ఒకే రోజు పది సినిమాలు.. కానీ ఒక్కదానికీ క్రేజ్ లేదు..!

Update: 2021-11-16 07:57 GMT
కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రతీ వారం అర డజను సినిమాల చొప్పున థియేటర్లలోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చినవన్నీ చిన్న మీడియం రేంజ్ సినిమాలే. ఈ శుక్రవారం మరో పది చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో ఒకటి డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతుంటే.. మిగతా తొమ్మిది చిత్రాలు థియేటర్లలో విడుదల అవుతున్నాయి. అయితే వాటిలో ఏ ఒక్క సినిమాకీ సరైన క్రేజ్ లేకపోవడం గమనార్హం.

తేజ సజ్జా - శివానీ రాజశేఖర్ జంటగా నటించిన చిత్రం 'అద్భుతం'. అప్పుడెప్పుడో పూర్తైన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నవంబర్ 19న స్ట్రీమింగ్ కాబోతోంది. ఫాంటసీ లవ్ స్టోరీగా కాస్త భిన్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందింది. హీరోహీరోయిన్లు తెలిసిన మొహాలే కావడం ఈ సినిమాకు ప్లస్ అయ్యే అంశం. కాకపోతే పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం వల్ల సినిమా విడుదల అవుతుందన్న విషయం కూడా జనాలకు రీచ్ అవలేదు.

‘కేరింత’ ఫేమ్ పార్వతీశం - శ్రీలక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించిన 'సావిత్రి వైఫాఫ్ సత్యమూర్తి' ఈ వారమే థియేటర్లలోకి వస్తోంది. అలానే ‘పీనట్ డైమండ్’ మూవీ ఇప్పుడు 'రామ్ అసుర్' గా పేరు మార్చుకొని విడుదల అవుతోంది. వీటితో పాటుగా 'ఊరికి ఉత్తరాన' 'పోస్టర్' 'రావణలంక' 'మిస్సింగ్' 'మిస్టర్ లోన్లీ' 'ఛలో ప్రేమిద్దాం' 'స్ట్రీట్ లైట్' వంటి చిత్రాలు కూడా నవంబర్ 19న తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.

ఒకే రోజు 10 సినిమాలు రిలీజ్ అవుతున్నా ఒక్క దానికి కూడా బజ్ లేదు. డిసెంబర్ మొదటి వారం నుంచి మొదలుకొని మీడియం రేంజ్ మరియు పెద్ద హీరోల సినిమాల విడుదల ఉండటం.. జనవరిలో భారీ చిత్రాలు వస్తుండటంతో చిన్న సినిమాలకు వచ్చే రెండు నెలల్లో థియేటర్లు దొరికే పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకే చిన్న చిత్రాలన్నీ గంప‌గుత్త‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. మరి ఈ పది సినిమాల్లో ఏవేవి ప్రజాదరణ పొందుతాయో చూడాలి.
Tags:    

Similar News