2019లో టాప్ 25 బ‌యోపిక్స్

Update: 2019-01-06 04:30 GMT
2018 ఆద్యంతం బ‌యోపిక్ లు వేడెక్కించాయి. కొన్ని రిలీజై హిట్లు సాధిస్తే - మ‌రికొన్ని ఆన్ సెట్స్ ఉన్నాయి. మ‌రికొన్ని ప్రీప్రొడ‌క్ష‌న్ ద‌శలోనే ఉన్నాయి. కొన్ని ఈనెల‌లో రిలీజ‌వుతున్నాయి. వీట‌న్నిటి ప్ర‌చారం ఓ రేంజులో హోరెత్తుతోంది. ఇక 2019లో ఏకంగా 25 బ‌యోపిక్ లు క్యూలైన్ లో ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఇవ‌న్నీ ఈ ఏడాది ఆద్యంతం వేడెక్కించ‌బోతున్నాయి.

ఎన్టీఆర్ జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్కిన క‌థానాయ‌కుడు జ‌న‌వ‌రి 9న‌, మ‌హానాయ‌కుడు  ఫిబ్ర‌వ‌రి 7న‌ రిలీజ‌వుతున్నాయి. వైయ‌స్సార్ జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్కిన `యాత్ర` చిత్రం ఫిబ్ర‌వ‌రి 8న రిలీజ‌వుతోంది. ఇవేగాక సౌత్‌లో మ‌రో అర‌డ‌జ‌ను బ‌యోపిక్ ల గురించి ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. బ్యాడ్మింట‌న్ కోచ్ పుల్లెల గోపిచంద్ జీవిత‌క‌థ‌తో సుధీర్ బాబు టైటిల్ పాత్ర‌లో ప్ర‌వీణ్ స‌త్తారు ఓ బ‌యోపిక్ ని రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో క‌త్తి వీరుడు కాంతారావు జీవితంపై `రాకుమారుడు` అనే సినిమా తెర‌కెక్కుతోంది. పీసీ ఆదిత్య ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే దాస‌రి బ‌యోపిక్ ఈ ఏడాది సెట్స్ పైకి వెళుతుంద‌ని తెలుస్తోంది. త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, అమ్మ జ‌య‌ల‌లిత జీవితంపై నిత్యామీన‌న్ టైటిల్ పాత్ర‌లో ది ఐర‌న్ లేడి ఫిబ్ర‌వ‌రిలో ప్రారంభం కానుంది.  ప్రియ‌ద‌ర్శిని ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. త‌మిళంలో `ఎంజీఆర్` బ‌యోపిక్ సెట్స్ పై ఉంది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి , ఒలింపిక్ క్వీన్ పివి సింధు జీవిత‌క‌థ‌లో దీపిక ప‌దుకొనే న‌టించే అవ‌కాశం ఉంది. సోనూ సూద్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. బ్యాడ్మింట‌న్ క్వీన్, తెలుగ‌మ్మాయి సైనా నెహ్వాల్ జీవిత‌క‌థ ఆధారంగా శ్ర‌ద్ధా క‌పూర్ టైటిల్ పాత్ర‌లో ఓ బ‌యోపిక్ తెర‌కెక్కుతోంది.

ఈనెల 25న రెండు బ‌యోపిక్ లు రిలీజ‌వుతున్నాయి. కంగ‌న ప్ర‌ధాన పాత్ర‌లో `మ‌ణిక‌ర్ణిక - ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ`, న‌వాజుద్దీన్ సిద్ధిఖీ టైటిల్ పాత్ర‌లో `థాక్రే` ఒకేరోజు రిలీజ‌వుతున్నాయి.  మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ సేన అధినాయ‌కుడు బాల్ థాక్రే జీవిత‌క‌థ ఆధారంగా రూపొందిన థాక్రే వివాదాల గురించి చ‌ర్చ సాగుతోంది. అలాగే గ‌ణిత‌శాస్త్ర‌జ్ఞుడు ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా.. హృతిక్ రోష‌న్  హీరోగా తెర‌కెక్కిన `సూప‌ర్ 30` ఈ ఏడాది రిలీజ్ కానుంది. అక్ష‌య్ కుమార్ టైటిల్ పాత్ర‌లో  హ‌వీల్దార్ ఇషార్ సింగ్ బ‌యోపిక్ `కేస‌రి` సెట్స్ పై ఉంది. బ్యాటిల్ ఆఫ్ స‌రాగ‌రిపై చిత్ర‌మిది. అజ‌య్ దేవ‌గ‌న్ ప్ర‌ధాన‌పాత్ర‌లో ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ ఆస్థానంలో మ‌రాఠా క‌మాండర్  తానాజీ జీవిత‌క‌థ‌ను `తానాజీ` పేరుతోనే రూపొందిస్తున్నారు. మ‌ల్లూవుడ్ శృంగార తార ష‌కీలా జీవిత‌క‌థ ఆధారంగా రిచా చ‌ద్దా టైటిల్ పాత్ర‌లో ఇంద్ర‌జిత్ లంకేష్  తెర‌కెక్కిస్తున్న బ‌యోపిక్ ఇప్ప‌టికే హాట్ టాపిక్ అయ్యింది.  ర‌ణ‌వీర్ సింగ్ టైటిల్ పాత్ర‌లో క‌పిల్ దేవ్ జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కుతున్న 83 సెట్స్ పై ఉంది. అలాగే పానిప‌ట్ యుద్ధం బ్యాక్ డ్రాప్ లో పానిప‌ట్ తెర‌కెక్కుతోంది. అర్జున్ క‌పూర్, సంజ‌య్ ద‌త్ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో అశుతోష్ గోవారిక‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. టీ సిరీస్ గుల్ష‌న్ కుమార్ లైఫ్ పై ` మొఘ‌ల్` సెట్స్ పైకి వెళ్ల‌నుంది. అమీర్ -స‌ల్మాన్ ఎవ‌రు న‌టిస్తారు అన్న‌దానిపై క‌న్ఫ‌ర్మేష‌న్ రావాల్సి ఉంది. ఒలింపిక్ గోల్డ్ మెడ‌లిస్ట్ షూట‌ర్ అభిన‌వ్ బింద్రా జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కే బ‌యోపిక్ కి  క‌న్న‌న్ అయ్య‌ర్ ద‌ర్శ‌కుడు. తండ్రి కొడుకులు అనీల్ క‌పూర్- హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ క‌పూర్ (టైట‌ల్ పాత్ర‌) న‌టించ‌నున్నారు. క్రీడాకారుడు రుద్రాక్ష జేన జీవితం ఆధారంగా- అభ‌య్ డియోల్ టైటిల్ పాత్ర‌లో జంగిల్ క్రై అనే చిత్రం తెర‌కెక్క‌నుంది.

హ‌కీ ఆట‌గాడు ధ్యాన్ చంద్ జీవితం ఆధారంగా `ధ్యాన్ చంద్` చిత్రాన్ని పూజా శెట్టి ప్ర‌క‌టించారు. వ‌రుణ్ ధావ‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టించే ఈ సినిమాకి క‌ర‌ణ్ జోహార్ స‌హ‌నిర్మాత‌. ఐఏఎఫ్ పైలెట్  గుంజ‌న్ స‌క్సేనా జీవిత‌క‌థ ఆధారంగా జాన్వీ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌లో ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ ఓ భారీ చిత్రం తెర‌కెక్కించ‌నుంది. మ‌హిళ‌ల టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ పాత్ర‌లో  తాప్సీ లేదా పీసీ న‌టిస్తార‌ని తెలుస్తోంది. స్పేస్‌ లో ప్ర‌యాణించిన తొలి సైంటిస్ట్ రాకేశ్ శ‌ర్మ జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్క‌నున్న `సారే జ‌హాసె అచ్చా` చిత్రం గురించి వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. రాకేష్ శ‌ర్మ పాత్ర‌లో కింగ్ ఖాన్  షారూక్ న‌టించ‌నున్నారు. ఈ ఏడాది టాప్ 25 బ‌యోపిక్‌ల జాబితా ఇదీ.




Tags:    

Similar News