రేపే పునీత్ చివరి సినిమా విడుదల..!

Update: 2022-10-27 12:43 GMT
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి నెలలు గడిచిపోతున్నా.. సినీ అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పూ అందరినీ శోక సంద్రంలో ముంచేస్తూ.. చాలా చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచిపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. అయితే సినిమాల రూపంలో ఆయన ఎప్పటికీ బ్రతికే ఉంటారని అనుకుంటూ బాధను దిగమింగుకుంటున్నారు.  

దివంగత పునీత్ రాజ్ కుమార్ పూర్తి స్థాయిలో కనిపించిన ఆఖరి సినిమా ''జేమ్స్''. పునీత్ జయంతిని పురస్కరించుకుని మార్చి 17న విడుదలైన ఈ చిత్రం.. మంచి వసూళ్లను రాబట్టింది. థియేటర్లలో ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. అయితే ఆ తర్వాత 'లక్కీ మ్యాన్' అనే కన్నడ చిత్రంలో అప్పూ స్పెషల్ రోల్ లో కనిపించారు. ఇది 'ఓ మై కడవులే' చిత్రానికి అధికారిక కన్నడ రీమేక్.

'లక్కీ మ్యాన్' సినిమాలో దేవుడి పాత్రలో కనిపించారు పునీత్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపనప్పటికీ.. దివంగత నటుడిని మోడ్రన్ దేవుడిగా చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. అయితే ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద పునీత్ రాజ్‌ కుమార్ చివరి దర్శనానికి సమయం వచ్చింది.

పునీత్ ప్రధాన పాత్రలో నటించిన ''గంధడ గుడి'' అనే డాక్యుడ్రామా రేపు శుక్రవారం విడుదల చేయబోతున్నారు. ఫారెస్ట్ లో అడ్వెంచర్ రూపంలో పునీత్ చేసిన సాహసాన్ని ఇందులో చూపించబోతున్నారు. ఇది డాక్యుమెంటరీ తరహాలో సాగే థ్రిల్లర్ అని తెలుస్తోంది.

'గంధడ గుడి' సినిమాని ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అమోఘ వర్ష జెఎస్ తెరకెక్కించారు. PRK ప్రొడక్షన్స్ బ్యానర్ లో పునీత్ సతీమణి అశ్వినీ రేవంత్ ఈ డాక్యుడ్రామాని నిర్మించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం సమకూర్చగా.. ప్రతీక్ శెట్టి సినిమాటోగ్రఫీ నిర్వహించారు.

పునీత్ తండ్రి రాజ్ కుమార్ గతంలో 'గంధద గుడి' అనే పేరుతో కల్ట్ క్లాసిక్ సినిమా తీశారు. దీనికి కొనసాగింపుగా 1995 లో పునీత్ సోదరుడు శివ రాజ్ కుమార్ కూడా ఓ చిత్రం చేశారు. ఇప్పుడు యాదృచ్చికంగా అప్పూ ఆఖరిగా వెండితెరపై కనిపించే సినిమా అదే టైటిల్ తో వస్తోంది.

పునీత్ రాజ్ కుమార్ కు నివాళిగా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు. ఒక రోజు ముందుగా పలు నగరాల్లో స్పెషల్ ప్రీమియర్లు వేయగా.. వాటికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. మరి 'గంధద గుడి' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News