బన్నీ కామెంట్‌తో పుష్ప-3పై సందేహాలు
ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే పుష్ప-3 గురించి ఊహాగానాలు వచ్చాయి.
పుష్ప సినిమా మొదలైనపుడు దాన్ని రెండు భాగాలుగా తీసే ఉద్దేశం దర్శకుడు సుకుమార్‌కు లేదు. కానీ తర్వాత బాహుబలి తరహాలోనే ఆలోచన మారింది. రెండు భాగాలకు కథను విస్తరించారు. ఫస్ట్ పార్ట్ డివైడ్ టాక్‌ను తట్టుకుని హిట్టవడంతో రెండో భాగం ఇంకా భారీగా తీసే అవకాశం వచ్చింది. సినిమాకు హైప్ కూడా మామూలుగా లేదు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే పుష్ప-3 గురించి ఊహాగానాలు వచ్చాయి. సినిమాలో పార్ట్-3 కోసం లీడ్ సీన్ కూడా ఉండబోతోంది. నిర్మాతలు కూడా పుష్ప-3 విషయంలో ఆశాభావంతో ఉన్నారు. కానీ హీరో బన్నీ మాత్రం ఆ విషయంలో అంత సుముఖంగా లేడనే వార్తలు వస్తున్నాయి. చెన్నైలో జరిగిన ప్రిరిలీజ్ ఈవెంట్లో మైత్రీ మూవీ మేకర్స్ సీఈవో చెర్రీ పార్ట్-3 గురించి ప్రస్తావిస్తే బన్నీ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ చూస్తే ఇంకా పార్ట్ 3 కూడానా అన్నట్లుగా అనిపించింది.
ఇక బన్నీ లేటెస్ట్‌గా పెట్టిన సోషల్ మీడియా పోస్టును చూస్తే అతడికి మూడో భాగం చేసే ఆలోచనేమీ లేదని అనిపిస్తోంది. పుష్ప-2 షూట్ పూర్తయిన నేపథ్యంలో బన్నీ లొకేషన్ నుంచి ఒక ఫొటో పెట్టి ఐదేళ్ల పుష్ప ప్రయాణం పూర్తయిందని కామెంట్ పెట్టాడు. ఇలా జర్నీ పూర్తయింది అనేసరికి బన్నీకి పార్ట్-3 చేసే ఉద్దేశం లేదేమో అనే చర్చ సోషల్ మీడియాలో ఊపందుకుంది. వేరే సమీకరణాల్ని బట్టి చూసినా పుష్ప-3 సమీప భవిష్యత్తులో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఒకే పాత్ర తాలూకు లుక్, మూడ్‌లో ఇన్నేళ్ల పాటు ఉండి.. దాని కోసం విపరీతంగా కష్టపడి.. గతంలో మరే చిత్రానికీ లేనన్ని కాల్ షీట్స్ ఈ సినిమాకే ఇచ్చి బన్నీ విసిగిపోయినట్లు తెలుస్తోంది. సుకుమార్‌తో ఎంత మంచి అనుబంధం ఉన్నప్పటికీ బన్నీ ‘పుష్ప’ విషయంలో తీవ్ర అసహనానికి గురైనట్లు గుసగుసలు వినిపించాయి.. అందుకే ‘పుష్ప-2’ తర్వాత ఒక ఎమోషనల్ బ్రేక్ అవసరమని బన్నీ భావిస్తున్నాడట. ఈ పాత్ర ఎంత నచ్చినప్పటికీ.. ‘పుష్ప-2’ సక్సెస్ మీద కూడా ఎంతో నమ్మకంగా ఉన్నప్పటికీ ‘పుష్ప-3’ చేసే విషయంలో బన్నీ అంత సుముఖంగా లేడని సమాచారం. పైగా త్రివిక్రమ్ సినిమా విషయంలోనూ బన్నీ చాాలా కష్టపడాల్సి ఉంది. ఆయనకు వేరే కమిట్మెంట్లు ఉన్నాయి. అవి వాయిదా పడుతూ వస్తున్నాయి. మరోవైపు సుకుమార్ కూడా వేర ప్రాజెక్టులతో బిజీ అవబోతున్నాడని.. కాబట్టి సమీప భవిష్యత్తులో ఇద్దరూ కలిసి ‘పుష్ప-3’ చేసే అవకాశాలు లేవని.. ఫ్యూచర్లో అన్నీ కలిసి వస్తే సినిమా సాధ్యపడొచ్చని అంటున్నారు.