తెలుగులో హ్యాట్రిక్ హిట్ అందుకున్న వారు వీరే

Update: 2021-12-08 01:30 GMT
టాలీవుడ్‌లో ఒక్క హీరోతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు ఆ త‌రువాత అదే హీరోతో హ్యాట్రిక్ హిట్ ల‌ని ద‌క్కించుకున్న సంద‌ర్భాలు చాలానే వున్నాయి. అలా హ్యాట్రిక్ హిట్‌ల‌ని త‌మ ఖాతాలో వేసుకున్న అరుదైన కాంబినేష‌న్‌లు మ‌న టాలీవుడ్‌లో మొత్తం 8 వున్నాయి. ఈ కాంబినేష‌న్ సెట్ట‌యిందంటే హిట్ గ్యారెంటీ అనే టాక్ ఇండ‌స్ట్రీలో వుంది. అలాంటి ఎనిమిది కాంబినేష‌న్‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ల‌ని మ‌న ఇండ‌స్ట్రీకి అందించి సరికొత్త రికార్డుల్ని నెల‌కొల్పారు. ఆ కాంబినేష‌న్ లు ఏంటో ఒక‌సారి చూద్దాం.

ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో ఏ నోట విన్నా ఒక‌టే మాట‌... `అఖండ‌`.. అఖండ‌.. బోయాప‌టి శ్రీ‌ను, నంద‌మూరి బాల‌కృష్ణ‌. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో `అఖండ‌` ముందు వ‌ర‌కు రెండు భారీ హిట్‌లున్నాయి. ముందు వీరిద్ద‌రూ క‌లిసి చేసిన చిత్రం `సింహా` (2010). ఈ చిత్రం బాల‌య్య కెరీర్‌లో స‌రికొత్త మ‌లుపు తిప్పి బాక్సాఫీస్ వ‌ద్ద బాల‌య్య కెరీర్‌లోనే స‌రికొత్త రికార్డులు సృష్టించింది. ఈ మూవీ త‌రువాత విరిద్ద‌రు క‌లిసి ప‌నిచేసిన రెండ‌వ చిత్రం `లెజెండ్‌`(2014). బాల‌య్య‌ని భిన్న పార్శ్వాల్లో ఆవిష్క‌రించిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపించి బాల‌య్య - బోయ‌పాటి అంటే హిట్ కాంబినేష‌న్ అనే ముద్ర వేసింది.

తాజాగా వ‌చ్చిన `అఖండ‌` (2021) వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన మూడ‌వ చిత్రం. డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం పేరుకు త‌గ్గ‌ట్టే అఖండ విజ‌యాన్ని సాధిస్తూ ఇండ‌స్ట్రీకి స‌రికొత్త ఊపునివ్వ‌డ‌మే కాకుండా థ‌ర్డ్ వేవ్ నేప‌థ్యంలో ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వున్న భ‌యాల్ని పోగొట్టింది. అంతే కాకుండా ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కాబినేస‌న్‌గా స‌రికొత్త రికార్డుని సాధించింది. ఈ సినిమాకి ముందు 7 హ్యాట్రిక్ హిట్ కాంబినేష‌న్ లు టాలీవుడ్‌లో వున్నాయి. ఈ వ‌రుస‌లో చెప్పుకోవాల్సిన హ్యాట్రిక్ హిట్ కాంబినేష‌న్ మెగాస్టార్ చిరంజీవి - ఏ. కోదండ‌రామిరెడ్డి. మెగాస్టార్ కెరీర్‌ని మ‌లుపు తిప్ప‌డంతో ఈ ద‌ర్శ‌కుడి పాత్ర చాలానే వుంది. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో మూడు భారీ విజ‌యాలొచ్చాయి. ఖైదీ, వేట‌, మ‌ర‌ణ మృదంగం, జేబు దొంగ‌, దొంగ మొగుడు, న్యాయం కావాలి, ర‌క్త సిందూర్, రుస్తుం.. ఇలా హ్యాట్రిక్ హిట్‌లు కాదు డ‌బుల్ హ్యాట్రిక్‌లున్నాయి.

ఆత‌రువాత చెప్పుకోవాల్సిన కాంబినేష‌న్ రాజ‌మౌళి - ప్ర‌భాస్‌. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన చిత్రాలు తెలుగు సినిమా స్వ‌రూపాన్నే మార్చేశాయి. `ఛ‌త్ర‌ప‌తి` ప్ర‌భాస్‌ని స్టార్‌ని చేసిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌రువాత వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన `బాహుబ‌లి ది బిగినింగ్‌`, `బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్‌` టాలీవుడ్‌ని ప్ర‌పంచ సినిమా య‌వ‌నికిపై స‌గ‌ర్వంగా నిలబెట్టాయి. ఆ త‌రువాత రాజ‌మౌళి - ఎన్టీఆర్ ల క‌ల‌యిక‌లోనూ హ్యాట్రిక్ హిట్‌లున్నాయి. 2001లో వ‌చ్చిన `స్టూడెంట్ నెం.1, 2003లో వ‌చ్చి ఇండస్ట్రీ రికార్డ్స్‌ని తిర‌గ‌రాసిన `సింహాద్రి, 2007లో ఎన్టీఆర్‌ని స‌మూలంగా మార్చి కొత్త‌గా ప్ర‌జెంట్ చేసిన `య‌మ‌దొంగ‌` ఇలా హ్యాట్రిక్ అందుకున్నాయి.

ఇక త్రివిక్ర‌మ్ - బ‌న్నీల క‌ల‌యిక‌లోనూ హాట్రిక్ హిట్‌లున్నాయి. 2012లో వ‌చ్చిన జులాయి, 2015లో వ‌చ్చిన స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, హిట్‌లుగా నిలిస్తే 2020 లో వ‌చ్చిన `అల వైకుంఠ‌పుర‌ములో` ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచి బ‌న్నీ కెరీర్‌ని మ‌రో మ‌లుపు తిప్పింది. ఇక బి. గోపాల్ - బాలయ్య‌ల క‌ల‌యిక‌లోనూ హ్యాట్రిక్ హిట్‌లు వ‌చ్చాయి. 1990లో వ‌చ్చిన లారీ డ్రైవ‌ర్‌, 1992లో వ‌చ్చిన రౌడీ ఇన్స్‌స్పెక్ట‌ర్‌, 1999లో వ‌చ్చిన `స‌మ‌ర‌సింహారెడ్డి` స‌రికొత్త రికార్డులు సృష్టించింది.

వీళ్ల‌తో పాటు ర‌వితేజ - పూరి జ‌గ‌న్పాథ్‌ల‌ది కూడా హ్యాట్రిక్ హిట్ కాంబినేష‌న్‌గా రికార్డు సాధించింది.వీరి క‌ల‌యిక‌లో ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం, ఇడియ‌ట్‌, అమ్మా నాన్న ఓ త‌మిళ‌మ్మాయి వంటి హిట్‌లు వ‌చ్చాయి. వి.వి.వినాయ‌క్ - ఎన్టీఆర్‌ల‌ది కూడా హ్యాట్రిక్ హిట్ కాంబినేష‌నే. 2002లో ఆది, 2004లో పాంబ‌, 2010లో అదుర్స్ చిత్రాల‌తో ఈ కాంబినేష‌న్ హ్యాట్రిక్ హిట్ కాంబినేష‌న్‌గా పేరు తెచ్చుకుంది.
Tags:    

Similar News