డ్ర‌గ్స్ ద‌ర్యాప్తులో గుట్టంతా ఆ ఫైల్ లో దాగేనా?

Update: 2021-09-05 04:30 GMT
టాలీవుడ్ లో డ్ర‌గ్స్ కేసు అంత‌కంత‌కు హీట్ పుట్టిస్తోంది. ఇందులో ప‌లువురు సెల‌బ్రిటీలు ఈడీ విచార‌ణ‌ను ఎదుర్కొంటున్నారు. నిజానికి ఈ కేసులో విదేశీ డ్ర‌గ్ పెడ్ల‌ర్ కెవిన్ నాలుగేళ్ల క్రితం తెలంగాణ పోలీసులకు చిక్కినప్పుడు టాలీవుడ్ డ్రగ్స్ లింకులు బయటపడ్డాయి. అప్ప‌ట్లో స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్ (సిట్) ద‌ర్యాప్తు సంచ‌ల‌నం అయ్యింది. అగ్ర‌ద‌ర్శ‌కుడు పూరి జగన్నాథ్ - స్టార్ హీరో రవితేజ- క‌థానాయిక‌ ఛార్మి-రానా-న‌వ‌దీప్-త‌నీష్ త‌దిత‌రులను సిట్ విచారించింది.

దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగ ప్ర‌వేశం చేసి మ‌నీల్యాండ‌రింగ్ అనే కోణంలో ద‌ర్యాప్తు చేప‌ట్ట‌డం తాజాగా సంచ‌ల‌నం అయ్యింది. వాస్తవానికి డ్రగ్స్ రాకెట్ దర్యాప్తు ఇప్పుడు ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప‌రిధిలోకి రావ‌డంతో ప్రధాన ద‌ర్యాప్తు డ‌బ్బు హ‌వాలా అనే కోణం చుట్టూ విచార‌ణ సాగుతోంది. విదేశీ డ్ర‌గ్ పెడ్ల‌ర్ల‌కు టాలీవుడ్ ప్ర‌ముఖుల నుంచి డ‌బ్బు ఎలా త‌ర‌లివెళ్లింది? ఎంత మొత్తం త‌ర‌లి వెళ్లింది..?  బ్యాంకింగ్ లావాదేవీల సంగ‌తేమిటి? అన్న‌ది ఈడీ ప్ర‌తిదీ కూలంకుశంగా ప‌రిశీలిస్తోంది. ఇప్పటివరకు పూరీ జగన్ .. ఛార్మిని  10 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అందాల క‌థానాయిక రకుల్ ప్రీత్ ను 9 గంటల పాటు విచారించారు. గతంలో రకుల్ కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ లో SIT విచారణకు హాజరు కాలేదు కానీ గత ఏడాది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో రియా చక్రవర్తిని అరెస్టు చేసినప్పుడు ఆమె ముంబైలోని ఎన్సీబీ నుండి ప్రశ్నలు ఎదుర్కొంది.

తాజా స‌మాచారం మేర‌కు.. రకుల్ చేతిలో ఉన్న  ఆ ఫైల్ మ‌ర్మం ఏమిటో ఆరాలు మొద‌ల‌య్యాయి. అయితే ఈ ఫైల్ త‌న సీఏ రూపొందించిన‌ది. తన బ్యాంక్ లావాదేవీల వివరాలను ED కి అందించేందుకు అక్క‌డ‌కు తీసుకుని వ‌చ్చార‌ట‌. వాస్తవానికి హైదరాబాద్ కు చెందిన F- క్లబ్ మేనేజర్ తో ర‌కుల్ లావాదేవీలేమిట‌న్న‌దానిపైనా విచార‌ణ జ‌రిగింద‌ని గుస‌గుసలు వినిపిస్తున్నాయి. ఈ నటీనటులందరూ ఎఫ్ క్లబ్ మేనేజర్ ద్వారా ఆఫ్ షోర్ ఖాతాలకు భారీ మొత్తాన్ని బదిలీ చేసేవారని డ్రగ్ పెడ్లర్ కెవిన్ వెల్లడించార‌ని లీకులు అందాయి. అందుకే ఈ కేసులోని `హవాలా` కోణాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. పూరి - ఛార్మి బృందాన్ని కూడా ఇదే విషయమై ఈడీ ప్రశ్నించింది. అయితే నటుడు నవదీప్ మేనేజర్ ఈ మనీలాండరింగ్ కు సంబంధించి ఈడీ ద్వారా విచారించాల్సిన మరో ప్రధాన వ్యక్తి అని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ 8 న రానాను హైదరాబాద్ లో ఈడీ ప్రశ్నిస్తుందని టాక్ వినిపిస్తోంది.
Tags:    

Similar News