బాలీవుడ్ పై టాలీవుడ్ హాలీవుడ్ పిడిగుద్దులు

Update: 2022-07-19 02:30 GMT
పాన్ ఇండియా రేస్ లో చ‌తికిల‌బ‌డిన బాలీవుడ్ ఇరుగు పొరుగు ముందు త‌ల‌దించుకునే స‌మ‌యం ఆస‌న్న‌మైందా? భార‌తీయ సినిమాకి వెన్నెముక‌ అని చెప్పుకునే ముంబై ప‌రిశ్ర‌మ‌పై టాలీవుడ్ హాలీవుడ్ స‌వారీ చేస్తున్నాయా? అంటే అవున‌నేందుకు తాజాగా ఐఎండీబీ వెల్ల‌డించిన గ‌ణాంకాలు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి.

మునుపెన్న‌డూ లేని తీవ్ర‌మైన సంక్షోభాన్ని హిందీ చిత్ర‌సీమ ఎదుర్కొంటోంది. స‌రైన బ్లాక్ బ‌స్ట‌ర్ లేక పోవ‌డం .. పాన్ ఇండియా వార్ లో పూర్తిగా వెన‌క‌బ‌డిపోవ‌డం ఇప్పుడు బాలీవుడ్ ట్రేడ్ నిపుణుల్లో పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది. హిందీ చిత్ర‌ప‌రిశ్ర‌మ దిగ్గ‌జాలుగా చెప్పుకునే ఖాన్ ల త్ర‌యంతో పాటు క‌పూర్ లు బ‌చ్చ‌న్ లు రోష‌న్ లు తీవ్ర‌మైన ఒత్తిడిలో ప‌డిపోయారు.

ఇటీవ‌ల విడుద‌లైన ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ 2 సంచ‌ల‌న విజ‌యాలు న‌మోదు చేసి 1000 కోట్ల క్ల‌బ్ లో నిల‌వ‌డం కూడా బాలీవుడ్ కి స‌వాల్ గా మారింది. దీనికి తోడు పులి మీద పుట్ర‌లా హాలీవుడ్ కూడా బాలీవుడ్ పై దండ‌యాత్ర చేస్తోంది. నిజానికి హాలీవుడ్ యాక్ష‌న్ సినిమాలు చూసినంత‌గా బాలీవుడ్ సినిమాల్ని చూసేందుకు ఉత్త‌రాది జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం లేదు. సౌత్ నుంచి వ‌చ్చే రా యాక్ష‌న్ కంటెంట్ సినిమాల‌కు ప‌ట్టంగ‌ట్టేందుకు లేదా వైవిధ్యం ఉన్న సౌత్ సినిమాల్ని వీక్షించేందుకు ఉత్త‌రాది ప్ర‌జ‌లు ఆస‌క్తిని క‌న‌బర‌చ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ బాలీవుడ్ పై దండ‌యాత్ర చేస్తోంది. ఇప్ప‌టికే అర‌డ‌జ‌ను పాన్ ఇండియా హీరోలు టాలీవుడ్ నుంచి పుట్టుకు రావ‌డం బాలీవుడ్ పై విజ‌య భేరి మోగించ‌డం చూస్తున్న‌దే.

తాజాగా ప్రఖ్యాత ఐఎండిబి వెల్ల‌డించిన బాక్సాఫీస్ గ‌ణాంకాల‌ను ప‌రిశీలిస్తే బాలీవుడ్ పై  సౌత్ హ‌వా.. హాలీవుడ్ హవా ఎలా సాగిందో అర్థం చేసుకోవ‌చ్చు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ - ప్రశాంత్ నీల్ కాంబో మూవీ KGF: చాప్టర్ 2 హిందీ వెర్ష‌న్ డబ్బింగ్ వెర్షన్ లలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ చిత్రం రూ. 434.70 కోట్లు కేవ‌లం హిందీ బాక్సాఫీస్ నుంచి వసూలు చేసింది. S.S. రాజమౌళి- రామ్ చరణ్ -జూనియర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్ మూవీ  RRR హిందీ బాక్సాఫీస్ నుంచి రూ. 274.31 కోట్లు వ‌సూలు చేసింద‌ని ట్రేడ్ వెల్ల‌డిస్తోంది. తాజాగా ఐఎండిబి స్థూల వసూళ్ల గణాంకాలను వెల్ల‌డించింది. దీని ప్రకారం KGF: చాప్టర్ 2 ప్రపంచ వ్యాప్త ఆదాయాలు అన్ని భాషలలో కలిపి రూ. 1235.2 కోట్లు .. ఆ తర్వాత రూ. 1135.8 కోట్ల(జీఎస్టీ-ప‌న్నుల మిన‌హాయించ‌గా)తో  RRR రెండో స్థానంలో నిలిచింది.

బాలీవుడ్ మూవీ `ది కాశ్మీర్ ఫైల్స్ రూ. 291.2 కోట్లతో (ప్రపంచవ్యాప్తంగా రూ. 337.2 కోట్లు) టాపర్ గా నిల‌వ‌గా... స్లీపర్ హిట్  `భూల్ భూలయ్యా 2` రూ. 213 కోట్లు (ప్రపంచవ్యాప్తంగా రూ. 262.5 కోట్లు) తో త‌ర్వాతి స్థానంలో నిలిచింది. అలియా భట్ `గంగూబాయి కతియావాడి` దేశీయంగా రూ. 129.10 కోట్లు (ప్రపంచవ్యాప్తంగా రూ. 194.9 కోట్లు) తో త‌ర్వాతి స్థానం అందుకుంది. ఇవ‌న్నీ ఆయా సినిమాల‌ స్థూల వసూళ్ల గ‌ణాంకాలు. రణ్ వీర్ సింగ్ న‌టించిన 83 .. షాహిద్ కపూర్ జెర్సీ తర్వాత తాప్సీ శ‌భాష్ మిథు బాక్సాఫీస్ వ‌ద్ద‌ వైఫల్యం పాలైన స్పోర్ట్స్ బ‌యోపిక్ గా రికార్డుల‌కెక్కింది. గత వారాంతంలో ఈ మిథాలీ రాజ్ బయోపిక్ కేవలం 40 లక్షలు మాత్రమే వసూలు చేసింది. రాజ్ కుమార్ రావ్ నటించిన `హిట్ - ది ఫస్ట్ కేస్` దాని ప్రారంభ వారాంతంలో రూ. 1.35 కోట్లను ఆర్జించింది. `KGF: చాప్టర్ 2` మొదటి షో ఒక్క‌టి తెచ్చినంత మొత్తం ఇది. విద్యుత్ జమ్వాల్ `ఖుదా హాఫీజ్: చాప్టర్ ll - అగ్ని పరీక్ష` కేవలం రూ. 10.91 కోట్లు మాత్రమే వ‌సూల్ చేసింది. ఖుదా హాఫీజ్: చాప్టర్ II టైమ్ లో వ‌చ్చిన‌ క్రిస్ హేమ్స్ వర్త్ నటించిన `థోర్: లవ్ అండ్ థండర్` రూ. 79.55 కోట్లు వసూలు చేయ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం.

ఇటీవ‌ల వ‌చ్చిన వాటిలో ధావ‌న్ బోయ్ కి మంచి హిట్టు ద‌క్కింది. వరుణ్ ధావన్- కియారా అద్వానీ -అనిల్ కపూర్-నీతూ కపూర్ న‌టించిన‌ జగ్ జగ్ జీయో ప‌రువు కాపాడింది. ఇటీవల విడుదలైన వాటిలో బాలీవుడ్ బెస్ట్ అనిపించింది.  రూ. 83.17 కోట్లు సుమారుగా వ‌సూలు చేసింది ఇప్ప‌టికి. ఇది అక్షయ్ కుమార్ సూపర్ హైప్డ్  హిస్టారిక‌ల్ వారియ‌ర్ మూవీ `సామ్రాట్ పృథ్వీరాజ్` రూ. 68.05 కోట్లు కంటే గణనీయంగా ఎక్కువ మొత్తం. నిజానికి హాలీవుడ్ మూవీ `జురాసిక్ వరల్డ్ డొమినియన్` రూ. 68.56 కోట్లతో ఇంత‌కంటే బెట‌ర్ గా హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద‌ పెర్ఫామ్ చేసింది. అమితాబ్ బచ్చన్- అజయ్ దేవగన్ నటించిన `రన్ వే 34`రూ. 34.50 కోట్లతో పోలిస్తే..`ది బ్యాట్ మ్యాన్` రూ. 48.10 కోట్లతో గ్రాఫ్ లో పైన ఉంది. టామ్ క్రూజ్ టాప్ గన్: మావెరిక్ రూ. 34.50 కోట్లు వ‌సూలు చేసి బెటర్ అనిపించింది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన హీరోపంతి 2 రూ. 24.45 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది.

టాలీవుడ్ నుంచి ఆర్.ఆర్.ఆర్ .. శాండ‌ల్వుడ్ నుంచి కేజీఎఫ్ 2 హిందీ అనువాదాలుగా విడుద‌లై భార‌త‌దేశంలో టాప్ 1 టాప్ 2 స్థానంలో నిల‌వ‌గా.. డాక్ట‌ర్ స్ట్రేంజ్- థోర్ - టాప్ గ‌న్ లాంటి సినిమాలు హిందీ సినిమాల వ‌సూళ్ల‌తో పోటీప‌డి బెట‌ర్ గా పెర్ఫామ్ చేయ‌డం విశేషం. దీంతో హిందీ చిత్ర‌సీమ సెల్ఫ్ డిఫెన్స్ లో ప‌డింద‌ని అర్థ‌మ‌వుతోంది. త‌ర‌ణ్ ఆద‌ర్శ్.. క‌ర‌ణ్ జోహార్ లాంటి ట్రేడ్ నిపుణులు సైతం బాలీవుడ్ ఆత్మ ప‌రిశీలన చేసుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని అన్నారు. అనుపమ్ ఖేర్ లాంటి న‌టుడు ఇప్ప‌టికే తెలుగు -క‌న్న‌డం స‌హా ఇత‌ర భాష‌ల సినిమాల‌ను పొగిడేస్తున్న తీరు బాలీవుడ్ వెన‌క‌బాటుకు సూచిక‌గా క‌నిపిస్తోంది. ఆత్మ‌ప‌రిశీల‌న‌తో బ‌య‌ట‌ప‌డాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని అర్థ‌మ‌వుతోంది.
Tags:    

Similar News