వైజాగ్ స్టూడియోస్‌ పై నిర్మాతల‌ ఆస‌క్తి

Update: 2018-11-23 14:30 GMT
బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రంలో కొత్త టాలీవుడ్ నిర్మాణం ఏపీ కారిడార్‌ లో హాట్ టాపిక్. అందుకు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని న‌మ్మారంతా. కానీ ఇటీవ‌ల ప‌రిణామాలు చూస్తుంటే అస‌లు వైజాగ్‌ లో సినీప‌రిశ్ర‌మ ఏర్పాటున‌కు బాబు ఏమాత్రం చిత్త‌శుద్ధితో కృషి చేయ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు సినీ పెద్ద‌ల నుంచే వెల్లువెత్తుతున్నాయి. స్టూడియోల నిర్మాణం అంటూ హ‌డావుడి త‌ప్ప అందుకు నిజాయితీగా ముంద‌డుగు ప‌డ‌లేదన్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

అయితే ఏపీలో సాధార‌ణ ఎన్నిక‌ల‌కు టైమ్‌ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ  వైజాగ్ టాలీవుడ్‌ పై జ‌నాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈసారికి చంద్ర‌బాబు చేయ‌లేనిది వ‌చ్చే కొత్త ప్ర‌భుత్వం అయినా చేస్తుంది! అన్న ఆకాంక్ష ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల్లో - వైజాగ్ స్థానికుల్లో బ‌లంగా వినిపిస్తోందిట‌. ఈ కొత్త కోణంపై ఫిలింస‌ర్కిల్స్‌ లోనూ ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ సాగుతోంది. జీవోలు అంటూ హ‌డావుడి కాకుండా చిత్త‌శుద్ధితో ఉపాధి అన్న కోణంలో ఈ ప్ర‌య‌త్నం సాగాల‌ని ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌న్న అభిప్రాయం మెజారిటీ పార్ట్ వినిపిస్తోంది.

ఇక‌పోతే వైజాగ్‌ లో ఫిలిం స్టూడియోల నిర్మాణానికి చెన్న‌య్‌ కి చెందిన ప్ర‌ఖ్యాత ఏవీఎం స్టూడియోస్ ఆస‌క్తిగా ఉంద‌ని భీమిలి-కాపులుప్పాడ ప‌రిస‌రాల్లో భూముల్ని కేటాయించనున్నార‌ని ఇదివ‌ర‌కూ ఎఫ్‌ డీసీ ప్ర‌క‌టించింది. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ సైతం అక్క‌డ స్టూడియో సెట‌ప్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ని ఏపీ ఎఫ్‌ డీసీ ప్రెస్‌ నోట్ రిలీజ్ చేసింది. బీచ్ రోడ్‌ లో రామానాయుడు స్టూడియోస్‌ కి కూత‌వేటు దూరంలోనే ఈ సెట‌ప్ ఉంటుంద‌ని పేర్కొంది. కానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ అందుకు సంబంధించిన ఊసే లేదు. విశాఖ‌లో స్టూడియోల నిర్మాణానికి కేవ‌లం ఆ రెండు ద‌ర‌ఖాస్తులేనా?  లేక ఇంకా ఎవ‌రైనా ఆస‌క్తిగా ఉన్నారా? అని ఫిలింస‌ర్కిల్స్‌ లో సెర్చ్ చేస్తే... ప‌లువురు నిర్మాత‌లు ఎంతో క్యూరియ‌స్‌ గానే ఉన్నార‌ని తెలుస్తోంది.

ఓ ప్ర‌ముఖ నిర్మాత‌కు రామానాయుడు స్టూడియోస్ ప‌క్క‌నే రెండెక‌రాల స్థ‌లం ఉంది. దానికి మ‌రో మూడెక‌రాలు జోడిస్తే అక్క‌డ స్టూడియో క‌ట్టే ఆస్కారం ఉందిట‌. అందుకు ఆయ‌న ఆస‌క్తిగానే ఉన్నారు.  స్టూడియో నిర్మాణానికి మినిమంగా ఐదెక‌రాలు అయినా కావాలి. అవ‌స‌రం మేర భూమిని ప్ర‌భుత్వ‌మే ఇవ్వాల్సి ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు. ప‌లువురు నిర్మాత‌ల్ని ప్ర‌శ్నిస్తే.. కొత్త ఇండ‌స్ట్రీ సెట‌ప్ కాబ‌ట్టి ఇన్సెంటివ్స్‌ తో ప్ర‌భుత్వం ప్రోత్స‌హించాల‌ని - ప్ర‌భుత్వ‌మే భూముల విత‌ర‌ణ చేయాల‌ని - ధ‌ర‌లు త‌గ్గింపును ఇవ్వాల‌ని అన్నారు. హైద‌రాబాద్‌ తో పోటీప‌డుతూ వైజాగ్ ఇండ‌స్ట్రీ బెస్ట్ ఇండ‌స్ట్రీ గా ఎదిగేందుకు ఛాన్సుంద‌ని మెజారిటీ పార్ట్ నిర్మాత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. విజ‌య‌వాడ‌తో పోలిస్తే వైజాగ్‌ లో వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంద‌ని - వేడి త‌క్కువ‌గా ఉంటుంద‌ని ఓ ప్ర‌ముఖ అగ్ర‌నిర్మాత అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌భుత్వం ఇంటెన్సివ్స్ ఇచ్చి నిజాయితీగా ప్రోత్స‌హిస్తేనే స్టూడియోల నిర్మాణం సాధ్య‌మ‌వుతుంది. లేదంటే క‌ష్ట‌మే.. భూములు అందుబాటులో ఉన్నా.. ధ‌ర‌ల‌ వెసులుబాటు ముఖ్యం.. ఆస‌క్తి చూపించిన వారిని ప్రోత్స‌హించాల్సి ఉంటుంద‌ని అభిప్రాయ ప‌డ్డారు.
Tags:    

Similar News