సినీ కార్మికుల‌ స‌మ్మె.. ఇంత‌కీ డిమాండ్లు ఏమిటో?

Update: 2022-06-22 06:30 GMT
తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కు గ‌డ్డుకాలం అప్పుడే ముగిసిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. క‌రోనా క్రైసిస్ నుంచి బ‌య‌ట‌ప‌డి ఎలాగోలా గండం గ‌డిచింద‌ని అనుకుంటుండ‌గా ఇంత‌లోనే కార్మికుల మెరుపు స‌మ్మె షాకిచ్చింది. స‌జావుగా షూటింగులు జ‌రుగుతున్నాయి.. రిలీజ్ లతో ప‌రిశ్ర‌మ క‌ళ‌క‌ళ‌లాడుతోంది అనుకుంటుండ‌గా ఇంత‌లోనే పిడుగులా పంచ్ ప‌డింది. ప్ర‌స్తుతం దీనిపై నిర్మాత‌లు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నారు.

షూటింగులు ఆగ‌కుండా ఉండాలంటే ఈ స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రించాలి? అన్న‌దానిపై చ‌ర్చోప‌చర్చ‌లు సాగుతున్నాయ‌ని తెలిసింది. ఫిలింఛాంబ‌ర్- నిర్మాత‌ల గిల్డ్ చొర‌వ‌తో ఈ స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని భావిస్తున్నారు. అయితే నేటి నుంచి ప‌లు చిత్రాల షూటింగులు నిలిచిపోవ‌డం ఇప్పుడు ఇబ్బందిక‌రంగా మారింద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

అయితే స‌మ‌స్య ప‌రిష్క‌రించాలంటే నిర్మాత‌లు ఏం చేయాలి?  24 శాఖ‌ల యూనియన్ ల డిమాండ్లు ఎలా ఉన్నాయి? అంటే దానికి తాజాగా వివ‌రాలు అందాయి. నిజానికి ఈ రంగంలో రోజువారీ భ‌త్యాలు ఓ మోస్త‌రు ఫ‌ర్వాలేద‌నిపించే స్థాయిలోనే ఉన్నాయి. అసోసియేష‌న్ ప‌రిధిలో చెల్లింపులకు ఎలాంటి డోఖా ఉండ‌దు. ఇంటి నుంచి పిక‌ప్ మొద‌లు అల్పాహారం భోజ‌నం ఖ‌ర్చులు క‌లుపుకుని నిర్మాత‌కు క్లీన‌ర్ సెక్ష‌న్ ప్రొడ‌క్ష‌న్ బాయ్స్ కి రోజుకు రూ.1145 అవుతుంది. కార్మికుడు ఆశించిన రేటు రూ.1488. అంటే 30శాతం పెంపును కోరుతున్నారు. ఇక ఆదివారాలు - సెలవు దినాల్లో ఇది రెట్టింపు ఉంటుంది.

ప్ర‌స్తుతం నిర్మాత‌లు రూ. 2290 చెల్లిస్తుంటే .. వారు డిమాండ్ చేస్తున్న‌ది రూ. 2977 గా ఉంది. రోజుకు లైట్ మ్యాన్ కి అయ్యే ఖర్చు రూ.1100.. కానీ రూ 1440 వ‌ర‌కూ చెల్లించాల‌ని కోరుతున్నారు. ఆదివారాలు  సెలవు దినాలలో - రూ 2200 ఉండ‌గా రూ 2860 చెల్లించాల‌నేది డిమాండ్.

ఫైటర్స్ కి రోజుకు రూ 3265 చెల్లిస్తుండ‌గా..రూ. 4244 చెల్లిస్తేనే గిట్టుబాటు అవుతుంద‌ని అంచ‌నా విలువ చెబుతున్నారు. అలాగే డ్యాన్సర్లకు రూ 2800 చెల్లిస్తుండ‌గా రూ. 3640కు పెంచాల‌ని కోరుతున్నార‌ని తెలుస్తోంది. ఇత‌ర అసోసియేష‌న్ల కార్మికులు పెంపుద‌ల కోసం డిమాండ్ చేస్తున్నారు. అల్పాహారం భోజనం క‌లుపుకుని రోజుకు అసోసియేష‌న్ డ్రైవర్ల రేటు రూ. 1055 ఉండ‌గా.. రూ.1362 ఉండాల‌ని కోరుతున్నారు.

ఆదివారాలు సెలవు దినాలలో రూ 2110 చెల్లిస్తుండ‌గా రూ.2743 వ‌ర‌కూ చెల్లించాల‌ని డిమాండ్ చేస్తున్నార‌ని అంచ‌నా విలువ వెలువ‌డింది.  ఇక తమ వేతనాల పెంపుదల కోసం ఫెడరేషన్ పై సంఘాలు ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. వేతనాలు పెంచే వరకు 24 శాఖ‌ల కార్మికులు సమ్మెలో పాల్గొంటారు. నిర్మాత‌ల‌కు కార్మిక యూనియ‌న్ ల‌కు మ‌ధ్య స‌యోధ్య‌ను కుదిర్చేందుకు ఫెడ‌రేష‌న్ పెద్ద‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. వారు నిర్మాత‌లు ఛాంబ‌ర్ తో మంత‌నాలు సాగిస్తున్నార‌ని తెలిసింది.
Tags:    

Similar News