ప‌వ‌న్ ను తిడితే కానీ పెద్ద మ‌నుషులు రియాక్ట్ కారా?

Update: 2018-04-19 07:12 GMT
ఎక్క‌డ మొద‌లైంది.. మ‌రెక్క‌డికి వెళుతోంది? అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. క్యాస్టింగ్ కౌచ్ నీచాన్ని తెర మీద‌కు తేవ‌టంలో శ్రీ‌రెడ్డి స‌క్సెస్ అయ్యారు. ఆ విష‌యంలో మ‌రో మాట‌కు తావు లేదు. అయితే.. క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఆమె అదే ప‌నిగా మాట్లాడ‌టానికి ముందు.. అంతేసి కాలం ఆమె దానికి ఎందుకు ఒప్పుకుంద‌న్న ప్ర‌శ్న‌ను ఎవ‌రూ వేయ‌టం లేదు?  దానికి కూడా జ‌స్టిఫికేష‌న్ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది. రానున్న రోజుల్లో దీనికి కూడా స‌మాధానం రావొచ్చేమో?

ఆ విష‌యాన్ని వ‌దిలేస్తే.. కొత్త‌గా తెర మీద‌కు వ‌చ్చిన ఆర్జీవీ వ్య‌వ‌హారం చూస్తే వ‌ణికిపోవాల్సిందే. ఏసీ గ‌దుల్లో కూర్చొని జ‌నాల భావోద్వేగాల‌తో ఆడుకునే దుర్మార్గం క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా ఆర్జీవీ త‌న ప్లాన్ ను చెప్పేశారు. ఇలాంటివి పిచ్చి ప‌నులు అనాలా?  ఉన్మాద చ‌ర్య‌లు అనాలా? అన్న‌ది ప్ర‌శ్న‌. అటు ఆర్జీవీ కానీ ఇటు శ్రీ‌రెడ్డి కానీ త‌ప్పు చేశార‌న‌టంలో మ‌రో మాట లేదు. త‌ప్పు కాదు అంత‌కు మించిందే చేశారు ప‌వ‌న్ ఇష్యూలో.

ప‌వ‌న్ ఎపిసోడ్ కు సంబంధించి.. ఆయ‌న్ను అన‌కూడ‌ని మాట అన్న వెంట‌నే ప‌లు గొంతులు స‌ర్దుకోవ‌టం.. ఏసీ గ‌దుల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌టం లాంటివి చూస్తుంటే..ఈ ఇండ‌స్ట్రీ ఎవ‌రి కోసం రియాక్ట్ అవుతుంద‌న్న‌ది ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఒక ప్ర‌ముఖుడ్ని తిట్టినా.. అన‌కూడ‌ని మాట అన్న వెంట‌నే గొంతులు స‌వ‌రించుకునే ప‌రిశ్ర‌మ‌.. పెద్ద మ‌నుషులు.. చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని దారుణాతి దారుణాల మీద మాత్రం ఎందుకు రియాక్ట్ కారు?

శ్రీ‌రెడ్డి పుణ్య‌మా అని ప‌లువురు జూనియ‌ర్ ఆర్టిస్టులు.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు బ‌య‌ట‌కు వ‌చ్చారు. మీడియా ముఖంగా తాము ఎదుర్కొన్న దారుణాల గురించి వివ‌రించారు. వారు చెబుతున్న మాట‌లు కొన్ని క‌డుపు లోప‌లి పేగుల్ని తిప్పేసేలా ఉన్నాయి. అంత అస‌హ్య‌క‌రంగా.. ఛండాలంగా ఉన్న ప‌రిస్థితి. తాము ఎదుర్కొన్న దుర్మార్గ‌ల గురించి ఓపెన్ అయిన త‌ర్వాత వాటి మీద తీసుకోవాల్సిన చ‌ర్య‌లు.. అందుకు కార‌ణ‌మైన వారిని నియంత్రించ‌టానికి చిత్ర ప‌రిశ్ర‌మ ఏం చేయాల‌న్న అంశంపై మాట్లాడిన వారు క‌నిపించ‌లేదు.

త‌న త‌మ్ముడ్ని తిట్టారంటూ ఆవేశంతో బ‌య‌టకు వ‌చ్చిన నాగ‌బాబుకు త‌న త‌మ్ముడిని వెన‌కేసుకొచ్చి మాట్లాడిన ఆయ‌న‌.. ఔట్ డోర్ షూటింగ్ ల‌లో అమ్మాయిల‌కు బాత్రూం స‌దుపాయం ఉండ‌ద‌ని.. డ్రెస్ రూం సౌక‌ర్యం కూడా ఉండ‌ద‌ని తెలీక పోవ‌టం ఏమిటి? ఇప్ప‌టికి ఎన్నో సినిమాలు తీసిన అనుభ‌వం ఉన్న ఆయ‌న‌కు అవేమీ గుర్తుకు ఉండ‌క‌పోవ‌టం ఏమిటి?  త‌న త‌మ్ముడి విష‌యం వ‌చ్చేసరికి మండిప‌డుతూ మైకుల ముందుకు వ‌చ్చిన నాగ‌బాబు అంత‌కు ముందే క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ల బాధ‌ల గురించి మాట్లాడితే ఎంత బాగుండేది. త‌మ దృష్టికి వ‌చ్చిన విష‌యాల్ని ప‌రిష్క‌రిస్తామ‌ని పెద్ద‌రికపు బాధ్య‌త నెత్తిన వేసుకుంటే మ‌రింత బాగుండేది. అలాంటిదేమీ లేకుండా త‌మ కుటుంబ విష‌యానికి మాత్ర‌మే స్పందించిన‌ట్లుగా నాగ‌బాబు ఉండ‌కూడ‌దు క‌దా?  మ‌రో పెద్ద‌మ‌నిషి అల్లు అర‌వింద్ ప‌రిస్థితి కూడా ఇంచుమించు ఇలాంటిదే. ఇప్పుడు నోరు విప్పుతున్న వారు.. నాలుగైదు రోజుల ముందే  స్పందించి ఉంటే మ‌రింత గౌర‌వంగా ఉండేది.

టీవీల ముందుకు వ‌చ్చిన అమ్మాయిలు బ‌య‌ట‌పెట్టిన విష‌యాలు అంత త్వ‌ర‌గా మ‌ర్చిపోయేలా లేవ‌ని చెప్పాలి. వారు చెబుతున్న క‌స్టాలు.. ప‌డిన బాధ‌లు వింటే నిజంగా ఇంత దారుణ‌మా? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. కాటికి కాళ్లు చాచుకున్న వాళ్లు కూడా వాళ్ల‌కున్న అవ‌కాశాలు వాడుకొని.. ప‌ద‌హారేళ్ల అమ్మాయిని రాత్రంతా బాధ‌లు పెట్ట‌టం.. పెద్ద ఎత్తున ప‌రిశ్ర‌మ‌కు చెందిన అమ్మాయిల్ని సెక్సువ‌ల్ ఎక్స్ ప్లాయిట్ చేయ‌టం లాంటి ఉదంతాలు క‌డుపు మండిపోయేలా చేస్తాయి.  

ప‌వ‌న్ ను తిట్టిన తిట్టు త‌ప్ప‌నిస‌రిగా త‌ప్పే. ఆ విష‌యంలో మ‌రో మాట లేదు. కానీ.. ప‌వ‌న్ ను తిట్ట‌టానికి ముందు చాలామంది తాము ఎదుర్కొన్న చాలా బాధ‌ల గురించి.. ఆవేద‌న‌ల గురించి టీవీల్లో చెప్పిన‌ప్పుడు.. ఈ వ్య‌వ‌హారాల‌కు బాధ్యులైన వారిని చ‌ట్ట‌ప‌రంగా ఎదుర్కొంటామ‌ని.. చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్ప‌ట‌మో.. ఏదైనా క‌మిటీ వేసి విచార‌ణ చేయ‌టం లాంటివో చేస్తే బాగుండేది.

నిజానికి ఇలాంటి స్పంద‌న ఒక్క సినిమా ఇండ‌స్ట్రీలోనే కాదు బ‌య‌ట ప్ర‌భుత్వాల్లోనూ ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.

చిత్ర ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి ఇన్నేసి దారుణాలు బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ప్పుడు ఒక విచార‌ణ క‌మిటీని ఏర్పాటు చేయ‌టం.. నిఘా వ్య‌వ‌స్థ‌ల్ని అలెర్ట్ చేసి త‌ప్పులు చేస్తున్న వారిప‌ట్ల చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ.. శ్రీ‌రెడ్డి ఎపిసోడ్ లో ప్ర‌భుత్వ ప‌రంగా ఇలాంటి చ‌ర్య‌లేమీ తీసుకున్న‌ట్లు క‌నిపించ‌వు. అటు సినిమా పెద్ద‌లు.. ఇటు ప్ర‌భుత్వ పెద్ద‌లు సైతం ప‌ట్టించుకోనట్లుగా ఉండిపోవ‌టం త‌ప్పు ప‌ట్టాల్సిందే.
Tags:    

Similar News