ఇక చూపులన్నీ శ్రీమంతుడిపైనే

Update: 2015-07-11 06:54 GMT
బాహుబలి రిలీజై వసూళ్ల రికార్డులు తిరగరాస్తోంది. టాలీవుడ్‌లో తొలి 100కోట్ల ప్రాజెక్టు ఇదే అవుతుందని అంచనాలేస్తున్నారు. ఇప్పటివరకూ అత్తారింటికి దారేది పేరిట ఉన్న అన్ని రికార్డుల్ని తుడిచేయడం ఖాయం అని చెబుతున్నారు. అంతేనా మహేష్‌ పేరిట ఓవర్సీస్‌లో ఉన్న రికార్డుల్ని ఈ సినిమా తుడిచేస్తోంది. ఈ నేపథ్యంలో మహేష్‌పై ప్రెజర్‌ పడనుంది. బాహుబలి మానియా మరో వారం పాటు ఇదే రేంజులో కొనసాగుతుంది. ఆ తర్వాత జనాల ఫోకస్‌ అంతా రాబోవు పెద్ద సినిమా పైకి మళ్లుతుంది.

బాహుబలి తర్వాత ఇక మహేష్‌ నటించిన 'శ్రీమంతుడు' అంత క్రేజీ ప్రాజెక్టు అవుతుంది. కాబట్టి కళ్లన్నీ అటువైపే. బాహుబలి సెట్‌ చేసిన రికార్డుల్ని శ్రీమంతుడు టచ్‌ చేస్తాడా చేయగలడా అన్న సందేహాలు అలుముకున్నాయి ఇప్పటికే. గతంలో రామ్‌చరణ్‌-రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన 'మగధీర' రికార్డుల్ని టచ్‌ చేయడానికి పదేళ్లు పైగానే పట్టింది. తిరిగి బాబాయ్‌ పవన్‌ సినిమా వస్తే కానీ టచ్‌ చేయలేకపోయారు. అత్తారింటికి దారేది మాత్రమే హిస్టరీని తరగరాయగలిగింది.

ఈసారి ప్రభాస్‌-రాజమౌళి ఎపిక్‌ వార్‌ చిత్రం సృష్టిస్తున్న సంచలనాలు చూస్తుంటే ఇప్పట్లో ఈ రికార్డుల్ని వేరే ఎవరూ టచ్‌ కూడా చేయలేరని అర్థమవుతోంది. ఒకవేళ శ్రీమంతుడు ఇంతవరకూ టాలీవుడ్‌లో రాని అసాధారణ స్క్రీన్‌ప్లే, అద్భుత విజువల్స్‌తో వస్తే తప్ప మళ్లీ రికార్డు కొట్టే సీనే ఉండదని విశ్లేషిస్తున్నారంతా.

వాస్తవానికి ఈనెల 17న రావాల్సిన శ్రీమంతుడు ఆగష్టు 7 వరకూ వెళ్లిపోయాడు. వాయిదా వేసుకుని మరీ వస్తున్నాడు. ఆ మేరకు కొంత ఒత్తిడి తగ్గినా, కళ్లముందు ఉండే రికార్డు పెద్ద కొండలా కనిపించబోతోందన్నమాట!



Tags:    

Similar News