టాప్ స్టోరి: బెస్ట్ క్రికెట‌ర్ ఎవ‌రు?

Update: 2019-04-02 01:30 GMT
మ‌న హీరోల ఆలోచ‌నా శైలిలో ఊహించ‌ని మార్పు క‌నిపిస్తోంది. సేఫ్ జోన్ అన్న ఆలోచ‌న కంటే.. ప్ర‌యోగాత్మ‌క‌త కే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. రొటీన్ క‌థ‌లు.. మూస‌ పాత్ర‌ల్లో న‌టించేందుకు ఆస‌క్తి చూపించ‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌ద‌నం కావాల‌ని ఆరాట‌పడుతున్నారు. అక్కినేని నాగ‌చైత‌న్య‌ - నాని ఆలోచ‌నా స‌ర‌ళి లో ఎంతో మార్పు స్పష్ఠంగా క‌నిపిస్తోంది. అలాగే టాలీవుడ్ రైజింగ్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ తొలి నుంచి ప్ర‌యోగాల‌తో ఆక‌ట్టుకుంటున్నాడు. ప్ర‌స్తుతం ఈ ముగ్గురూ క్రికెట‌ర్ పాత్ర‌లో న‌టిస్తుండ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

నాని కథానాయకుడిగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జెర్సీ. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. ఇందులో నాని అర్జున్‌ అనే 36 ఏళ్ల క్రికెటర్‌ గా కనిపించనున్నాడు. జర్నీ ఆఫ్‌ జెర్సీ పేరుతో ఇటీవ‌లే రిలీజ్ చేసిన‌ వీడియోకు నాని అభిమానుల నుంచి అద్భుత స్పందన వ‌చ్చింది. ఈ సినిమా కోసం నాని ప్రొఫెషనల్‌ క్రికెట్ గా మారిపోయారు. ఆ పాత్ర కోసం ఎంతో శ్ర‌మించాన‌ని తెలిపారు. క్రికెట‌ర్ గా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకునేందుకు 70రోజుల పాటు కఠోర సాధన చేశారు నాని. క్రికెట్‌ నిపుణుల సమక్షంలో సాగిన ఈ సాధనలో ఎన్నో మెలకువలు నేర్చుకున్నార‌ట‌. ఓ సీన్ లో అయితే నాని ముఖానికి బంతి బ‌లంగా తాక‌డంతో రక్తం కూడా వచ్చింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్త‌యింది. నిర్మాణానంతర ప‌నులు సాగుతున్నాయి. ఏప్రిల్‌ 19న సినిమాను రిలీజ్ చేయ‌నున్నారు.

అక్కినేని నాగ‌చైత‌న్య - స‌మంత జంట‌గా నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ తెర‌కెక్కించిన మ‌జిలీ ఈనెల 5న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో చైత‌న్య క్రికెట‌ర్ గా క‌నిపించ‌నున్నారు. ఒక మ‌ధ్య త‌ర‌గ‌తి కుర్రాడిగా - నిరుద్యోగిగా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో న‌టించిన చైత‌న్య క్రికెట‌ర్ గానూ క‌నిపించ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఇప్ప‌టికే రిలీజైన ట్రైల‌ర్ - టీజ‌ర్ ఆక‌ట్టుకున్నాయి. క్రికెట‌ర్ గా చై ఎలా న‌టించాడో చూడాల‌న్న ఆస‌క్తి అక్కినేని అభిమానుల్లో క‌నిపిస్తోంది. మ‌రోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న `డియ‌ర్ కామ్రేడ్` చిత్రం మేలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో దేవ‌ర‌కొండ విప్ల‌వ భావాలున్న యువ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు. దాంతో పాటే క్రికెట‌ర్ గానూ దేవ‌ర‌కొండ‌ను కొత్త అవ‌తారంలో చూసుకునే ఛాన్సుంది. ఈ చిత్రంలో గీత గోవిందం ఫేం ర‌ష్మిక మంద‌న క‌థానాయిక‌గా న‌టిస్తోంది. భ‌ర‌త్ క‌మ్మ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. రౌడీగా మెప్పించిన దేవ‌ర‌కొండ ఈసారి క్రికెట‌ర్ గానూ ర‌క్తి క‌ట్టిస్తాడ‌నే అభిమానులు భావిస్తున్నారు.

జెర్సీ - మ‌జిలీ - డియ‌ర్ కామ్రేడ్ చిత్రాల్లో క్రీడా నేపథ్యం  ఆస‌క్తి పెంచుతోంది. ఇక బాలీవుడ్ లోనూ ర‌ణ‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా క‌పిల్ దేవ్ బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. క‌పిల్ దేవ్ కెప్టెన్సీలోని టీమిండియా 1980లో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచుకోవ‌డం వెన‌క క‌ఠోర శ్ర‌మ‌ - త‌ప‌స్సును తెర‌పై ఆవిష్క‌రించ‌నున్నారు.  క్రికెట‌ర్ పాత్ర కోసం ర‌ణ‌వీర్ చాలానే శిక్ష‌ణ పొందాడు. అలాగే `కానా` అనే త‌మిళ చిత్రంలో అందాల క‌థానాయిక ఐశ్వ‌ర్యా రాజేష్ క్రికెట‌ర్ పాత్ర‌లో న‌టించి మెప్పించారు. 2018 డిసెంబ‌ర్ లో ఆ చిత్రం రిలీజై ఆక‌ట్టుకుంది. త‌మిళ స్టార్ హీరో శివ‌కార్తికేయ‌న్ సొంత నిర్మాణ సంస్థ‌లో ఈ ప్ర‌యోగాత్మ‌క చిత్రాన్ని నిర్మించ‌డం ఆసక్తిక‌రం. క‌ట్ట‌ప్ప పాత్ర‌ధారి స‌త్య‌రాజ్ కీల‌క పాత్ర పోషించారు. ఇంకాస్త వెన‌క‌టి కాలానికి వెళితే బాలీవుడ్ మిస్ట‌ర్ పెర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ న‌టించిన `ల‌గాన్` స్వాతంత్య్ర కాలం నాటి క్రికెట్ స్థితిగ‌తుల్ని ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఆ చిత్రం ఆస్కార్ బ‌రిలో చివ‌రికంటా పోటీకి నిలిచినా ఆస్కార్ ని ద‌క్కించుకోవ‌డంలో త‌డ‌బ‌డింది.
Tags:    

Similar News