ఇండ‌స్ట్రీ వ్య‌వ‌హారంపై జాతీయ ఉత్త‌మ న‌టుడి ఆవేద‌న‌

అంత‌టి ప్ర‌తిభావంతుడు ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగుతోంది. భాజ్ పాయ్ ఆవేద‌న ఇలా ఉంది.

Update: 2024-11-22 20:30 GMT

సినీప‌రిశ్ర‌మ త‌న ప్ర‌తిభ‌కు స‌రిపోయే లేదా స‌రితూగే అవ‌కాశాల‌ను ఇవ్వ‌ద‌ని కెరీర్ ప్రారంభంలోనే గ్ర‌హించాన‌ని జాతీయ ఉత్తమ న‌టుడు మ‌నోజ్ భాజ్ పాయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. గోవాలో జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) సెషన్‌లో మనోజ్ బాజ్‌పేయి ఈ వ్యాఖ్య‌లు చేసారు. IFFI 2024 ప్రారంభ రోజైన గురువారం, మనోజ్ భాజ్ పాయ్ మాస్టర్ క్లాస్‌లో సభను ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశంలో నాన్ మెయిన్ స్ట్రీమ్ సినిమా (క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు కానివి) ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంద‌ని అన్నారు. మ‌నోజ్ భాజ్ పాయ్ త‌న కెరీర్ లో నాలుగు సార్లు ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డులు అందుకున్న సంగ‌తి తెలిసిందే. అంత‌టి ప్ర‌తిభావంతుడు ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగుతోంది. భాజ్ పాయ్ ఆవేద‌న ఇలా ఉంది.

మేము ప్రస్తుతం అత్యల్ప స్థితి(లీస్ట్ సిట్యుయేష‌న్)లో ఉన్నాము. స్వతంత్ర సినిమా కోసం బలమైన వేదిక ఉందని మేము అనుకున్నాం కానీ ఇప్పుడు OTT ప్లాట్‌ఫారమ్‌లు కూడా అలాంటి సృజనాత్మకతను స్వాగతించడం మానేశాయి! అని మ‌నోజ్ భాజ్ పాయ్ ఇఫీ 2024 వేదిక‌పై వ్యాఖ్యానించారు. మేం అనిశ్చితిలో జీవిస్తున్నాము. ఇది ప్రతిచోటా ప్రతిబింబిస్తుంది. ఏదో ఒక రోజు స్వతంత్ర సినిమా మళ్లీ పుంజుకుంటుంది. ఇండిపెండెంట్ సినిమాలే ``సినిమా అనేది ఒక కళ`` అనే నిర్వచనానికి కట్టుబడి ఉండే ఏకైక సినిమా అని అన్నారు.

కెరీర్ ప్రారంభించిన రెండు దశాబ్దాల తర్వాత తన కెరీర్‌లో ఎలా ఆశించిన స్థాయికి చేరుకున్నాడో కూడా ప్రస్తావించాడు. నేను గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ చేస్తున్నప్పుడు ఈ పరిశ్రమ నాకు కావలసినది ఇవ్వదని గ్రహించాను. వారు నాకు కావలసిన స్క్రిప్ట్‌లు రాయడం లేదు.. ప్రతిభావంతులకు అవకాశాలు ఇవ్వడం లేదు. నేను నా సొంత‌ దర్శకులు, స్క్రిప్ట్‌ల కోసం వెతకాలని అర్థ‌మైంది. శాశ్వ‌త‌త్వం ఇచ్చే ఆ ఒక్క స్క్రిప్ట్ నా ద‌రికి చేరాలంటే చాలా వేచి ఉండాలని గ్రహించాను.. చివ‌ర‌కు నేను నిరాశకు గురయ్యాను! అని మ‌నోజ్ ఆవేద‌న చెందారు.

జాతీయ ఉత్త‌మ న‌టుడు మనోజ్ భాజ్ పాయ్ ఇంకా మాట్లాడుతూ తాను ప్ర‌తిభావంతులు తీసిన‌ చాలా షార్ట్ ఫిల్మ్‌లను చూశానని .. దీపేష్ జైన్ (గాలి గులేయన్) .. కను బహ్ల్ (డిస్పాచ్) వంటి కొత్త ఫిల్మ్‌మేకర్‌లను కనుగొన్నానని చెప్పాడు. నటుడిగా, ప్రధాన స్రవంతి సినిమాలు నేను ఇష్టపడేవి కావు.. వారు మిమ్మల్ని ఒక రకమైన శైలిలో చేర్చారు! అని అన్నారాయన.

మనోజ్ న‌టించిన నాలుగు సినిమాలు ఈ ఏడాది విడుద‌ల కావాల్సి ఉంది. నెట్‌ఫ్లిక్స్ డార్క్ కామెడీ కిల్లర్ `సూప్`, రామ్ రెడ్డి ది ఫేబుల్, పోలీస్ ప్రొసీజర్ సైలెన్స్ 2: ది నైట్ ఔల్ బార్ షూటౌట్ విడుద‌ల కావాల్సి ఉంది. అలాగే తాను న‌టించిన‌ మొదటి యాక్షన్ చిత్రం `భయ్యాజీ` రిలీజ్ బ‌రిలో ఉంది. `ది ఫ్యామిలీ మ్యాన్` మూడవ సీజన్‌లో శ్రీకాంత్ తివారీ పాత్రను తిరిగి పోషిస్తున్నాడు. ఇది 2025లో స్ట్రీమ్ అవుతుంద‌ని క‌థ‌నాలొచ్చాయి.

Tags:    

Similar News