టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఈడీ ఎదుట హాజరైన రవితేజ..!

Update: 2021-09-09 05:30 GMT
2017 టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇప్పుడు ఇండస్ట్రీలో మళ్ళీ సంచలనం సృష్టిస్తోంది. ఎక్సైజ్ శాఖ క్లీన్ చీట్ ఇచ్చిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేసింది. మనీ లాండరింగ్ మరియు ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘన చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ.. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను విచారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు (సెప్టెంబర్ 9) గురువారం హీరో రవితేజ వంతు వచ్చింది.

తాజాగా రవితేజ హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నాడు. కొద్దీ సేపటి క్రితమే రవితేజ తన వ్యక్తిగత సిబ్బందితో కలిసి ఈడీ విచారణకు హాజరయ్యారు. తన బ్యాంకు ఖాతాల వివరాలు సమర్పించాల్సిందిగా ఇప్పటికే రవితేజ కు పంపిన నోటీసులలో ఈడీ పేర్కొంది. మనీలాండరింగ్ కోణంలో రవితేజ బ్యాంకు లావాదేవీలను అధికారులు పరిశీలించనున్నారు. అనుమానాస్పద లావాదేవీలపై రవితేజ ను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి.

అంతేకాదు డ్రగ్ పెడ్లర్ కెల్విన్ మరియు ఎఫ్ క్లబ్ గురించి కూడా రవితేజ ను ఈడీ ప్రశ్నించనున్నారని తెలుస్తుంది. అలాగే రవితేజ తోపాటు డ్రైవర్ శ్రీనివాస్ ను కూడా ఈడీ ఈరోజు విచారించనుంది. ఇకపోతే డ్రగ్స్ కేసులో ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖులు పూరి జగన్నాథ్ - ఛార్మీ కౌర్ - రకుల్ ప్రీత్ సింగ్ - నందు - రానా దగ్గుబాటి లను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇప్పుడు రవితేజ ను ఎంక్వైరీ చేస్తున్నారు.

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ను కూడా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అప్రూవర్ గా మారిన డ్రగ్ పెడ్లర్ నుంచి అధికారులు కీలక వివరాలు రాబట్టారని తెలుస్తోంది. కెల్విన్ లాప్ టాప్ - మొబైల్ ఫోన్ లో ఉన్న సమాచారాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ కేసులో సెప్టెంబర్ 13న నవదీప్ మరియు ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ - 17న తనీష్ - 22న తరుణ్ లను ఈడీ విచారించనుంది.
Tags:    

Similar News