల జోడీ నుంచి ఆమె కాస్త దూరంగా వెళ్లిందో, అప్పటి నుంచి ఆమెకి అవకాశాలు తగ్గడం మొదలైంది. దాంతో సహజంగానే ఆమె ఇతర భాషా చిత్రాలపై దృష్టి పెడుతూ ఆ దిశగా ముందుకు వెళ్లింది.

కలర్ సినిమాల్లో కాలం కాస్త ఎక్కువ స్పీడ్ తో పరుగులు తీస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలా హీరోయిన్ గా వెళ్లిన భూమిక, కేరక్టర్ ఆర్టిస్ట్ గా 'మిడిల్ క్లాస్ అబ్బాయి'తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత 'సవ్యసాచి' .. 'యు టర్న్' వంటి సినిమాలు చేసింది. అదృష్టం కొద్దీ ఆమె పాత్రలకు మంచి పేరు వచ్చింది. రీసెంట్ గా వచ్చిన 'పాగల్' సినిమాలోను ఆమె ఒక కీలకమైన పాత్రను చేసింది. హీరోయిన్ గానే కాదు .. కేరక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆమె డీసెంట్ గా ఉండే పాత్రలను మాత్రమే చేస్తుండటం విశేషం. ఈ గ్లామర్ ఫీల్డ్ లో స్కిన్ షో అనే మాటకి తావు లేకుండా స్టార్ స్టేటస్ ను అందుకున్న అతికొద్ది మందిలో కథానాయికలలో భూమిక ఒకరు . ఈ రోజున ఆమె పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియచేద్దాం.
Tags:    

Similar News