టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఈడీ ఎదుట హాజరైన హీరో నందు..!

Update: 2021-09-07 07:47 GMT
టాలీవుడ్‌ లో నాలుగేళ్ళ క్రితం సెన్సేషన్ క్రియేట్ చేసిన డ్రగ్స్‌ కేసులో.. ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్ - నటి ఛార్మీ కౌర్ - హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లను ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఈ క్రమంలో నేడు మంగళవారం విచారణలో భాగంగా హీరో నందు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో హాజరయ్యారు.

2017లో ఎక్సైజ్ శాఖ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ల ఆధారంగా.. డ్రగ్స్ వ్యవహారాల్లో ఆర్థిక లావాదేవీలు జరిగాయనే కోణంలో ఈడీ విచారణ జరుపుతోంది. మనీలాండరింగ్ మరియు ఫెమా రెగ్యులేషన్స్ ఉల్లంఘనల చట్టం కింద 12 మంది పలువురికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన డ్రగ్ పెడ్లర్ కెవిన్ ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వీరిలో నందు కూడా ఉన్నారు.

డ్రగ్స్ కేసులో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాల గురించి నందు ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. మనీలాండరింగ్ జరిగిందా లేదా అనేది నిగ్గు తేల్చడానికి నందు బ్యాంక్ స్టేట్మెంట్స్ ను ఈడీ పరిశీలించనుంది. ఇప్పటికే నోటీసుల్లో ఈ విషయాలను తెలిపినట్లు సమాచారం. నిజానికి సెప్టెంబర్ 20న నందు ఈడీ విచారణకు వస్తారని గత కొన్ని రోజులుగా కథనాలు వచ్చాయి. అయితే రెండు వారాల ముందుగానే యువ హీరో ఈడీ ఎదురు హాజరయ్యారు.

ఇకపోతే డ్రగ్స్ కేసు విచారణకు సెప్టెంబర్ 8న రానా దగ్గుబాటి - 9న రవితేజ మరియు ఆయన డ్రైవర్‌ శ్రీనివాస్‌ - 13న నవదీప్‌ మరియు ఎఫ్‌ క్లబ్‌ పబ్‌ జనరల్‌ మేనేజర్‌ - 15న ముమైత్‌ ఖాన్ - 17న తనీష్‌ - 22న తరుణ్‌ ఈడీ ఎదుట హాజరు కానున్నారు.


Tags:    

Similar News